పౌరశాస్త్రం | Sakshi
Sakshi News home page

పౌరశాస్త్రం

Published Mon, Jan 27 2014 10:19 PM

పౌరశాస్త్రం

 లౌకికతత్వం
 భారతీయ సమాజం సర్వధర్మ సమభావనతో ఐకమత్యానికి నిలయంగా ఉంది. దేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు, ఆచార వ్యవహారాలకు చెందిన ప్రజలు ఒకేజాతిగా మనుగడ సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత అనే భావనలు భారతీయ సమాజానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి.

ప్రాచీనకాలం నుంచి భారతీయ సంస్కృతి సర్వమత సమ్మేళనంగా పరిఢవిల్లుతోంది. వివిధ మతాలకు పుట్టినిల్లయిన భారతదేశం విదేశీ మతాలకు కూడా సాదరంగా ఆశ్రయమిస్తూ లౌకికతత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.

 లౌకికం అంటే మతంతో సంబంధం లేనిది. లౌకికవాద పాలన అంటే ఏ మత ప్రమే యం లేకుండా పాలన నిర్వహించడం. ప్రజల మతసంబంధ విషయాల్లో జోక్యం కల్పించుకోని రాజ్యాన్ని లౌకికరాజ్యం అంటారు.

     సర్వమత సహనాన్ని అనుసరించి, దాని గురించి ప్రచారం చేసిన ప్రాచీన భారతదేశ చక్రవర్తి - అశోకుడు.
     అక్బర్ చక్రవర్తి అన్ని మతాల సారాన్ని మేళవించి, ‘దిన్-ఇ-ఇలాహీ’ అనే మతాన్ని స్థాపించాడు.
     మత స్వాతంత్య్రం అనేది రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక హక్కు.

     మన రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో లౌకిక అనే పదాన్ని చేర్చారు.
     లౌకికతత్వాన్ని పెంపొందించే అంతిమ బాధ్యత ప్రభుత్వానిదే.
 
 భారతదేశ లౌకికతత్వ భానవలోని ముఖ్యాంశాలు
     పాలనా వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు.

     దేశంలో రాజ్య (ప్రభుత్వ) మతం లేదు. అంటే భారత్ ఏ మతాన్ని అధికారికంగా గుర్తించలేదు.
     ప్రజల మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు.

     ప్రతి ఒక్కరికీ మతస్వేచ్ఛ ఉంది.
     మత సామరస్యానికి భంగం కలిగించే విశ్వాసాలను ప్రచారం చేయకూడదు.

     ప్రజాధనంతో నిర్వహించే ఏ విద్యాలయంలోనూ మతవిద్య బోధించకూడదు.

     ఎన్నికల ప్రచారంలో మతం, మత చిహ్నాలను ఉపయోగించకూడదు.
 
 ప్రపంచ శాంతి
 శాంతియుత జీవనానికి ఆటంకం కలిగించే ప్రతి అంశం సమాజాభివృద్ధికి అవరోధం కలిగిస్త్తుంది. రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రపంచదేశాలు శాంతియుత సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ప్రచ్ఛన్న యుద్ధానికి కాలుదువ్విన రెండు అగ్రదేశాలు అలీన దేశాల ఆసక్తులను గౌరవించి,  ప్రపంచశాంతిని ప్రపంచదేశాల ఎజెండాగా మార్చాయి.

 శాంతి స్థాపనకు సంబంధించిన లక్ష్యాల సాధన కోసం ఏర్పడిన సంస్థలే నానాజాతి సమితి (1920), ఐక్యరాజ్య సమితి (1945). ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ప్రపంచశాంతి పరిరక్షణకు శాయశక్తులా కృషి చేస్తోంది. భారతదేశ విదేశాంగ విధానానికి మూలసూత్రమైన అలీనవిధానం ప్రపంచశాంతి పటిష్ట తకు ఎంతగానో దోహదపడుతోంది.

     మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమై 1918లో ముగిసింది.
     రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 1945లో ముగిసింది.
     రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు చెందిన హిరోషిమా, నాగసాకి నగరాలు బాంబుదాడికి గురై తీవ్రంగా నష్టపోయాయి.  

     అలీన విధానం అంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్య్ర విధానాన్ని రూపొందించుకుని ప్రపంచశాంతికి కృషి చేయడం. ఈ విధానాన్ని అనుసరించినవే అలీన దేశాలు. దీని రూపశిల్పి భారత ప్రథమ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ. ఈయనకు మార్షల్ టిటో (యుగోస్లేవియా అధ్యక్షుడు), నాసర్ (ఈజిప్ట్ అధ్యక్షుడు) సహకరించారు.

     భారత్, చైనా మధ్య పంచశీల ఒప్పందం  జరిగింది. దీన్ని 28 జూన్ 1954న భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ-ఎన్-లై సంయుక్తంగా అంగీకరించారు.

     ఆసియా దేశాల మొదటి, రెండో సమావేశాలు వరుసగా 1947, 1949లలో ఢిల్లీలో జరిగాయి. వీటి ఏర్పాటులో నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు.

     ఆసియా ఆఫ్రికా దేశాల మొదటి సమావేశం ‘బాండుంగ్’ (ఇండోనేషియా)లో 1955లో జరిగింది. ఈ సమావేశంలోనే అలీన విధానం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.

     అలీనోద్యమ కూటమి (నామ్) 1961లో ఏర్పడింది. దీంట్లో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 118.
     విదేశాంగ విధానం అంటే ఇతర దేశాలతో అనుసరించాల్సిన విధానాలు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తూ, కేంద్ర ప్రభు త్వం విధానాల రూపకల్పన చేస్తుంది.
     ప్రపంచ వ్యవహారాల్లో పోషించాల్సిన పాత్ర గురించి మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సూచించారు.
     భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం - క్రీ.శ. 1962
     కామన్‌వెల్త్ కూటమి అంటే - బ్రిటిషర్లు పాలించిన వలస దేశాల కూటమి. దీంట్లో 53 సభ్యదేశాలున్నాయి. ఇది 1931లో ఏర్పాటయ్యింది.
     భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాలు జరిగిన సంవత్సరాలు - 1948, 1965, 1971, 1991.
     బంగ్లాదేశ్ కారణంగా 1971లో భారత్, పాకిస్థాన్  మధ్య యుద్ధం జరిగింది.
     దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలిని ‘సార్‌‌క’ అంటారు. దీంట్లో సభ్యదేశాల సంఖ్య 8.
     సార్క్‌ను 1985లో స్థాపించారు. దీని మొదటి శిఖరాగ్ర సమావేశం ఢాకా (బంగ్లాదేశ్)లో జరిగింది.
     సార్‌‌క దేశాల ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని భారతదేశంలో, ప్రాంతీయ వ్యవసాయ సమాచార కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లో ఏర్పాటు చేశారు.
     మూడో ప్రపంచ దేశాలు - వలస పాలన నుంచి విముక్తి పొంది, అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని దేశాలు.
     1973లో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ (ఎన్‌ఐఈవో) ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఈ సమావేశం అల్జీర్‌‌స (అల్జీరియా)లో జరిగింది.
 
 ఐక్యరాజ్యసమితి
     1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి (ూ్ఖై) ఆవిర్భవించింది.  
     ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్‌‌క (యూఎస్‌ఏ)లో ఉంది.
     ఐక్యరాజ్యసమితి ప్రధానాంగాలు 6. అవి: సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక- సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, కార్యదర్శివర్గం.
     యూఎన్‌వో సాధారణ సభ సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతుంది.
     భద్రతా మండలి సభ్య దేశాల సంఖ్య 15.
 5  దేశాలకు శాశ్వత సభ్యత్వం, 10 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం ఉంది.
     యూఎన్‌వో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు - రష్యా, యూఎస్‌ఏ, యూకే, చైనా, ఫ్రాన్‌‌స.
     భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం - 2 సంవత్సరాలు.
     భద్రతామండలిలో తీర్మానం నెగ్గాలంటే 5 శాశ్వత సభ్యదేశాలు,  ఏవైనా నాలుగు తాత్కాలిక సభ్యదేశాలు అంగీకరించాలి.
     1948 డిసెంబర్ 10న యూఎన్‌వో మానవ హక్కుల ప్రకటన చేసింది. డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
     శాశ్వత సభ్యదేశాలకు ఉన్న ఈ అధికారాన్ని ‘వీటో అధికారం’ అంటారు. వీటో అధికారం అంటే వ్యతిరేకించే అధికారం.
     భద్రతా మండలికి ఏ దేశంపై అయినా సైనిక చర్యకు ఆదేశించే అధికారం ఉంది.
     వలస పాలన కింద కొనసాగిన భూ    భాగాల ప్రయోజనాలు రక్షించేందుకు ధర్మకర్తృత్వ మండలి కృషి చేస్తుంది.
     అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ది హేగ్ (నెదర్లాండ్‌‌స)లో  ఉంది.

     అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య - 15. పదవీ కాలం 9 ఏళ్లు.
     యూఎన్‌వో ప్రధాన కార్యనిర్వహణాధికారిని ప్రధాన కార్యదర్శి (సెక్రటరీ జనరల్) అంటారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్. ప్రధాన కార్యదర్శి పదవీ కాలం 5 సంవత్సరాలు.
     అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ (ఐబీఆర్‌డీ)ను ప్రపంచ బ్యాంక్‌గా  పిలుస్తారు.
     యూఎన్‌వో సాధారణ సభ 1988లో నిరాయుధీకరణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
     సీటీబీటీ అంటే - సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం. 1995లో జరిగింది.
     ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలనకు కృషిచేస్తున్న సంస్థ - యునెస్కో.
     అంతర్జాతీయ కార్మిక మండలి (ఐఎల్‌వో) లో మనదేశం శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది.
     పేద, ధనిక దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి వ్యూహాలను విల్లీబ్రాంట్ కమిషన్ (1980లో) రూపకల్పన చేసింది.
     యూఎన్‌వో రాజ్యాంగంలో 111 అధికరణలు, 19 అధ్యాయాలు ఉన్నాయి.
     ప్రారంభంలో యూఎన్‌వోలో 50 దేశాలకు  సభ్యత్వం ఉండేది. దీంట్లో ప్రస్తుతం 193 సభ్యదేశాలుగా ఉన్నాయి. 2011లో దక్షిణ సూడాన్ 193వ దేశంగా చేరింది.
     యూఎన్‌వో ధర్మకర్తృత్వ మండలి కార్యకలాపాలను 1994 నుంచి నిలిపివేశారు.  
     అంతర్జాతీయ న్యాయస్థానం భవనాన్ని శాంతి భవనం (పీస్ ప్యాలెస్)గా పిలుస్తారు.
     డాగ్‌హామర్‌‌స (మాజీ సెక్రటరీ జనరల్) యూఎన్‌వోను ‘ప్రజలను స్వర్గానికి తీసుకెళ్లేందుకు కాకుండా, వారిని నరకం నుంచి కాపాడేందుకు ఏర్పడిన సంస్థ’గా అభివర్ణించాడు.
     ఇండియా... యూఎన్‌వోలో  1945లో సభ్యదేశంగా చేరింది.
     యూఎన్‌వో గుర్తించిన అధికార భాషలు ఆరు. అవి: ఇంగ్ల్లిష్, చైనీస్, రష్యన్, స్పానీష్, ఫ్రెంచ్, అరబిక్.
     యూఎన్‌వో చిహ్నం - రెండు ఆలీవ్ కొమ్మలు (శాంతికి చిహ్నం), యూఎన్‌వో పతాకంలో తెలుపు, లేత నీలం రంగులు ఉంటాయి.
     యూఎన్‌వో ఆర్థిక సంవత్సరం - జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు.
 
 యూఎన్‌వో లక్ష్యాలు:
     అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం, అంతర్జాతీయ సహకారాన్ని అందించడం.
     యూఎన్‌వో మొదటి సమావేశం 1945లో లండన్‌లో జరిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement