కర్షక మిత్రుడికి నిండైన పురస్కారం | Sakshi
Sakshi News home page

కర్షక మిత్రుడికి నిండైన పురస్కారం

Published Thu, Dec 19 2013 2:20 PM

interview with icrisat scientist Dr.Hari d upadhyaya

వ్యవసాయ కోర్సులంటే ఇప్పటికీ కొందరు విద్యార్థులకు చిన్నచూపే! కానీ, దశాబ్దాల కిందటే ఆయన ఈ కోర్సుల ఉజ్వల భవిష్యత్తును గుర్తించి.. ఆ దిశగా అడుగులేశారు. అహర్నిశలూ శ్రమిస్తూ ప్రపంచ ప్రఖ్యాత క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా నుంచి క్రాప్ సైన్స్ రీసెర్చ్ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగారు.. ఆయనే ఇక్రిశాట్ జీన్ బ్యాంక్ హెడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ హరి డి.ఉపాధ్యాయ. నేటితరం విద్యార్థులు కొంత విశాల దృక్పథంతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటే, వ్యవసాయ కోర్సుల్లో అద్భుత అవకాశాలు ఉంటాయన్న ఆయన సలహాలు, సక్సెస్ స్పీక్స్..
 
 పంటల శాస్త్రం (క్రాప్ సైన్స్)లో బేసిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ ఫలితాలు, ఈ రంగంలో సృజనాత్మక నైపుణ్యాల ఆధారంగా క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా అవార్డులను అందజేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలను వడపోసి అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ అవార్డు నాకు వచ్చిందన్న విషయం తెలిసి చాలా సంతోషించా. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమనేది జీవితంలో అత్యున్నత మైలురాయిగా చెప్పగలను.
 
 ప్రస్తుత పరిశోధన ఇదే:
 ఇక్రిశాట్‌లో వేరుశనగ బ్రీడర్ హోదాలో.. వర్షాభావ/అనావృష్టి పరిస్థితుల్లోనూ, చీడపీడలను ఎదుర్కొనే వేరుశనగ రకాల ఉత్పత్తులపై పరిశోధన సాగిస్తున్నాను. ఇది విజయవంతమైతే ప్రధానంగా ఆసి యా, ఆఫ్రికా దేశాల్లోని వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
 
 అడుగెందుకు పడింది:
 అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న రోజుల్లో (1974) అఫ్రిది అనే లెక్చరర్ వ్యవసాయ కోర్సుల భవిష్యత్తు గురించి వివరించారు. ముఖ్యంగా ప్లాంట్ బ్రీడింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దీంతో జీబీ పంత్ యూనివర్సిటీలో ప్లాంట్ బ్రీడింగ్ స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీలో అడుగుపెట్టాను. ఆ తర్వాత సోయాబీన్ స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ కూడా పూర్తిచేశాను. ఇది పూర్తయ్యాక ఇక్రిశాట్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేయడం నా జీవిత గమ్యాన్నే మార్చేసింది. కొత్త రకం వంగడాలు, విత్తనాల పరిశోధనలు, ఆవిష్కరణలు వ్యవసాయదారులకు ఎంతో మేలు చేస్తాయి.
 
 క్రాప్ సైన్స్‌కు ప్రాధాన్యం:
 ప్రస్తుతం దేశ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా క్రాప్ సైన్స్ కోర్సులు, అందులో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరిగింది. క్రాప్ సైన్స్‌లోని ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్స్, జెనెటిక్ రిసోర్సెస్ వంటి స్పెషలైజేషన్లలో పరిశోధనలు చేస్తే అద్భుత కెరీర్ సొంతమవుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రతిష్టాత్మక వ్యవసాయ సంస్థలతోపాటు దేశంలోని చాలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్రాప్ సైన్స్ పరిశోధన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మేలు కలిగించే ఒక కొత్త ఆవిష్కరణ చేసినప్పుడు కలిగే ఆనందం వర్ణించలేనిది.
 
 ప్రోత్సాహకాలు పెంచాలి:
 యువతలో వ్యవసాయం, దాని అనుబంధ కోర్సులపై అవగాహన అంతంతమాత్రమే. వీటిపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన పెంపొందించాలి. ఆర్థిక ప్రోత్సాహకాలు, పరిశోధన చేసే వారికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. అప్పుడే వినూత్న ఆవిష్కరణలు వెలుగుచూస్తాయి. ఈ క్రమంలో ఇక్రిశాట్.. విద్యార్థులకు చేయూతనిచ్చేలా.. ఇప్పటికే ఉన్న సైంటిస్ట్‌లతో కలిసి పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
 
 విద్యార్థులూ.. మారాలి:
 వ్యవసాయ కోర్సులకు సంబంధించి విద్యార్థుల్లోనూ మార్పు రావాలి. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దీన్ని గుర్తించి ఈ రంగంలో కోర్సులు, కెరీర్ దిశగా అడుగులు వేస్తే అటు దేశాభివృద్ధి, ఇటు వ్యక్తిగతాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి పరిశోధనల పట్ల ఆసక్తి ఉండాలి. అప్పుడే చక్కగా రాణించగలరు.
 
 అకడమిక్, ప్రొఫెషనల్ ప్రొఫైల్
 ఎమ్మెస్సీ, ప్లాంట్ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ:
 జీబీ పంత్ యూనివర్సిటీ.
 1980-82: ఇక్రిశాట్-ఇండియాలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్.
 1982-83:
 జీబీ పంత్ యూనివర్సిటీలో సైంటిస్ట్.
 1983-87: యూనివర్సిటీ ఆఫ్
 అగ్రికల్చర్ సెన్సైస్, ధార్వాడ్‌లో సోయాబీన్ బ్రీడర్‌గా విధులు.
 1987-91: యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సెన్సైస్, ధార్వాడ్‌లో గ్రౌండ్‌నట్ బ్రీడర్, హెడ్ ఆఫ్ ఆయిల్ స్కీమ్‌గా బాధ్యతలు.
 1991-97: ఇక్రిశాట్ ఇండియాలో జెనెటిక్ రిసోర్సెస్ విభాగంలో సీనియర్ సైంటిస్టు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇక్రిశాట్‌లో పలు కీలక హోదాల్లో కొనసాగుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement