లలిత కళలు.. కళాత్మక కొలువులు | Sakshi
Sakshi News home page

లలిత కళలు.. కళాత్మక కొలువులు

Published Fri, Sep 12 2014 1:39 AM

లలిత కళలు.. కళాత్మక కొలువులు - Sakshi

సౌందర్య విలువలను నిండా నింపుకున్న లలితకళలు.. నేడు కుర్రకారుకు కొత్త  కొలువులను అందించేందుకు  వేదికలు అవుతున్నాయి. శిల్ప కళ, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, ఫొటోగ్రఫీ.. ఇప్పుడు హైటెక్ హంగులతో కాసుల వర్షం కురిపించే ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయాలు ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా.. భాగ్యనగరం విద్యార్థులు వీటివైపు ఆకర్షితులవుతున్నారు. కళాత్మక కెరీర్ దిశగా అడుగులేస్తున్నారు..!
 
 ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుండటం,మార్కెట్ అవసరాల కారణంగా ప్రస్తుతం లలితకళలు (ఫైన్ ఆర్ట్స్) కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు బాగా పెరిగాయి. వ్యవస్థీకృత రంగంతో పాటు అవ్యవస్థీకృత రంగంలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యాయి. ఫిక్కీ, కేపీఎంజీ నివేదిక ప్రకారం- 2013లో దేశంలో ప్రసారమాధ్యమాలు, వినోద రంగం మార్కెట్ విలువ రూ.91,800 కోట్లకు చేరింది. మరో నాలుగేళ్లలో ఇది లక్షా 78 వేల కోట్ల రూపాయలకు చేరనుంది. ఇలాంటి పరిస్థితుల్లో శిల్పకళ, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, ఫొటోగ్రఫీ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయి.
 
 సృజనాత్మకత, వ్యక్తిగత ఆసక్తి:

 ఫైన్ ఆర్‌‌ట్స కోర్సులను అభ్యసిస్తే లభించే ఉద్యోగాలు.. విజువలైజింగ్ ప్రొఫెషనల్, ఇలస్ట్రేటర్, ఆర్ట్ క్రిటిక్, ఆర్టిస్టు, ఆర్ట్ ప్రొఫెషనల్, డిజైన్ ట్రైనర్ వంటివి. లలితకళా రంగంలో కెరీర్‌లో రాణించడమనేది సృజనాత్మకత, వ్యక్తిగత ఆసక్తి స్థాయి, అనుభవం, మార్కెట్‌పై అవగాహన, స్వయం ప్రేరణ తదితరాలపై ఆధారపడి ఉంటుంది.
 
 కోర్సులు..:
* పెయింటింగ్, డ్రాయింగ్
* ఇలస్ట్రేషన్
* డ్యాన్స్
* కామిక్స్
* ప్రింట్ మేకింగ్, ఇమేజింగ్
*  ఫొటోగ్రఫీ
* అప్లైడ్ ఆర్ట్
*  థియేటర్
* ఆర్కిటెక్చర్
*  స్కల్‌ప్చర్.
 
 పెయింటింగ్:
 మార్కెట్ అధ్యయనాల ప్రకారం- అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిని చిత్రరాజాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి వేలంలో అధిక మొత్తాలకు అమ్ముడుపోతున్నాయి. దేశంలో పెయింటింగ్ మార్కెట్ 2005తో పోల్చితే 90 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఉద్యోగాల్లో చేరాలనుకునే వారు పత్రికలు, మ్యాగజైన్లు వంటి ప్రచురణ రంగంలో ఇలస్ట్రేటర్‌గా; చిత్ర రంగంలో ఆర్ట్ డెరైక్టర్‌గా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఆర్ట్ క్రిటిక్, కార్టూనిస్టు, యానిమేటర్, టెక్స్‌టైల్ డిజైనర్ వంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సొంతంగా ఆర్ట్ స్టూడియోలను ఏర్పాటు చేసుకోవచ్చు.
 
 ఫొటోగ్రఫీ:
 ఫొటోగ్రఫీ కోర్సులు పూర్తిచేసిన వారికి పత్రికా సంస్థలు, జర్నళ్లు, టీవీ చానెళ్లలో అవకాశాలుంటాయి. ప్రకటనల సంస్థలు, ఫ్యాషన్‌హౌస్‌ల్లోనూ ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేయొచ్చు.
 
 యానిమేషన్:
 యానిమేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి వినోద, ప్రకటనల పరిశ్రమలో ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. ఇంజనీరింగ్, మెకానికల్ డిజైనింగ్, గేమింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం అన్ని రంగాల్లో యానిమేటర్ల అవసరం పెరగడంతో మంచి అవకాశాలు తలుపుతడుతున్నాయి.
 
