కరోనాపై ‘ప్రపంచ’ దర్యాప్తు

20 May, 2020 00:01 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి బారినపడినవారి సంఖ్య 49 లక్షలకు చేరువవు తుండగా ఈ వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలపై అంతర్జాతీయ స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయించడం కీలక పరిణామం. సంస్థ కార్యనిర్వాహక విభాగం ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్‌ఏ) వీడియో కాన్ఫరెన్స్‌లో 120 దేశాలు తీర్మానానికి అనుకూలమని ప్రకటించాయి గనుక చైనాకు కూడా ఇక గత్యంతరం లేకపోయింది. 

వాస్తవానికి ఈ తీర్మానంలో వివాదాస్పద అంశాలేవీ లేవు. యూరప్‌ దేశాలు తెరవెనక చేసిన ప్రయత్నాలు ఫలిం చడం వల్లనే ఇది సాధ్యమైందని తెలుస్తూనేవుంది. చైనాపై నేరుగా ఆరోపణలు చేస్తే తీర్మానం ఆమోదం పొందడం సంగతలావుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంక్షోభంలో చిక్కుకునేది. దర్యాప్తు మొదలైతే దాని ముందు హాజరై జవాబిచ్చుకునే బాధ్యత చైనాపైనే వుంటుంది. వైరస్‌ ఆనవాళ్లు ముందుగా ఆ దేశంలోని వుహాన్‌లో బయటపడ్డాయి గనుక జరిగిందేమిటో, తన వంతుగా తీసుకున్న చర్యలేమిటో, దాన్ని అదుపు చేయడంలో మొదట్లో ఎందుకు విఫలం కావాల్సివచ్చిందో అది వివరిం చక తప్పదు. 

ముందూ మునుపూ తేలేది ఏమైనా ప్రపంచ ప్రజానీకం దృష్టిలో చైనా ‘అనుమానిత దేశం’గా ముద్రపడుతుంది. అయితే తననే ముద్దాయిని చేసేవిధంగా తీర్మానం లేదు గనుక దాన్ని వ్యతిరేకించడానికి చైనా సిద్ధపడలేదు. వాస్తవానికి మొదట్లో దర్యాప్తు ఎందుకంటూ అది అభ్యంతర పెట్టింది. కానీ కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించిన తీరు, ఆ వైరస్‌ పుట్టుక తెలుసుకోవడానికి ‘నిష్పాక్షికమైన, స్వతంత్రమైన, సమగ్రమైన మదింపు’ వేయడానికి అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరపాలని డబ్లు్యహెచ్‌ఓను తీర్మానం కోరడంతో దాన్ని చైనా కాదన లేకపోయింది.  ఆ తీర్మానం పదజాలం ఎలావుండాలో జరిగిన చర్చలో ఆ దేశం కూడా పాల్గొంది. 

అయితే ఇటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీ మోత’ అన్నట్టు వుంది. చైనాను అనుమానిస్తూ ఆయన చేసిన ప్రకటనకు  స్వదేశంలో ఇంతవరకూ పెద్దగా మద్దతు దొరక్కపోయినా ప్రపంచ ఆరోగ్య సంస్థలో క్రమేపీ అన్ని దేశాలూ గొంతు కలిపాయి.  అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ట్రంప్‌ ఏర్పాటు చేసిన కరోనావైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు అయిన ఆంథోనీ ఫాసి ఈ వైరస్‌ మానవ సృష్టి అని చెప్పడానికి ఆధారాల్లేవని ట్రంప్‌ సమక్షంలోనే మొదట్లోనే నిర్మొహమాటంగా చెప్పారు. 

వైరస్‌ జన్యు చిత్రపటాన్ని అధ్యయనం చేస్తే ఇది జంతువుల ద్వారా వ్యాపించింది తప్ప, కృత్రిమంగా రూపొందలేదని తేలిందన్నారు. అత్యంత కీలకమైన జాతీయ ఇంటెలిజెన్స్‌ విభాగం డైరెక్టర్‌ కార్యాలయం సైతం ఈ నెల మొదట్లో ఈ మాటే చెప్పింది. వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ వాటా నిధులను నిలిపేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. 

