Sakshi News home page

ఆఫీస్ విందుల్లో ప్రవర్తన ఎలా!

Published Wed, Oct 29 2014 1:04 AM

ఆఫీస్ విందుల్లో ప్రవర్తన  ఎలా!

కార్యాలయాల్లో పనిచే సే ఉద్యోగుల మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేసేందుకు, వారిలో పునరుత్తేజం నింపేందుకు, ప్రమోషన్, వీడ్కోలు లాంటి సందర్భాల్లో యాజమాన్యాలు విందులను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ విందుల్లో ప్రవర్తన హూందాగా ఉంటేనే ఆఫీస్‌లో గౌరవం పెరుగుతుంది. ఎలా మెలగాలో తెలియకపోతే నలుగురిలో అభాసుపాలు కావాల్సి వస్తుంది. ఆఫీస్ పార్టీల్లో ప్రవర్తన గురించి తెలుసుకుంటే పొరపాట్లకు ఆస్కారం ఉండదు.
 
 మీరు మీలాగే..
విందుల్లో సహచరులతో సంభాషించేటప్పుడు మీరు మీలాగే సహజంగా ఉండండి. అహంభావం, అతిశయం వద్దు. కృత్రిమంగా ప్రవర్తించొద్దు. ఇలా చేస్తే మీ నటన ఎదుటివారికి వెంటనే తెలిసిపోతుంది. మీపై చిన్నచూపు కలుగుతుంది. సహోద్యోగులతో ఆరోగ్యకరమైన సంబంధాలను నాలుగు కాలాలపాటు కొనసాగించాలంటే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడొద్దు.
 
 చొరవ తీసుకోండి
 పార్టీలో ఒకచోట బిగుసుకుపోయి కూర్చోవడం సరికాదు. మీరే చొరవ తీసుకొని ఇతరులతో ఆహ్లాదకరమైన సంభాషణ ప్రారంభించండి. కలివిడితనం అవసరం. దీంతో మీరు నలుగురి దృష్టిలో వెంటనే పడతారు. మంచి గుర్తింపు వస్తుంది. అదేసమయంలో పుకార్లు పుట్టించేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల్లో తప్పులు వెతికి, బయట ప్రచారం చేస్తారు. అందుకే వారితో ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది.
 
 వినే లక్షణం
 మీరు మాట్లాడడమే కాదు, ఎదుటివారికి కూడా నోరువిప్పే అవకాశం ఇవ్వండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. నచ్చితే అభినందించండి. తగిన సలహాలు ఇవ్వండి. దీనివల్ల వారి దృష్టిలో మీ విలువ కచ్చితంగా పెరుగుతుంది. ఇతరులు చెప్పేది పూర్తిగా వినాలంటే ఓర్పు, సహనం ఉండాలి.
 
 వివాదాస్పద అంశాలొద్దు
 సంభాషణలో కులం, మతం, ప్రాంతం, వర్గం... ఇలాంటి వివాదాస్పద, సున్నితమైన అంశాలకు చోటు కల్పించకండి. వీటిని ప్రస్తావిస్తే మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇరువురి మధ్య ద్వేషం మొదలవుతుంది. కాబట్టి అప్రమత్తతే ప్రధానం. సంభాషణ ద్వారా కొత్త విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించండి. స్పోర్ట్స్, ట్రావెలింగ్ లాంటి వాటిపై మాట్లాడుకోవచ్చు.
 
 సమయ పాలన
 సమయ పాలన ప్రతి ఒక్కరికీ అవసరం. ఆఫీస్ పార్టీలకు సమయానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్తే సహోద్యోగుల్లో మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. సహచరుడికి పదోన్నతి, బదిలీ అయినవారికి వీడ్కోలు లేదా పదవీ విరమణ.. ఇలా విందు ఉద్దేశం ఏమిటో ముందే తెలుసుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా సిద్ధమై వెళ్లాలి. వ్యక్తుల గురించి తెలియజేసేవి.. వారి మాటతీరు, ప్రవర్తనే. ఈ రెండూ సక్రమంగా ఉండేలా చూసుకుంటే.. ఆఫీస్ పార్టీల ను హూందాగా పూర్తిచేసుకొని రావొచ్చు.

Advertisement
Advertisement