సీడీఎస్‌ఈ... త్రివిధ దళాల్లో తిరుగులేని కెరీర్ | Sakshi
Sakshi News home page

సీడీఎస్‌ఈ... త్రివిధ దళాల్లో తిరుగులేని కెరీర్

Published Thu, Jul 30 2015 2:29 AM

CDSE Amphibious forces to turn Career

 దేశం కోసం పని చేయాలనే ఆశయం కలిగిన యువతకు ఉన్నత హోదాతో కూడిన ఉద్యోగాన్ని అందిస్తుంది.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ). దీనిలో అర్హత సాధిస్తే త్రివిధ దళాల్లో చాలెంజింగ్ కెరీర్‌ను సొంతం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సీడీఎస్‌ఈ(2)-2015
 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో పరీక్ష వివరాలపై స్పెషల్ ఫోకస్.....
 
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా రెండు సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్(సీడీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ(ఐఎంఏ), ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీ(ఐఎన్‌ఏ), హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడ మీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని త్రివిధ దళాల్లో ఉన్నత కొలువుల్లో నియమిస్తారు.
 
 ఖాళీల వివరాలు:
 అకాడమీ    ఖాళీలు
 ఇండియన్ మిలటరీ అకాడమీ    200
 ఇండియన్ నావల్ అకాడమీ    45
 ఎయిర్ ఫోర్స్ అకాడమీ    32
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(పురుషులు)    175
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(మహిళలు)        11
 మొత్తం    463
 
 అర్హతలు:
 ఇండియన్ మిలటరీ అకాడమీలో ప్రవేశాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ. ఇండియన్ నావల్ అకాడమీలో ప్రవేశాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశాలకు డిగ్రీతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివుండాలి. డిగ్రీ చివరి ఏడాది/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారంతా తుది నియామక సమయంలో సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ)కి తమ డిగ్రీ ఉత్తీర్ణత ఒరిజినల్స్ అందివ్వాలి.
 
 వయసు:
 ఐఎంఏ, ఐఎన్‌ఏల్లో ప్రవేశాలకు 1992 జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు అర్హులు.
 ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ప్రవేశాలకు 2016 జూలై1 నాటికి 20-24 ఏళ్ల మధ్య ఉండాలి. 1992 జూలై 2 నుంచి 1996 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి కరెంట్ కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్న వారికి 26 ఏళ్లు వరకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. ఇరవై ఐదేళ్లు దాటిన వివాహిత పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(పురుషులు)లో ప్రవేశాలకు వివాహ/అవివాహ పురుషులు 1991జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(మహిళలు)లో ప్రవేశాలకు అవివాహ మహిళలు 1991 జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
 శారీరక ప్రమాణాలు: ఎత్తు, బరువు వంటి శారీరక ప్రమాణాలు నోటిఫికేషన్‌లో నిర్దేశించిన విధంగా ఉండాలి.
 ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ(స్టేజ్ 1, స్టేజ్ 2); దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థుల ప్రతిభ, ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని వారిని సర్వీస్‌కు ఎంపిక చేస్తారు.
 
 రాత పరీక్ష విధానం:
 రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు. సమాధానాలను గుర్తించేందుకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. పరీక్ష, మార్కులు వివరాలు.
 
 ఇండియన్ మిలటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ
 సబ్జెక్టు    మార్కులు
 ఇంగ్లిష్    100
 జనరల్ నాలెడ్జ్    100
 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్    100
 మొత్తం    300
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ
 సబ్జెక్టు    మార్కులు
 ఇంగ్లిష్    100
 జనరల్ నాలె డ్జ్    100
 మొత్తం    200
 
 ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్:
 సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియ రెండంచెల్లో ఉంటుంది. స్టేజ్-1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్‌లో రేటింగ్‌లో భాగంగా పిక్చర్ పర్సెప్షన్, డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి. స్టేజ్-2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్‌లు ఉంటాయి. స్టేజ్-1లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షలను నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు.
 
 దరఖాస్తు విధానం-ఫీజు:
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.200. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో నేరుగా చెల్లించవచ్చు. లేదా డెబిట్/ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
 
 సిలబస్:
 ఇంగ్లిష్: ఇంగ్లిష్‌లో అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు.జనరల్ నాలెడ్జ్: సమకాలీన అంశాలు, సంఘటనలు, ఈవెంట్స్, చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చదవాలి.మ్యాథమెటిక్స్: పదో తరగతి స్థాయిలోని సంఖ్యా సమితి, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, శాతాలు, లాభ నష్టాలు, కాలం-దూరం, కాలం-పని మొదలైన అర్థమెటిక్ అంశాలతోపాటు, బీజగణితం, త్రికోణమితి, రేఖాగణితం, క్షేత్రమితి, సాంఖ్యక శాస్త్రం నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2015 ఆగస్టు 14
 పరీక్ష తేది: 2015 నవంబరు 1
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
 హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

Advertisement

తప్పక చదవండి

Advertisement