హెల్త్‌కేర్‌లో బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ | Sakshi
Sakshi News home page

హెల్త్‌కేర్‌లో బెస్ట్ కెరీర్ ఆప్షన్స్

Published Sat, Jun 28 2014 2:56 AM

హెల్త్‌కేర్‌లో బెస్ట్ కెరీర్ ఆప్షన్స్

జాబ్ పాయింట్: ఆధునిక యుగంలో ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన విసృ్తతమవుతోంది. దీంతో హెల్త్‌కేర్ ఇండస్ట్రీ నూతన సాంకేతిక సొబగులద్దుకొని వేగంగా వృద్ధి చెందుతోంది. హెల్త్‌కేర్‌లోనూ ఎన్నో రంగాలు ఉన్నాయి. సమీప భవిష్యత్తులో బెస్టు కెరీర్ ఆప్షన్‌గా మారనున్న కొన్ని రంగాలు..
 
 డైటీషియన్: సమాజంలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండడంతో డైటీషియన్లకు డిమాండ్ అధికమవుతోంది. బరువు తగ్గించుకోవడం ఎలా? పెంచుకోవడం ఎలా? ఏం తినాలి? ఏం తినకూడదు? వంటి విషయాలు తెలుసుకొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో సందేహాలు తీర్చి, ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తి.. డైటీషియన్. ఒకప్పుడు జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలోనే డైటీషియన్లు ఉండేవారు. ఇప్పుడు ఆసుపత్రుల్లోనూ వీరి సేవలు అందుతున్నాయి. డైటీషియన్ రంగాన్ని ఎంచుకుంటే ఆసుపత్రుల్లో పనిచేయడంతోపాటు సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డైటీషియన్లకు భారీ అవకాశాలున్నాయనేది నిపుణుల మాట.
 
 స్పోర్ట్స్ సైకాలజీ:
సైకాలజీలోని ఒక స్పెషలైజేషన్ స్పోర్ట్స్ సైకాలజీ. నేటి యువత క్రీడలను తమ కెరీర్‌గా మలచుకుంటోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ సైకాలజిస్టులకు మంచి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ అకాడమీల్లో క్రీడాకారులకు మానసికంగా మెరికలుగా తీర్చిదిద్దడం, వారిని ఆటకు సంసిద్ధులను చేయడం వీరి బాధ్యత. భారత క్రీడారంగంలోకి కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ క్రీడా సంస్థలు కూడా ప్రవేశిస్తుండడంతో స్పోర్ట్స్ సైకాలజిస్టులు అవకాశాలు మరింత మెరుగువుతున్నాయి.
 
 స్పీచ్ థెరపీ:
అభివృద్ధి చెందిన దేశాల్లో స్పీచ్ థెరపిస్టులకు భారీ డిమాండ్ ఉంది. వీరికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలున్నాయి. స్పీచ్ థెరపిస్టులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, స్పెషల్ స్కూల్స్, ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేయొచ్చు. నిపుణులైన స్పీచ్ థెరపిస్టులు అమెరికా/యూకే/కెనడా నిర్వహించే అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే కెరీర్‌లో సులువుగా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.
 
 హెల్త్‌కేర్ ట్రైనర్స్/ఎడ్యుకేటర్స్: భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రొఫెషన్ హెల్త్‌కేర్ ట్రైనర్స్/ఎడ్యుకేటర్స్. ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చే ట్రైనర్లకు మంచి డిమాండ్ ఉంది. అధిక జనాభా కలిగిన మన దేశంలో వీరి అవసరం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే అవకాశాలకు ఢోకా ఉండదని చెబుతున్నారు. హెల్త్‌కేర్ ట్రైనర్లు ఆసుపత్రుల్లో సేవలందించడంతోపాటు స్వయం ఉపాధి పొందొచ్చు. హెల్త్‌కేర్ ఎడ్యుకేటర్ నైపుణ్యాలు పెంచుకొని, తగిన అనుభవం సంపాదిస్తే సూపర్‌వైజర్, సీనియర్ హెల్త్ ఎడ్యుకేటర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వంటి హోదాలను అందుకోవచ్చు.
 
 ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్:
హెల్త్‌కేర్ రంగంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ట్రెండ్ ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్. రోగులకు సంబంధించిన మెడికల్, ట్రీట్‌మెంట్ హిస్టరీని ఆధునిక  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అందించేవారే ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్. వీరికి ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో టెక్నికల్ స్టాఫ్‌కు అధిక డిమాండ్ ఉంది. ఈ-హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement