మాటల యుద్ధం | Sakshi
Sakshi News home page

మాటల యుద్ధం

Published Wed, Sep 9 2015 12:56 AM

War to words of pakistan war

చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో సంప్రాప్తించిన అవమానకరమైన ఓటమి... 1971లో పాకిస్తాన్‌తో వచ్చిన యుద్ధంలో సాధించిన ఘన విజయాల మధ్య 1965లో పాక్‌తోనే జరిగిన మరో యుద్ధం సంగతి ఎందుకో పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కానీ ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా రెండు దేశాల్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో సందడి నెలకొంది. పాకిస్థాన్ ఈ సందర్భాన్ని ‘పాకిస్తాన్ పరిరక్షణ దినం’గా జరుపుతున్నది. లాహోర్ నగరం వరకూ తరుముతూ వెళ్లిన భారత సైనికులను అక్కడ మోహరించిన పాక్ జవాన్లు నిలువరించి ఆ నగరాన్ని కాపాడిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడం ఇందులోని ఉద్దేశం.
 
 ఆ యుద్ధంలో విజయం సాధించినట్టు చెప్పుకోవడం సాధ్యంకాదు గనుక లాహోర్‌ను రక్షించుకోవడాన్నే పాకిస్తాన్ ప్రధానంగా చూపించుకుంటున్నది. ఇక్కడ ఎన్‌డీఏ ప్రభుత్వం ఈసారి నెలరోజులపాటు కొనసాగే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో సదస్సులు, సెమినార్లు, ఎగ్జిబిషన్, విజయోత్సవ ర్యాలీ వంటివి ఉన్నాయి. దేశ పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడి అమరులైన జవాన్లను స్మరించుకోవడం, వారి త్యాగాలను ఈ తరానికి గుర్తు చేయడం ముఖ్యమే. అదే సందర్భంలో దాన్నుంచి మనం నేర్చుకున్న గుణపాఠాలేమిటో... ఆ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులేమిటో, అవి మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలేమిటో చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభజన సృష్టించిన వైషమ్యాలున్నా 1965 నాటి యుద్ధం వరకూ రెండు దేశాలమధ్యా పటిష్టమైన ఆర్థిక బంధం కొనసాగింది. పాక్ ఎగుమతుల్లో 20 శాతం మన దేశానికే ఉండేవి. ఆ దేశం దిగుమతుల్లో మన దేశం వాటా 50 శాతం వరకూ ఉండేది. ఇరు దేశాలూ అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండుచోట్లా ఇరు దేశాల బ్యాంకు శాఖలుండేవి. యుద్ధం సంభవించినప్పుడు జాతీయత, దేశభక్తి వంటివి ముదరడం సహజమే అయినా... అది ఆగిపోయాక ఆ సంబంధాలు పూర్వ స్థితికి ఎందుకు వెళ్లలేకపోయాయన్న ప్రశ్న తలెత్తుతుంది.
 
 అయితే మన దేశంలోగానీ, పాక్‌లోగానీ ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టిన దాఖలా లేదు. దానికి బదులు ఇరు దేశాల మధ్యా ‘మాటల యుద్ధం’ మొదలైంది. గత వారం జరిగిన ఒక సెమినార్‌లో మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ ‘పెనువేగం, స్వల్పకాలిక స్వభావం’ గల భవిష్యత్తు యుద్ధాలకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సరిహద్దు ఆవలి నుంచి అందుకు గట్టి స్పందనే వచ్చింది. ‘దుస్సాహసానికి దిగితే భరింపశక్యంకాని మూల్యం చెల్లించవలసి వస్తుంద’ని ‘శత్రువుల’ను హెచ్చరించారు. ఆ దుస్సాహసం పరిమాణం చిన్నదా, పెద్దదా అనే దాంతో తమకు నిమిత్తం లేదని కూడా ఆయన సెలవిచ్చారు. ఆయన ‘శత్రువులు’ అని బహువచనం వాడినా ఆ మాటలు మన దేశాన్ని ఉద్దేశించినవేనని వేరే చెప్పనవసరం లేదు.
 
