మీ బలహీనతలేంటి? | Sakshi
Sakshi News home page

మీ బలహీనతలేంటి?

Published Fri, Aug 1 2014 12:07 AM

మీ బలహీనతలేంటి?

జాబ్ స్కిల్స్
 
మీకున్న బలహీనతలు ఏమిటో వివరంగా చెప్పండి?... వినడానికి ఇది చాలా మామూలు ప్రశ్నగానే అనిపిస్తుంది. కానీ, దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూల్లో రిక్రూటర్లు దీన్ని తరచుగా సంధిస్తుంటారు. అభ్యర్థి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి అతడికి ఉద్యోగం ఇవ్వాలో వద్దో తేల్చేస్తుంటారు. బలహీనతలు లేని మనుషులంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అందరూ అన్ని విషయాల్లో పరిపూర్ణులు కారు. ఈ నిజాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే.
 
మరి, ఇంటర్వ్యూల్లో బలహీనతల గురించి పూసగుచ్చినట్లు  ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయొచ్చా? దీనివల్ల అభ్యర్థి నిజాయతీని మెచ్చుకొని, ఉద్యోగం ఇచ్చేస్తారా? అలా ఇచ్చేయరని నిపుణులు చెబుతున్నారు. బలహీనతల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. హాని కలిగించేవి, కలిగించనవి. కాబట్టి, ఇంటర్వ్యూలో ఇలాంటి వాటిపై ప్రశ్న ఎదురైనప్పుడు చాకచక్యంగా రిక్రూటర్‌కు నచ్చే సమాధానం ఇవ్వాలని సూచిస్తున్నారు.
 
అతిశయోక్తులను ఆశ్రయించొద్దు.
మౌఖిక పరీక్షలో వీక్‌నెస్‌పై ప్రశ్న వేయగానే అభ్యర్థులు కంగారుకు లోనవుతుంటారు. వెంటనే ఏం చెప్పాలో తెలియక తికమక పడుతుంటారు. వెనుకాముందు ఆలోచించకుండా మనసులో ఉన్నది బయటపెడితే ఉద్యోగం దక్కే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగనీ అతిశయోక్తులు కూడా చెప్పొద్దు. నేను చాలా పర్ఫెక్షనిస్టుని, నాలో ఎలాంటి లోపాలు లేవు అని చెబితే మీరు అహంకారులని, గర్వం ఉందని ఇంటర్వ్యూ బోర్డు భావించే ప్రమాదం ఉంటుంది.
 
కొందరైతే ఇతరుల వైఖరి వల్లే తాము బలహీనతలకు లోనవుతుంటామని, అందులో తమ తప్పు లేదని చెబుతుంటారు. నా బృందంలోని సభ్యులు, సహచరులు సరిగ్గా పనిచేయకపోతే నేను సహనం కోల్పోతుంటాను, అదే నా వీక్‌నెస్ అని సమాధానం ఇస్తుంటారు. కానీ, అది సరైంది కాదు. మీలో సహనం, ఓర్పు లేవని రిక్రూటర్ భావిస్తారు.
 
అందరూ పరిపూర్ణులు కారు
నిజానికి బలాలు, బలహీనతలు అనేవి సందర్భానుసారంగా బయటపడుతుంటాయి. ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేందుకు మీలోని నైపుణ్యాలను ఉపయోగించండి. అందరూ పరిపూర్ణులు కారనే విషయం ఇంటర్వ్యూ బోర్డుకు కూడా తెలుసు. మీలోని అసలైన లోపాన్ని వెల్లడించడానికి ఇబ్బందిగా ఉంటే.. ఉద్యోగానికి హాని కలిగించని విధంగా ఏదైనా చెప్పొచ్చు. ఉదాహరణకు.. నాకు లెక్కలంటే భయం అని చెబితే దానివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు.దాన్ని సులభంగా సరిచేసుకొనే అవకాశం ఉంది కాబట్టి రిక్రూటర్ ఆ సమాధానం పట్ల సంతృప్తి చెందుతారు. ఒకవేళ మీలోని అసలైన లోపాలను చెబితే.. అదే సమయంలో వాటిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించాలి. దాన్ని రిక్రూటర్ ఆమోదిస్తారు.
 
మాటల్లో నిజాయతీ ధ్వనించాలి
ఉద్యోగానికి మీరు సరిపోతే.. ఆ విషయాన్ని మరోసారి స్పష్టంగా తెలుసుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తుంది. అందుకే ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, బలాలను, బలహీనతలను తెలుసుకొనేందుకు ప్రశ్నలు వేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి. లోపాలను అధిగమిస్తూ బలాలను మెరుగుపర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేయాలి. కొందరు తమ బలాలను లోపాలుగా మార్చి చెబుతుంటారు. ఎలాగంటే.. నేను పని రాక్షసుడిని(వర్క్‌హాలిక్), పని పూర్తయ్యేదాకా విశ్రమించను అంటుంటారు.
 
అది మంచి లక్షణమే, బలహీనత కాదు కదా! గతంలో కొన్ని తప్పులు చేశాను, వాటి నుంచి పాఠాల నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను అని చెబితే మీలో వ్యక్తిత్వం ఉందని రిక్రూటర్ భావించేందుకు వీలుంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి మాట్లాడే మాటల్లో నిజాయతీ ధ్వనించాలి. అందుకు ముందుగానే సిద్ధం కావాలి. ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటికి ఎలా బదులివ్వాలి అనేది పునశ్చరణ చేసుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మౌఖిక పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగం చేజిక్కించుకోవడం సాధ్యమే.

Advertisement
Advertisement