‘కసరత్తు’తో కొలువుకు దారి! | Sakshi
Sakshi News home page

‘కసరత్తు’తో కొలువుకు దారి!

Published Tue, Sep 9 2014 11:54 PM

‘కసరత్తు’తో కొలువుకు దారి!

ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాత అభ్యర్థులు చేసే పని.. దరఖాస్తు చేయడం, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూడడం. అయితే అంతకన్నా ముందు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చాలామందికి తెలియకపోవడంతో కొలువు సాధనలో విఫలమవుతున్నారు. కాబట్టి దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత కంపెనీ గురించి, ఉద్యోగ బాధ్యతల గురించి తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలి. సంస్థ పనితీరు, అందులో కార్యకలాపాలు, ఉద్యోగుల నుంచి యాజమాన్యం ఆశిస్తున్న లక్షణాలు, దరఖాస్తు చేసుకున్న కొలువుకు అవసరమైన నైపుణ్యాలు..  ఇలాంటి వివరాలను తెలుసుకోవాలి.  
 
 ఉపకరించే కసరత్తు: దరఖాస్తుకు ముందు చేసే ఈ కసరత్తు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటిసారిగా జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే ఫ్రెషర్లకు ఇది చాలా ముఖ్యం. కెరీర్‌ను మార్చుకోవాలని, మరో రంగంలోకి అడుగు పెట్టాలని భావించేవారికి కూడా దీంతో మంచి ఫలితం ఉం టుంది. దీనివల్ల సదరు ఉద్యోగం మీకు తగినదా? కాదా? అనే విషయం తెలిసిపోతుంది. కంపెనీ అవసరాలు, అక్కడి విధివిధానాలకు అనుగుణమైన  రెజ్యుమెను తయారు చేసుకొని పంపించాలి. ఈ కసరత్తు పూర్తిచేయడం వల్ల ఇంటర్వ్యూలో అడగబోయే ప్రశ్నలపై అభ్యర్థులకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఎలాంటి ప్రశ్నలనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంస్థ గురించి ఏమాత్రం తెలుసుకోకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరై తే బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ. కనుక పరిశోధన ద్వారా సేకరించిన వివరాలను బట్టి రెజ్యుమెను రూపొందించుకోవాలి. ఇంటర్వ్యూకు సిద్ధం కావాలి.
 
 జాబ్ రోల్: అభ్యర్థులు అన్నింటికంటే మొదట ఉద్యోగం గురించి తెలుసుకోవాలి. రిక్రూటర్లు ఈ ఉద్యోగానికి ఎలాంటి వారిని ఎంపిక చేయాలనుకుంటున్నారో గుర్తించాలి. కొలువుకు అవసరమైన లక్షణాలు, అర్హతలు తమలో ఉన్నాయో  లేదో సమీక్షించుకోవాలి. దాని ప్రకారం రెజ్యుమెకు మెరుగులు దిద్దాలి. కొలువుకు సరిగ్గా సరిపోతామనే విషయం దీని ద్వారా రిక్రూటర్‌కు తెలియాలి.
 
 కంపెనీ విధులు: కంపెనీ చరిత్ర, అందులో పని వాతావరణం, ఇప్పటి దాకా సాధించిన విజయాలు, ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్ట్‌లు, వారి మేనేజ్‌మెంట్ కల్చర్ వంటివి తెలుసుకోవాలి. తదనుగుణంగా మౌ ఖిక పరీక్షకు సన్నద్ధం కావాలి. ఈ విషయంలో అభ్యర్థులకు సంస్థ వెబ్‌సైట్ ఉపకరిస్తుంది. అందులోకి ప్రవేశించి అవసరమైన వివరాలు తెలుసుకోవచ్చు.
 
 వర్క్ కల్చర్: తమ ఉద్యోగుల కోసం కంపెనీ యాజమాన్యం ఎలాంటి విలువలను, ప్రమాణాలను నిర్దేశించిందో తెలుసుకోవాలి. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి ఇలాంటి సమాచారం సేకరించొచ్చు. సంస్థలో పని సంస్కృతి, ఉద్యోగులకు అప్పగించిన బాధ్యతలు, వారి కెరీర్ బ్యాక్‌గ్రౌండ్, కంపెనీలో ఉద్యోగులు కొనసాగుతున్న సరాసరి కాలం వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైతే ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్లను లేదా సంస్థ మానవ వనరుల విభాగం ప్రతినిధులను సంప్రదించాలి.
 
 నియామక ప్రక్రియ: సంస్థలో ఉద్యోగుల నియామక ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్లు నిర్వహిస్తారు? ఒక్కో రౌండ్ నుంచి రిక్రూటర్ ఆశించే అంశాలు, ఫైనల్ ఇంటర్వ్యూను నిర్వహించే వ్యక్తి.. ఇలాంటి వాటిని తెలుసుకోవాలి. వీటన్నింటివల్ల భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగంపై అభ్యర్థులకు స్పష్టత వస్తుంది. ఇష్టమైన కొలువు సాధించడం సులభమవుతుంది.

Advertisement
Advertisement