  రష్యాలోని ఉఫాలో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానులూ ముఖాముఖి చర్చించుకుని ఉమ్మడి ప్రకటన విడుదల చేశాక ఊహించని రీతిలో తదనంతరం చోటు చేసుకోవాల్సిన జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) సమావేశం ఆగిపోయింది. ఉఫా చర్చల తర్వాత సరిహద్దుల్లో పరస్పర కాల్పులు, ఫలితంగా ఇరువైపులా ఉన్న గ్రామాల్లో పౌరులు మరణించడం, ఇళ్లు ధ్వంసం కావడం వగైరాలతోపాటు అనుకోకుండా హుర్రియత్ వివాదం తెరపైకి రావడమే ఈ పరిణామానికి ప్రధాన కారణం. చర్చలు జరిగుంటే ఉగ్రవాదుల విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరిని ఎత్తిచూపి అది మన దేశంలో సృష్టిస్తున్న సమస్యలను చెప్పడానికి వీలయ్యేది.  ఇలాంటి కీలకమైన సమయంలో చర్చలు అర్థాంతరంగా నిలిచిపోవడం పాకి స్తాన్‌కు లాభదాయకం తప్ప మనకు కాదు. ఈనెల 15న మొదలయ్యే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా మరోసారి నరేంద్ర మోదీ,నవాజ్ షరీఫ్‌ల భేటీ సాధ్యమవుతుందేమోనని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న సమయంలో ఇరు దేశాల మధ్యా నెలకొన్న ప్రస్తుత వైషమ్య వాతావరణాన్ని ఈ మాటల యుద్ధం మరింత పెంచింది.
 
 పనిలో పనిగా పాక్ ఆర్మీ చీఫ్ కశ్మీర్ సమస్యను అక్కడి పౌర ప్రభుత్వానికి వదిలేయకుండా తన నెత్తినేసుకున్నారు. కశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని పరిష్కరిస్తే తప్ప ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం సాధ్యం కాదని అన్నారు. దీనికి మన వైపునుంచి విదేశాంగ శాఖ సహాయ మంత్రి,  ఆర్మీ మాజీ చీఫ్ వి కె సింగ్ కూడా దీటుగానే జవాబిచ్చారు.  
 
  యుద్ధ వార్షికోత్సవాల్లో అప్పటివారు తమ అనుభవాలను నెమరేసుకోవడం, తమ సహచరులు చేసిన త్యాగాలను స్మరించుకోవడం ఉంటాయి. అందులో సహజంగానే ఉద్వేగంపాలు ఎక్కువుంటుంది. కొన్ని సందర్భాల్లో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి. పర్యవసానంగా ఎలాంటి అంచనాలకు రావాలో తెలియని స్థితి ఏర్పడుతుంది. యుద్ధ చరిత్రలనుంచి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందనుకున్నప్పుడు  ఆయా యుద్ధాలకు సంబంధించిన కీలక పత్రాలను వెల్లడించినప్పుడే అది సాధ్యమవుతుంది.
 
 అప్పుడే యుద్ధ చరిత్రకు సాధికారత ఏర్పడుతుంది. అది మినహాయించి నిర్వహించే కార్యక్రమాలన్నీ ఉత్త కలబోతలుగానే మిగులుతాయి. అంత మాత్రమైనా ఫర్వాలేదు. ఆ కలబోతల స్థాయి కూడా దాటి పరస్పర సవాళ్లకు దిగడంవల్ల ఉద్రిక్తతలు పెరగడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇరు దేశాల ప్రధానులూ తిరిగి చర్చలు జరుపుకొనే సందర్భం వస్తున్నప్పుడు సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడేందుకు రెండువైపులా కృషి జరగాలి తప్ప అందుకు విరుద్ధమైన పరిణామాలకు తావీయకూడదు. ఈ సంగతిని అందరూ గుర్తించి ప్రవర్తిస్తేనే ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం సాధ్యమవుతుంది.

Advertisement
Advertisement