‘సంగీత సుధాకరం’ గ్రంథ రచయిత? | Sakshi
Sakshi News home page

‘సంగీత సుధాకరం’ గ్రంథ రచయిత?

Published Tue, Oct 8 2013 1:52 AM

'Musical sudhakaram' Bibliography author?

COMPETITIVE GUIDANCE - GS
 ఏపీ హిస్టరీ :  ముసునూరి నాయకుల ఆంధ్ర స్వాతంత్య్రోద్యమం
 బహమనీ, విజయనగర రాజ్యాలతో కాపయ నాయకుడి సంబంధాలు:
 కాపయ నాయకుడు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటున్న సమయంలో దక్షిణ దేశంలో మరో రాజకీయ విప్లవం చోటుచేసుకుంది. ఢిల్లీ పాలకుడు మహ్మద్ బిన్ తుగ్లక్ చర్యలను అనుమానించి, దక్కన్‌లో కొందరు సైన్యాధిపతులు జాఫర్‌ఖాన్ (హసన్‌గంగూ) నాయకత్వంలో తుగ్లక్‌పై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు మద్దతుగా కాపయ నాయకుడు 15 వందల అశ్విక దళాన్ని హసన్‌గంగూకు సహాయంగా పంపినట్లు ఫెరిస్టా రచనల ద్వారా తెలుస్తోంది. భవిష్యత్‌లో ఢిల్లీ సుల్తాన్‌ల దండయాత్రల సమయంలో బహమనీ రాజ్యం (హసన్‌గంగూ) తనకు రక్షణగా ఉంటుందనే ఆలోచనతో కాపయ నాయకుడు వారికి సహాయం చేసి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.
 
  అయితే ఇది దూరదృష్టి లేని చర్య అని చెప్పక తప్పదు. తుదకు అల్లాఉద్దీన్ హసన్‌గంగూ తన రాజ్య విస్తరణలో భాగంగా ఓరుగల్లుపై దండెత్తి కాపయ నాయకుడిని ఓడించాడు. గత్యంతరం లేక కాపయ నాయకుడు నిజామాబాద్‌లోని కౌలాస దుర్గాన్ని, అపారమైన ధనరాశులను సమర్పించి హసన్‌గంగూతో సంధి కుదుర్చుకున్నాడు. దీంతో ఆంధ్రదేశంలో పశ్చిమోత్తర ప్రాంత భాగాలు బహమనీ రాజ్యంలో చేరాయి. క్రీ.శ. 1356లో అల్లాఉద్దీన్ హసన్ గంగూ ఆంధ్రదేశంపై దండెత్తాడు.  తెలంగాణతోపాటు కృష్ణాతీరంలోని ధాన్యకటకం(అమరావతి)లోని అమరేశ్వర ఆలయాన్ని అతడు దోచుకున్నట్లు రెడ్డిరాజుల శాసనాల ద్వారా తెలుస్తోంది. కాపయ నాయకుడు ఓడిపోయి, భువనగిరి దుర్గాన్ని బహమనీ సుల్తాన్‌కిచ్చి సంధి చేసుకున్నాడు.
 
 బహమనీ సుల్తాన్ హసన్‌గంగూ, క్రీ.శ. 1359లో మరణించాడు. అతడి కుమారుడు మొదటి మహ్మద్ షా రాజ్యానికొచ్చాడు. హసన్‌గంగూ ఆక్రమించిన తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేయాలని విజయనగర రాజులు, కాపయ నాయకుడు.. మహ్మద్‌షా ఆస్థానానికి రాయబారం పంపినట్లు ఫెరిస్టా రచనల ద్వారా తెలుస్తోంది. ఈ రాయభారం విఫలమైంది. విజయనగర మొదటి బుక్కరాయల సహాయంతో కాపయ నాయకుడి కుమారుడు వినాయక దేవుడు కౌలాస దుర్గాన్ని (నిజామాబాద్) ముట్టడించాడు.
 
 ఈ యుద్ధంలో బహమనీలు వినాయక దేవుడిని క్రూరంగా వధించారు. దీంతో కాపయ నాయకుడు విజయనగర రాజులతో కలిసి, బహమనీ రాజ్యాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ సహాయాన్ని అర్థించాడు. ముస్లింలతో యుద్ధం చేస్తున్న కాఫిర్లకు (హిందువులు) సహాయం చేయడం ఇస్లాం మతానికి ధర్మవిరుద్ధమని ఫిరోజ్ షా తేల్చిచెప్పాడు.  సహాయం చేయడానికి నిరాకరించాడు. అనంతరం బహమనీ మహ్మద్ షా ఓరుగల్లుపై దండెత్తాడు. విజయనగర రాజుల నుంచి కూడా కాపయ నాయకుడికి సహాయం అందలేదు. ఈ యుద్ధంలో కాపయ నాయకుడు పరాజయం పాలయ్యాడు. ఈ సంఘటన క్రీ.శ. 1364-65లో జరిగింది. తుదకు బహమనీలతో కాపయ నాయకుడు సంధి కుదుర్చుకొని, తన ఆధీనంలో ఉన్న గోల్కొండ కోటను, వంద ఏనుగులు, 250 గుర్రాలు, 33 లక్షల రూపాయలు యుద్ధ నష్టపరిహారంగా బహమనీలకు చెల్లించాడు.
 
 ఇదే అదనుగా రేచర్ల అనపోతానాయకుడు, కాపయ నాయకుడిపై దండెత్తాడు. భీమవరం వద్ద క్రీ.శ. 1367-68లో వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ముసునూరి కాపయ నాయకుడు వీరమరణం పొందాడు. దాంతో ఓరుగల్లు, భువనగిరి దుర్గాలు పద్మనాయకుల వశమయ్యాయి. ముసునూరి వంశం అంతమైంది. ఆంధ్రనగరి ఓరుగల్లు రాజకీయ ప్రాముఖ్యాన్ని కోల్పోయింది.
 
 రాచకొండ - దేవరకొండ వెలమలు
 (పద్మనాయకులు): రాచకొండ-దేవరకొండను పాలించిన పద్మనాయకుల(రేచర్ల వెలమల) ప్రసక్తి పల్నాటి వీర చరిత్రలో కనిపిస్తుంది. పల్నాటి యుద్ధం తర్వాత వెలమలు ఆమనగల్లు, పిల్లలమర్రి, ఓరుగల్లు ప్రాంతాలకు వలసపోయి, కాకతీయుల ప్రాపకం సంపాదించారు. అయితే, వెలమల చరిత్రకు మూలాధారమైన వెలుగోటి వారి వంశావళి ప్రకారం ఈ వంశమూల పురుషుడు బేతాళ నాయకుడని తెలుస్తోంది. కాకతీయుల కాలంలో ప్రధానంగా గణపతిదేవుడు, రుద్రమదేవిల హయాంలో రేచర్ల వెలమలు ప్రసిద్ధి పొందారు. రుద్రమదేవి కాలంలో రేచర్ల ప్రసాదిత్యుడికి కాకతీరాయ రాజ్యస్థాపనాచార్య, రాయపితామహాంక బిరుదులున్నట్లు వెలుగోటి వారి వంశావళి వివరిస్తోంది. ప్రతాపరుద్రుడి కాలంలో దాచానాయకుడు, అతడి కుమారుడు సింగమనాయకుడు సేనాపతులుగా పనిచేశారు. కాకతీ ప్రతాపరుద్రుడు - పాండ్యులపై దండెత్తినపుడు దాచానాయుడు ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. అందుకే ఇతడు పంచ పాండ్య దళ విభాళ అనే బిరుదును ఆపాదించుకున్నాడు.
 
