వేతన సంప్రదింపులు ఫలించాలంటే! | Sakshi
Sakshi News home page

వేతన సంప్రదింపులు ఫలించాలంటే!

Published Wed, Sep 24 2014 11:52 PM

వేతన సంప్రదింపులు ఫలించాలంటే!

జాబ్ ఆఫర్ చేతిలో పడగానే కొలువు వేట ముగిసినట్టు కాదు. ప్రయత్నం సగం ఫలించనట్లే భావించాలి. సంస్థ యాజమాన్యంతో చర్చించి, జీతభత్యాలను ఖాయం చేసుకొని ఉద్యోగంలో చేరినప్పుడే మీరు పూర్తి విజయం సాధించినట్లు లెక్క. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గిన తర్వాత వేతనం గురించి సంస్థతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. తమ అర్హతలు, నైపుణ్యాలకు తగిన గుర్తింపు, వేతనం కావాలని అభ్యర్థులు కోరుకోవడం సహజమే. అయితే, ఈ విషయంలో పట్టుదలకు పోతే మొదటికే మోసం వస్తుంది. కొలువు చేజారుతుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి.
 
 పట్టువిడుపులు ప్రదర్శించాలి
 వేతన ప్యాకేజీని నిర్ణయించుకొనే విషయంలో ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జాబ్ ప్రొఫైల్, గ్రేడ్, పనివేళలు, యాజమాన్యం పాటించే విలువలు, కార్యాలయం ఉన్న ప్రాంతం.. వంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి. పనివేళలు, కార్యాలయం మీకు అనుకూలంగా ఉండొచ్చు. అలాంటప్పుడు జీతం విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలి. మీ అర్హతలు, పని అనుభవం పెంచుకొనే అవకాశం ఉన్న ఉద్యోగమైతే వేతనంపై ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో అనుభవం సంపాదించిన తర్వాత మరో సంస్థలో చేరి, ఆశించిన ప్యాకేజీ పొందడానికి వీలుంటుంది.
 
 పరిశోధన చేయండి
 వేతనంపై సంస్థతో సంప్రదింపులు జరపడానికంటే ముందు కొంత పరిశోధన చేయండి. ప్రస్తుత జాబ్ మార్కెట్ తీరుతెన్నులు, కంపెనీ, అందులో సిబ్బందికి ఇస్తున్న జీతాలు, మీతో సమానమైన అర్హతలున్నవారికి దక్కుతున్న ప్యాకేజీ.. ఇలాంటి వాటిపై అవగాహన పెంచుకోండి. ప్రతి కంపెనీకి ప్రత్యేకమైన సంస్థాగత నిర్మాణం, వేతనాల విధానం ఉంటాయి. వాటి గురించి పరిశోధిస్తే ఎంత జీతం కోరుకోవాలో తెలుస్తుంది.
 
 ఇతర ప్రయోజనాలు
 కొన్ని కంపెనీల్లో జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ ఇతర బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. రవాణా, భోజన సదుపాయం, టెలిఫోన్ రియంబర్స్‌మెంట్ వంటి ప్రయోజనాలను ఉద్యోగులకు కల్పిస్తారు. ఇవి మీకు సంతృప్తికరంగా అనిపిస్తే జీతం తక్కువైనా ఉద్యోగంలో చేరొచ్చు. కాబట్టి సంస్థలో ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయో లేదో ముందే తెలుసుకోవాలి.
 
 ఆత్మవిశ్వాసం ముఖ్యం
 పే ప్యాకేజీపై యాజమాన్యంతో మాట్లాడేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. బాడీ లాంగ్వేజ్ సక్రమంగా ఉండాలి. మర్యాద ఉట్టిపడే భాష ఉపయోగించాలి. స్వరం స్పష్టంగా వినిపించాలి. మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్పాలి. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటే కచ్చితంగా మేలు జరుగుతుంది. యాజమాన్యం ఆఫర్ చేస్తున్న ప్యాకేజీపై తొందరపడి ఒక నిర్ణయానికి రావొద్దు. అన్ని విషయాలను నిదానంగా ఆలోచించుకున్న తర్వాతే అడుగు ముందుకేయండి.
 
 దీర్ఘకాలిక అవసరాలు
 వేతనం ప్రారంభంలో తక్కువగా ఉన్నా.. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తమే జేబులో పడే అవకాశం ఉంటుంది. అంటే జీతభత్యాలు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సంస్థల్లో మేనేజ్‌మెంట్ తమ ఉద్యోగుల కెరీర్ డెవలప్‌మెంట్‌కు అవసరమైన చర్యలు చేపడుతుంది. వీటిని కూడా మీరు నిశితంగా పరిశీలించండి. తాత్కాలికమైన వెసులుబాట్లను కాకుండా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోండి. జాబ్ ఆఫర్‌ను అందుకోవాలా? లేక తిరస్కరించాలా? అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 ఎంఆర్‌పీఎల్
 మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
  జనరల్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్/ ఫైనాన్స్)
  చీఫ్ మేనేజర్ (షిప్పింగ్)
  సీనియర్ మేనేజర్ (లా)
  సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)
  మేనేజర్ (ఆపరేషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా)
  డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్స్)
  సీనియర్ ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ)
  సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)
  ఇంజనీర్ (కెమికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్)
 అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, అనుభవం, వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.  
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20
 వెబ్‌సైట్: www.mrpl.co.in
 
 ఐఐటీ-మద్రాస్
 ఐఐటీ-మద్రాస్.. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
 కోర్సులు: రెగ్యులర్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ ఎక్స్‌టర్నల్/ పార్ట్ టైం పీహెచ్‌డీ, ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్‌డీ, ఎంటెక్- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ.
 విభాగాలు: ఏరోస్పేస్, అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ డిజైన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఓషన్ అండ్ ఫిజిక్స్.
 అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎమ్మెస్సీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 21
 వెబ్‌సైట్: www.iitm.ac.in
 ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ
 మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
    పీహెచ్‌డీ ప్రోగ్రామ్-2015
 ఎంపిక: యూజీసీ నెట్/గేట్/ఎన్‌బీహెచ్‌ఎం స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 15
 వెబ్‌సైట్: http://iisermohali.ac.in
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 
 కానిస్టేబుల్, ఎస్సై పోటీ పరీక్షల్లో ‘సిరీస్’ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది?
 - టి.అభిలాష్,  మియాపూర్
 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన  పోటీ పరీక్షల్లో ‘సిరీస్’ టాపిక్ నుంచి కనీసం 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆంగ్ల అక్షరాలు లేదా సంఖ్యలను ఒక వరుస క్రమంలో ఇస్తారు. చివరగా ఒక ఖాళీ ఇస్తారు. ముందుగా.. ఇచ్చిన అక్షరాలు లేదా సంఖ్యల మధ్య సంబంధాన్ని/ సారూప్యాన్ని గుర్తించాలి. అదే సంబంధంతో ఉన్న అక్షరాలు లేదా సంఖ్యలను కనుక్కోవాలి. సాధారణంగా సరి, బేసి, ప్రధాన సంఖ్యలు, వర్గాలు, ఘనాల ఆధారంగా ఈ సిరీస్‌లను ఇస్తారు. వీటిపై పట్టు సాధిస్తే, ఈ విభాగం నుంచి ఇచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.
 ఇన్‌పుట్స్: బి.రవిపాల్ రెడ్డి,
 సీనియర్ ఫ్యాకల్టీ
 
 డిఎస్సీ పరీక్షలో బయాలజీ కంటెంట్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను ఎలా అధ్యయనం చేయాలి? ‘వ్యాధులు, కారకాలు’  నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?
 - కె.గీత, బి.ఎన్.రెడ్డి నగర్
 డిఎస్సీలో జీవశాస్త్రానికి సంబంధించి అధ్యాయాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కుల పరంగా కంటెంట్‌కు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే 8 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. చదువుతున్నప్పుడే సిలబస్‌లోని  అంశాలపై సొంతంగా బిట్స్ రాసుకుంటే చక్కగా గుర్తుంటాయి. తెలుగు అకాడమీ..  బిట్స్‌తో కూడిన పుస్తకాలను ప్రత్యేకంగా ప్రచురించింది. ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. వ్యాధులు, కారకాలు పాఠ్యాంశం నుంచి ప్రతి డిఎస్సీలో 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతు న్నారు. వ్యాధి పేరు, కారకం, వ్యాప్తి చెందే పద్ధతి, వ్యాధి లక్షణాలను పట్టిక రూపంలో పొందుపర్చుకుని అధ్యయనం చేయాలి. అదే విధంగా గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు.
 ఇన్‌పుట్స్: ఎస్.పి.డి.పుష్పరాజ్,
 సీనియర్ ఫ్యాకల్టీ

Advertisement
Advertisement