ఏపీలో టెట్, డీఎస్సీలకు ఒకటే పరీక్ష | Sakshi
Sakshi News home page

ఏపీలో టెట్, డీఎస్సీలకు ఒకటే పరీక్ష

Published Thu, Nov 20 2014 1:41 AM

common exam for DSc, TET in Andhra Pradesh

 ‘టెట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్’గా కొత్త పేరు
 కొత్త నిబంధనల్ని విడుదల చేసిన ప్రభుత్వం

 
 సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్), టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లకు ఇకనుంచి ఉమ్మడిగా ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం బుధవారం జీఓఎంఎస్ నంబర్-38ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ రెండు పరీక్షలు వేర్వేరుగా జరుగుతుండగా ఇపుడీ కొత్త ఉమ్మడి విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు గెజిట్‌లో పేర్కొంది. దీనికి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్‌టీ)గా నామకరణం చేసి కొత్త విధివిధానాలను ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా, మండల ప్రజాపరిషత్తులు, ప్రత్యేక, ఐటీడీఏ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ తదితర సంస్థలకు చెందిన స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులన్నిటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టెట్ కమ్ టీఆర్‌టీ రాతపరీక్షలో ఎస్జీటీ, పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, స్కూల్ అసిస్టెంటు పోస్టులకు 200 మార్కులకు పరీక్షలుంటాయి. మెరిట్, రోస్టర్ విధానంలో నియామకాలు చేపడతారు. నోటిఫికేషన్ వెలువడే నాటికి నిర్దేశించిన విద్యార్హతలు, వృత్తి శిక్షణార్హతలు ఉన్నవారు మాత్రమే ఈ పరీక్షలకు అర్హులు. గతంలో ఏపీ టెట్ రాసిన అభ్యర్థులు, కొత్త ఉమ్మడి పరీక్షలో అర్హతమార్కులు సాధించిన అభ్యర్థులు ప్రస్తుత టీచర్ ఎంపిక పరీక్షలకు అర్హులే. గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లలో స్కూల్ అసిస్టెంటు పోస్టులకు సంబంధించి ఆయా అభ్యర్థుల నిర్ణీత అర్హతలను జీఓలో సబ్జెక్టుల వారీగా పొందుపరిచింది. డిగ్రీతోపాటు బీఈడీ తత్సమాన పరీక్షలను పూర్తిచేసిన వారిని అర్హులుగా పేర్కొంది.
 
 డీఈడీలకు మాత్రమే ఎస్జీటీ పోస్టులు
 
 బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఎస్జీటీ (స్పెషల్ గ్రేడ్ టీచర్) పోస్టులకు అర్హత కల్పిస్తామని మొన్నటివరకూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మొండిచేయి చూపింది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఎస్జీటీ పోస్టులను కేవలం డీఈడీ పూర్తిచేసిన వారికే పరిమితం చేసింది. ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డీఈడీ, తత్సమాన పరీక్షలు పూర్తిచేసినవారు మాత్రమే అర్హులుగా జీఓలో స్పష్టంచేసింది. తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ ం, సంస్కృతం పండిట్ పోస్టులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు అర్హతలను జీఓలో వివరించింది.
 
 పరీక్షల విధానం
 
 స్పెషల్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు నిర్వహించే 180 మార్కుల పరీక్షకు మూడుగంటల సమయాన్ని నిర్దేశించారు. ఇందులో జీకే, శిశు బోధన, భాష, ఇంగ్లిష్ మెథడాలజీ, గణితం మెథడాలజీ, పర్యావరణం మెథడాలజీలపై ప్రశ్నలుంటాయి. భాషా పండితుల పోస్టులకు జీకే, శిశుబోధన, భాష, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లపై 200 మార్కులకు ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, వివిధ సబ్జెక్టులలోని స్కూల్ అసిస్టెంటు పోస్టులకు 200 మార్కులకు పరీక్షలు పెడతారు.
 
 కేటగిరీల వారీగా క్వాలిఫైడ్ మార్కులు
 
 వివిధ కేటగిరీల అభ్యర్థులకు క్వాలిఫైడ్ మార్కులను కూడా జీఓలో వివరించారు. ఓసీలు 60 శాతానికి పైగా, బీసీలు 50శాతం పైగా, ఎస్సీ, ఎస్టీ, ఇతరులు 40 శాతం పైగా మార్కులు సాధించినవారే ఆయా పోస్టుల ఎంపికకు అర్హులుగా పరిగణిస్తారు. వారికి మాత్రమే ఆయా పోస్టులకు అర్హత సాధించినవారిగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు జారీచేస్తారు. గతంలో ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మళ్లీ ఈ ఉమ్మడి పరీక్షను రాయాల్సి ఉంటుంది. వీరు గతంలో సాధించిన టెట్ మార్కులు, ప్రస్తుత ఉమ్మడి పరీక్షలో సాధించిన మార్కులను అనుసరించి ఏది ఎక్కువగా ఉంటే దానికి అనుగుణంగా 20 శాతం వెయిటేజీని ఇస్తారు. ఈ ఉమ్మడి పరీక్ష ఏడాది కాలపరిమితికే ఉంటుంది.
 
 ఎంపిక కమిటీ
 
 పరీక్షలో అర ్హత మార్కులు సాధించిన వారిని పోస్టులకు ఎంపిక చేయడానికి జిల్లాల స్థాయిలో ఎంపిక కమిటీలను ఏర్పాటుచేస్తారు. జిల్లా కలెక్టర్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్, డీఈఓ కార్యదర్శిగా ఉండే ఈ కమిటీలో జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్, ఐటీడీఏ పీఓ సభ్యులుగా ఉంటారు.
 

Advertisement
Advertisement