 నైపుణ్యాలు:  లలిత కళా రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను పరిశీలిస్తే..
*  ఉన్నతస్థార ుు సృజనాత్మకత
* రంగులు, ఆకారాలపై అవగాహన
* స్వయం ప్రేరణ
 ఊ బృంద స్ఫూర్తి. ఒంటరిగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
 * మార్కెటింగ్ నైపుణ్యం
 * మారుతున్న పరిస్థితులకు తగినట్లు పనితీరును మార్చుకోవడం
 * సాంకేతిక నైపుణ్యాలు
 
 ఫైన్ ఆర్‌‌ట్స కోర్సులు ఎన్నో..
 శిల్పం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ వంటివి లలితకళలు(ఫైన్‌ఆర్ట్స్)గా చెప్పొచ్చు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఫైన్‌ఆర్ట్స్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ వరకు కోర్సులున్నాయి. అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్ వంటివాటిలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), మాస్టర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్(ఎంఎఫ్‌ఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ అర్హతతో బీఎఫ్‌ఏలో ప్రవేశించవచ్చు.
 
   అవకాశాలకు  వేదికలు:
 ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు కల్పించే వేదికలు.. యానిమేషన్, అడ్వర్టైజింగ్ కంపెనీలు, ఆర్ట్ స్టూడియోలు, టెక్స్‌టైల్ పరిశ్రమ, డ్యాన్స్ స్టూడియోలు, డిజిటల్ మీడియా, ఫ్యాషన్ సంస్థలు, పత్రికలు-టీవీ ఛానళ్లు-ఆన్‌లైన్ సంస్థలు.
 
 డ్యాన్స్/కొరియోగ్రఫీ:
 కొన్నేళ్ల కిందటి వరకు డ్యాన్సర్లకు అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రస్తుతం స్టేజ్ ప్రదర్శనలు, సినిమాల్లో కొరియోగ్రఫీకి సంబంధించి అవకాశాలు పెరిగాయి. సంప్రదాయ నృత్య రీతులు మొదలు సల్సా, బాల్‌రూమ్, లాటిన్ డ్యాన్స్ వంటి అధునాతన నృత్య రీతుల కళాకారులకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో వివిధ అంశాల్లో కోర్సులు పూర్తిచేసిన వారు డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్లుగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. విద్యా సంస్థల్లోనూ మంచి అవకాశాలుంటాయి. ప్రారంభంలోనే నెలకు రూ.25 వేల వరకు ఆర్జించవచ్చు.
 
 అందుబాటులో వేలాది ఉద్యోగాలు

 శ్రీఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.  ఫైన్ ఆర్ట్స్ అంటే కేవలం బొమ్మలు గీసి ఉపాధి పొందడమని చాలా మంది భావిస్తారు. వాస్తవానికి శిల్ప కళ, పెయింటింగ్, అప్లయిడ్ ఆర్ట్, ఫొటోగ్రఫీ, యానిమేషన్ తదితర ఆర్ట్స్ పరిశ్రమల్లో ఏటా వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి. యానిమేషన్.. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా దూసుకెళ్తోంది. ఏదైనా పరిశ్రమ స్థాపన నుంచి దాని ఉత్పత్తులు వినియోగదారుడికి చేరే వరకు లోగో డిజైన్, పబ్లిసిటీ, మార్కెటింగ్ తదితర అన్ని దశల్లోనూ ఆర్టిస్ట్ అవసరం ఉంటుంది. ఫొటోగ్రఫీ, యానిమేషన్, అప్లయిడ్ ఆర్ట్ విభాగాల్లో నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి ఫైన్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. ఆసక్తితోపాటు డ్రాయింగ్, సృజనాత్మక నైపుణ్యాలున్న అభ్యర్థులు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు.
 
  ఫైన్‌ఆర్ట్స్ కోర్సుల్లో భాగంగా సిలబస్‌కు సంబంధించిన స్కిల్స్‌లో ప్రావీణ్యం పొందుతారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా, సరికొత్త ఆలోచనా నైపుణ్యాలు వృద్ధి చెందేలా సిలబస్‌ను రూపొందించాం. కేవలం వృత్తి నైపుణ్యాలమీదే దృష్టి సారించకుండా.. అన్ని విభాగాల్లో రాణించేందుకు వీలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. సిలబస్‌లోని అంశాలన్నీ పుస్తకాల్లో లభించవు. వాటిని స్వీయ అనుభవాలతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్‌లో వివిధ విభాగాల్లో బ్యాచిలర్‌తోపాటు మాస్టర్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కోర్సును అభ్యసిస్తున్న సమయంలోనే ఏదైనా సంస్థలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ) అభ్యర్థులకు ఏడాది పొడవునా ప్లేస్‌మెంట్స్ జరుగుతుంటాయి.
 - ప్రొఫెసర్ బి.శ్రీనివాస రెడ్డి,
 ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్,
 జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్
 యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), హైదరాబాద్

Advertisement
Advertisement