తీర్మానాన్ని ప్రతిపాదించిన 61 దేశాల్లో మన దేశం కూడా వుండటం సహజంగానే ఆసక్తికరమైనది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సదస్సులో అమెరికా ఆచితూచి మాట్లాడిన తీరు కూడా గమనించదగ్గది. బయట ఇంతవరకూ ట్రంప్‌ ఏం చెప్పినా.. డబ్లు్యహెచ్‌ఓలో మాత్రం చైనా విషయంలో ఆ దేశం బాధ్యతాయుతంగానే మాట్లాడుతోంది. అమెరికా ప్రతినిధిగా పాల్గొన్న ఆరోగ్య మంత్రి అలెక్స్‌ అజర్‌ మాట్లాడుతూ ‘వైరస్‌ విరుచుకుపడుతున్న సంగతిని ఒక దేశం దాచిపెట్టడం వల్ల ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింద’ని అనడమే తప్ప నేరుగా చైనాపై విరుచుకుపడలేదు. 

అయితే డబ్లు్యహెచ్‌ఓను మాత్రం వదల్లేదు. ఆ సంస్థ వైఫల్యం వల్లే పరిస్థితి చేయిదాటిందని విమర్శించారు. ఇంతక్రితం జీ–7 దేశాల విదేశాంగమంత్రుల సదస్సులో ఏమైందో గుర్తుంచుకుంటే డబ్లు్యహెచ్‌ఓలో అమెరికా తీరు మారడానికి కారణమేమిటో అర్థమవుతుంది. మార్చి 25న జీ–7 సదస్సు జరిగినప్పుడు దానికి సారథ్యం వహించిన అమెరికా ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి అందులో ‘వుహాన్‌ వైరస్‌’కు కారణం చైనాయేనంటూ నిందించింది. 

అయితే ఇతర దేశాలు అందుకు అంగీకరించలేదు. కరోనా వైరస్‌ను ‘వుహాన్‌ వైరస్‌’గా చిత్రించడం, చైనానే దోషిగా చేయడం ఉపసంహరించుకుంటే తప్ప తీర్మానాన్ని అంగీకరించలేమని తేల్చిచెప్పాయి. అమెరికా దీనికి ససేమిరా అనడంతో చివరకు ఎలాంటి తీర్మానం లేకుండానే ఆ సదస్సు ముగిసింది. బహుశా డబ్లు్యహెచ్‌ఓలో కూడా అమెరికా పట్టుదలకు పోయివుంటే అదే జరిగేది. కరోనా వైరస్‌ మహమ్మారికి బాధ్యులెవరో తేల్చడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అది ఖచ్చితంగా వెల్లడికావలసిందే. 

అయితే దానికి సశాస్త్రీయమైన, సాధికారికమైన ఆధారాలు సేకరించాలి. అదే జరిగితే కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ ఎటువంటి ఆధారాలూ లేకుండా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ప్రమాదకరమైనది. అలాంటి ధోరణులు ప్రపంచం మరింత సంక్షోభంలో కూరుకుపోయేందుకు దారితీస్తాయి. చైనాయే వైరస్‌ సృష్టికర్త కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చివుంటే అమెరికా శాస్త్రవేత్తలు, అక్కడి ఇంటెలిజెన్స్‌ సంస్థల పెద్దలు ఆ సంగతి చెప్పడానికి సందేహించరు. 

గతంలో ఇలాంటి ప్రమాదకర వ్యాధులను ఎదుర్కొనడంలో చైనాకు తగినంత అనుభవం వున్నా కరోనా విషయంలో అది తొట్రుపాటుకు లోనైన మాట వాస్తవం. మొదట్లోనే దాని తీవ్రతను అంచనా వేసుకుని, తాను చర్యలు తీసుకోవడంతోపాటు ప్రపంచాన్ని హెచ్చరించివుంటే అన్ని దేశాలూ జాగ్రత్త పడేవి. అప్పుడు ఈ స్థాయిలో ప్రపంచమంతా సంక్షో భంలో చిక్కుకునేది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయబోయే దర్యాప్తులో ఈ వైఫల్యాలన్నిటికీ అది జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే వైరస్‌ జన్యువులను అధ్యయనం చేయడంలో తోడ్పాటు నందించాల్సివస్తుంది. ఈలోగా అందరూ సంయమనం పాటించి దర్యాప్తు సక్రమంగా సాగేందుకు సహకరించాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు