ఇంజనీరింగ్ ఫస్టియర్..భవిష్యత్తుకు తొలి మెట్టు | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ ఫస్టియర్..భవిష్యత్తుకు తొలి మెట్టు

Published Tue, Aug 30 2016 2:39 AM

ఇంజనీరింగ్ ఫస్టియర్..భవిష్యత్తుకు తొలి మెట్టు

ఇంజనీరింగ్ స్పెషల్
 తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లతో పాటు యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు, వివిధ టాప్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు చాలా మంది బాగా రాణిస్తున్నారు. కానీ, అనేక ప్రైవేటు కళాశాలల్లో చేరే విద్యార్థుల పరిస్థితి భిన్నంగా ఉంది. వారు చదువుల్లో వెనకబడుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేక ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ఇంటర్ వరకు 75 నుంచి 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు సైతం.. ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి పాస్ కావడానికి నానా తంటాలు పడుతున్నారు. గత కొన్నేళ్ల మొదటి సంవత్సరం ఫలితాలే అందుకు నిదర్శనం.
 
 మ్యాథ్స్‌లో ఎక్కువ మంది ఫెయిల్
 జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ), హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో 70 నుంచి 73 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. 2014-15 విద్యా సంవత్సరంలో ఫస్టియర్ విద్యార్థులు 29 శాతం మంది మాత్రమే తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణులయ్యారు. ఇది 2015-16లో 27.8 శాతం. వీరిలో అత్యధికంగా మ్యాథ్స్, డేటా స్ట్రక్చర్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్టుల్లో తప్పుతున్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక అంశాలపై పట్టు లేకపోవడం, తెలుగు మీడియం నేపథ్యం ఉండడం, ఇంటర్ నుంచి ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి రిలాక్స్ అయ్యే ప్రవృత్తిని అలవరచుకోవడం తదితర కారణాల వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్‌లో తప్పుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైతేనే తర్వాత ఇంజనీరింగ్‌లో మెరుగ్గా రాణించడానికి అవకాశం ఉంటుందని, ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవడానికి తొలి ఏడాదే కీలకమని చెబుతున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎంపీసీ చదివినా, ఇంజనీరింగ్ మ్యాథ్స్‌లోనే ఎక్కువ మంది విద్యార్థులు బోల్తా పడుతున్నారు.
 
 ఈ ఏడాది నుంచి సెమిస్టర్  విధానం
 ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పరీక్షలు వార్షికంగా నిర్వహించేవారు. కానీ, ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ నుంచే సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్ ఇయర్‌లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు మ్యాథ్స్‌లో ఫెయిల్ అవుతున్నారు. 2013కు ముందు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 35 శాతంగా ఉండేది. కానీ, తర్వాత పరీక్ష విధానం కాస్త కఠినంగా మారడంతో ఉత్తీర్ణత శాతం తగ్గింది. దీనికి కారణాలను ప్రశ్నల వారీగా విశ్లేషించి వాటిని స్థిరీకరించి కొత్త సెమిస్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. సెమిస్టర్ విధానంతో విద్యార్థికి సిలబస్ భారం తగ్గుతుంది. దీంతో తరగతులు ప్రారంభమైన నాటి నుంచే చదవడం ప్రారంభిస్తారు. కాబట్టి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మొదటి రోజు నుంచి రెగ్యులర్‌గా తరగతులకు హాజరుకావడం, ఏ రోజు అంశాలను ఆ రోజే చదవడం, ఫ్యాకల్టీని అడిగి ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసుకుంటే..  ఎంతటి కఠినమైన సబ్జెక్టులోనైనా ఉత్తీర్ణులు కావచ్చు.
  - డా. ఏవీఎస్‌ఎస్ కుమారస్వామి గుప్త, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, జేఎన్‌టీయూ, హైదరాబాద్.
 
 కీలకమైన మొదటి ఏడాదిలో రాణించేందుకు నిపుణుల సూచనలు..
 సెల్ఫ్ లెర్నింగ్  అలవరచు  కోవాలి
ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు మొదట సెల్ఫ్ లెర్నింగ్‌ను అలవరచుకోవాలి. ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే పునశ్చరణ చేసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా.. నాలెడ్జ్ పెంచుకోవడానికి, నైపుణ్యాభివృద్ధికి కృషిచేయాలి. ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులకు స్ఫూన్ ఫీడింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్‌లో దీనికి అవకాశం ఉండదు. సెల్ఫ్ లెర్నింగ్‌ను అలవరచుకోవాల్సిందే. నిత్యం నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఇంజనీరింగ్ సబ్జెక్టులపై పట్టు సాధిస్తే భవిష్యత్ కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ముఖ్యంగా క్లిష్టంగా భావించే మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  - డా. ఎ.గోవర్ధన్,
 ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్, జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.

 
 బేసిక్స్‌పై అవగాహన అవసరం
 విద్యార్థులకు మ్యాథ్స్ బేసిక్స్‌పై అవగాహన ఉండటం లేదు. ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్, క్యాలిక్యులస్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఇంటర్మీడియెట్ పుస్తకాల్లోని అంశాలను రివిజన్ చేయడం ఉత్తమం. విద్యార్థులకు ఇంటర్‌లో బట్టీ విధానం వల్ల బాగానే మార్కులు వస్తున్నాయి. కానీ, ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ప్రశ్నలు ఉంటాయి. దీంతో విద్యార్థులు మ్యాథ్స్‌లో వెనుకంజలో ఉంటున్నారు. బేసిక్స్ నేర్చుకుంటే ఇంజనీరింగ్ మ్యాథ్స్ చాలా సులువు.
 
 - డా. వి.నాగరాజు, హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్,
 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ.

 

Advertisement
Advertisement