‘ఈ’ నైపుణ్యాలుంటే కొలువు మీదే! | Sakshi
Sakshi News home page

‘ఈ’ నైపుణ్యాలుంటే కొలువు మీదే!

Published Wed, Jun 17 2015 11:06 PM

‘ఈ’ నైపుణ్యాలుంటే కొలువు మీదే!

 ఉద్యోగ నియామకాలకు కీలకమవుతున్న కంప్యూటర్ పరిజ్ఞానం
  కంప్యూటర్, ఇంటర్నెట్ లిటరసీతో విజయాలకు చేరువగా...

 
 మానవ జాతి పయనాన్ని ఎన్నో ఆవిష్కరణలు అద్భుతమైన మలుపులు తిప్పాయి. నిప్పు నుంచి మొదలు కరెంటు, ఆవిరియంత్రం, రైలు, విమానం, ముద్రణాయంత్రం, టీవీ ఇలా ఎన్నో వస్తువులు మనిషి జీవితాన్ని విలువైనదిగా మార్చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే కంప్యూటర్ ఒక ఎత్తు. ఆన్‌లైన్లో ఆరటి పండ్లు కొనడానికైనా, అంతరిక్షంలోకి సుదూర యాత్రలకైనా కంప్యూటర్ అవసరం పెరిగిపోయింది. అందుకే నేడు ‘కంప్యూటర్ అక్షరాస్యత  ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించనున్నారనే వార్తల నేపథ్యంలో అభ్యర్థులకు అవసరమైన కంప్యూటర్ నైపుణ్యాలపై ఫోకస్...
 
 
 కంప్యూటర్ పరిజ్ఞానం ఎందుకు?
 ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్ ప్రాధాన్యం పెరిగింది.
 ప్రభుత్వ విభాగాల్లో కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ సేవల విస్తరణలో వేగం పుంజుకుంది.
 ఈ-పాలనను సుసంపన్నం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
 ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే అవకాశం ఉంది.
 ప్రభుత్వ, ప్రైవేటు కొలువులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అర్హతగా మారుతోంది.
 ఇప్పటికే బ్యాంకు ఉద్యోగ నియామక పరీక్షల్లో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
 
 అవసరమైన కంప్యూటర్ నైపుణ్యాలు
 రోజువారీ కార్యకలాపాలకు అవసరమయ్యే కంప్యూటర్ ప్రాథమిక నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి.
 కంప్యూటర్ ఇన్‌పుట్, అవుట్ పరికరాల పనితీరు, ఉపయోగాలపై అవగాహన అవసరం.
 ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బేసిక్స్‌ను నేర్చుకోవాలి.
 ఓ అంచనా ప్రకారం దేశంలో ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ 2020 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. దేశంలో ఇంటర్నెట్ విస్తృతిని దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు.
 అందుకే ఇంటర్నెట్ ప్రయోజనాలు ఏమిటి? వాటిని ఎలా పొందవచ్చో తెలుసుకోవాలి. ఈ-మెయిలింగ్ నైపుణ్యాలు, వేగంగా అక్షరాలను టైప్ చేయగల నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి.
 
 ఏ అంశాలను నేర్చుకోవాలి?
  విండోస్ ఎక్స్‌పీ/7/8: ఇందులో ఇంట్రడక్షన్ టు విండోస్, డెస్క్‌టాప్, బేసిక్ మౌస్ ఆపరేషన్స్, మై కంప్యూటర్, డెస్క్‌టాప్ సెట్టింగ్స్, ఫోల్డర్, నోట్‌ప్యాడ్ తదితర అంశాలుంటాయి. ఎంఎస్ వర్డ్: డాక్యుమెంట్; లే అవుట్, టూల్‌బార్, టాస్క్ ప్యాన్; హెడర్ అండ్ ఫుటర్; కామెంట్స్, ఆబ్జెక్ట్స్; సింబల్స్ అండ్ ఈక్వేషన్స్; పిక్చర్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ చార్ట్స్, టేబుల్స్; ఫార్మేటింగ్ ఫండమెంటల్స్; పేజ్ సెటప్, ప్రింట్ వ్యూ, ప్రింట్ వంటి అంశాలుంటాయి.: కంటెంట్స్ ఆఫ్ ఏ వర్క్‌షీట్, వర్క్‌బుక్, ఎడిటింగ్ డేటా, ఎడిటింగ్ ది వర్క్‌షీట్, ఫార్మేటింగ్ ది ఉ్ఠఛ్ఛి షీట్స్, టేబుల్, సెల్ స్టయిల్స్, ఫిల్ ది సెల్స్, ఇలుస్ట్రేషన్స్, చార్ట్స్, ఫార్ములాస్, ఇంపోర్ట్ ది డేటా, డేటా టూల్స్, పేజ్ సెటప్-ప్రివ్యూ-ప్రింట్ వంటివి ఉంటాయి.

 పవర్ పాయింట్: ప్రెజెంటేషన్, ఎంటరింగ్-ఎడిటింగ్ టెక్స్ట్, డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పవర్ పాయింట్, పవర్ పాయింట్ ఆబ్జెక్ట్స్, ఇలుస్ట్రేషన్స్, గ్రాఫ్స్, యానిమేషన్ అండ్ ట్రాన్సిషన్స్, స్లయిడ్ షో వంటి అంశాలను నేర్చుకోవాలి. మైక్రోసాఫ్ట్ యాక్సెస్: క్రియేటింగ్ న్యూ డేటాబేస్, ఓపినింగ్ ఎక్సిస్టింగ్ డేటాబేస్, క్రియేట్ టేబుల్, క్రియేటింగ్ క్వెరీ, క్రియేటింగ్ ఫాం, క్రియేటింగ్ రిపోర్ట్స్, క్రియేటింగ్ పేజెస్, ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్‌పోర్టింగ్. ఇంటర్నెట్‌కు సంబంధించి నేర్చుకోవాల్సినవి: బ్రౌజర్, సైబర్ స్పేస్, డొమైన్ నేమ్, డౌన్‌లోడ్, ఈ-మెయిల్, హోంపేజ్, హెచ్‌టీఎంఎల్, హెచ్‌టీటీపీ, హైపర్ టెక్స్ట్, లింక్, సెర్చ్ ఇంజన్, యూఆర్‌ఎల్, వెబ్‌సైట్, వెబ్‌పేజ్ తదితరాలకు సంబంధించి అవగాహన అవసరం.
 
 ఎక్కడ నేర్చుకోవాలి?
 మార్కెట్లో దీనికి సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు రెండు గంటలు (గంట థియరీ, గంట ప్రాక్టికల్) చొప్పున నెల రోజుల్లో శిక్షణ పూర్తిచేసే అవకాశం కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. గరిష్టంగా రూ.2 వేలుతో శిక్షణ పూర్తిచేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తుంటారు. వీటిని ఉపయోగించుకోవచ్చు.
 
 ఎవరు నేర్చుకోవచ్చు?
 పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్న ప్రతి ఒక్కరూ అవసరాల మేరకు కంప్యూటర్ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. ఎంఎస్‌ఎంఈ అయితే ఇంటర్ ఉత్తీర్ణులకు శిక్షణ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తున్నారు.
 
 ఇప్పుడే కంప్యూటర్ లిటరసీ దిశగా అడుగేయండి...
 కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారైనా, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నా కంప్యూటర్ లిటరసీ ప్రధానం. నియామక పరీక్షల్లో వివిధ దశల్లో విజయం సాధించి, ఉద్యోగాల్లో చేరాక కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం లేక పనిచేసే చోట ఎదిగే అవకాశాలను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే కంప్యూటర్‌కు సంబంధించి బేసిక్స్‌పై థియరీ, ప్రాక్టికల్స్ పరంగా పట్టు సాధించడం ఈ రోజుల్లో ముఖ్యమన్నది గుర్తించాలి. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బేసిక్స్ పరిజ్ఞానం సంపాదించేందుకు ప్రయత్నించాలి. కొద్ది పాటి ఖర్చుతోనే మార్కెట్లో ఈ నైపుణ్యాలు అందించే ఇన్‌స్టిట్యూట్‌లు చాలానే ఉన్నాయి. ఎప్పుడో అవసరమైనప్పుడు చూద్దాంలే అని అనుకోకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలోనే కంప్యూటర్, ఇంటర్నెట్ అక్షరాస్యులుగా మారడం వల్ల జాబ్ మార్కెట్లో ముందు వరుసలో
 నిలవచ్చు.
 - ఎన్.రామకోటేశ్వరరావు,
 పీర్స్ టెక్నాలజీస్.

 

Advertisement
Advertisement