 ముసునూరి నాయకుల పాలన తర్వాత రేచర్ల వెలమలు మహ్మదీయులను ఎదుర్కొని రాజుకొండ (రాచకొండ), దేవరకొండలను రాజధానులుగా చేసుకొని త్రిలింగ దేశాన్ని పాలించారు. వీరిది రేచర్ల గోత్రం, విష్ణుపాదం నుంచి జన్మించినందు వల్ల పద్మనాయకులు అనే పేరు వచ్చిందనే వాదన ఉంది. రేచర్ల వంశమూల పురుషుడు బేతాళ నాయకుడు. వీరి జన్మస్థానం పిల్లలమర్రి.
 
 సింగమ నాయకుడు:
 రేచర్ల ప్రసాదిత్యుడి మనవడు దాచానేడు ప్రతాపరుద్రుడికి సేనానిగా పనిచేశాడు. దాచానేడు కుమారుడు సింగమ నాయకుడు. ఇతడు ముసునూరి ప్రోలయనాయకుడి నాయకత్వంలో ముస్లింల దాడులను ఎదుర్కొన్నాడు. ముసునూరి ప్రోలయనాయకుడు మరణానంతరం కాపయనాయకుడు అధికారంలోకి వచ్చాడు. ఈ సమయంలో సింగమ నాయకుడు కాపయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడాడు. సింగమనాయకుడు కృష్ణా- తుంగభద్ర నదుల వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తుదకు రాజ్య విస్తరణ కాంక్షతో యుద్ధాలు చేస్తూ... జల్లిపల్లి పాలకులైన సోమవంశ క్షత్రియుల చేతిలో హతమయ్యాడు.
 
 అనపోతానాయకుడు:
 సింగమ నాయకుడి కుమారుడు అనపోతానాయకుడు. ఇతడు రాచకొండ రాజ్య నిర్మాత.  తన తండ్రి మరణానికి కారకులైన జల్లిపల్లి సోమవంశ క్షత్రియులను ఓడించాడు. రెడి ్డరాజులతో పోరాడి, శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. బహమనీ సుల్తాన్‌లతో స్నేహం చేశాడు. క్రీ.శ. 1368లో భీమవరం యుద్ధంలో ముసునూరి కాపయ నాయకుడిని వధించి ఓరుగల్లును ఆక్రమించాడు. ఇతడు తన రాజ్యాన్ని రెండుగా విభజించి, తమ్ముడైన మాదానాయకుడిని దేవరకొండ రాజుగా నియమించాడు. దాంతో రాచకొండలో అనపోతా నాయకుడు, దేవరకొండలో మాదానాయకుడి సంతతికి చెందిన వారు పాలించారు. రేచర్ల పద్మనాయకుల వంశ చరిత్రను తెలిపే వెలుగోటి వారి వంశావళి గ్రంథం ప్రకారం... అనపోతానాయకుడికి ఖడ్గనారాయణ, గాయగోవాళ హిందూ సురత్రాణుడు వంటి బిరుదులున్నట్లు తెలుస్తోంది. ఇతడికి ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదు కూడా ఉంది. సోమవంశ క్షత్రియులను జయించి, సోమకుల పరశురామ అనే బిరుదును కూడా పొందాడు.
 
 కుమార సింగభూపాలుడు:
 అనపోతానాయకుడి కుమారుడైన కుమార సింగభూపాలుడు క్రీ.శ. 1383-1399 మధ్య రాజ్యాన్ని పాలించాడు. కల్యాణ దుర్గాన్ని జయించి కల్యాణ భూపతి అనే బిరుదును పొందాడు. ఇతడి ఆస్థాన కవి విశ్వేశ్వరుడు. ఇతడు చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడి తర్వాత రెండో అనపోతానాయకుడు, మాదానేడులు బహమనీ సుల్తాన్‌లకు సాయం చేశారు. కుమార సింగభూపాలుడు గొప్ప విద్వాంసుడు, కవి, కవి - పండిత పోషకుడు. ఇతడికి సర్వజ్ఞ, సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదులున్నాయి.
 
 ముమ్మిడి సింగ భూపాలుడు
 (క్రీ.శ. 1430 - 1475):
 ఇతడు కళింగ - గజపతుల సహాయంతో బహమనీ సుల్తాన్‌లను ఎదిరించాడు. కానీ ఫలితం దక్కలేదు. తుదకు విజయనగర రాజుల ఆశ్రయం పొంది వారి ఆస్థానంలో చేరాడు.
 
 రేచర్ల వెలమల సాహిత్యసేవ:
 రేచర్ల వెలమల కాలంలో సంస్కృత భాష విశేష ఆదరణ పొందింది. రేచర్ల అనపోతానాయకుడి కాలం నాటి నాగనాథకవి సంస్కృత భాషలో మదన విలాసబాణం అనే గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తోంది. కుమార సింగభూపాలుడు అక్కలపూడి అనే గ్రామానికి ముమ్మిడి సింగవరంగా పేరుమార్చి, ఆయుర్వేద వైద్యుడు - పరహితాచార్యుడికి అగ్రహారంగా దానమిచ్చాడు. కుమారసింగ భూపాలునికి సర్వజ్ఞ అనే బిరుదు ఉంది. ఇతడిని రెండో సింగభూపాలుడుగా కూడా పిలుస్తారు. రెండో సింగభూపాలుడు రసార్ణవసుధాకరం అనే లక్షణ గ్రంథం, రత్నపాంచాలిక అనే నాటకాన్ని రచించాడు. ఇతడు సారంగదేవుడి సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానం రాశాడు. ఇతడి ఆస్థానంలో విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయామాత్యుడు అనే రచయితలు ప్రఖ్యాతి చెందారు. విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
 
 బొమ్మకంటి అప్పయామాత్యుడు అమరుకోశానికి వ్యాఖ్యానం రాశాడు. ఆంధ్ర మహాభాగవత రచయిత బమ్మెర పోతన, సింహాసన ద్వాత్రింశికను రచించిన కొరవి గోపరాజు, నవనాథ చరిత్ర రాసిన గౌరన వంటి పండితులు ఈ కాలానికి చెందినవారే! రెడ్డి-వెలమ రాజుల మధ్య అనుసంధాన కర్తగా మహాకవి శ్రీనాథుడు వ్యవహరించాడు. శ్రీనాథుడు రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుడి ఆస్థానాన్ని సందర్శించాడు. సింగభూపాలుడి కుమారుడు రావుమాదా నాయకుడు శ్రీమద్రామాయణంపై రాఘవీయమనే వ్యాఖ్యానం చేసినట్లు అతడి భార్య వేయించిన నాగారం శాసనం వల్ల తెలుస్తోంది. రేచర్ల పద్మనాయకులు నాయంకర్లుగా కాకతీయుల కాలంలో సేవలందించారు. వీరు వీరులే కాకుండా, గొప్ప సాహిత్య పోషకులుగా ఆంధ్ర భాషా సాహిత్యానికి విశేష సేవలందించారు.
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    సంస్కృతంలో తొలి శిలా శాసనం?
     1) జునాగఢ్     2) నాసిక్
 3) హతిగుంఫా     4) ఉత్తర మేరూర


 2.    మృచ్ఛకటికం రచయిత?
     1) భాసుడు     2) కాళిదాసు
 3) నాగార్జునుడు     4) శూద్రకుడు


 3.    భగవద్గీతను పర్షియన్ భాషలోకి తర్జుమా చేసినవారు?
 1) ధారాషిఖో    2) గాలిబ్
 3) కబీర్     4) అమీర్ ఖుస్రూ


 4.    రేచర్ల పద్మనాయక వంశ మూల పురుషుడు?
 1) రేచర్ల రుద్రుడు     2) ప్రసాదిత్యుడు
 3) సింగభూపాలుడు
 4) బేతాళ నాయకుడు


 5.    రేచర్ల పద్మనాయకులు - ముసునూరి కాపయ నాయకుల మధ్య క్రీ.శ. 1367-68లో యుద్ధం ఎక్కడ జరిగింది?
 1) భీమవరం     2) జల్లిపల్లి
 3) ఓరుగల్లు     4) పానగల్లు


 6.    సంస్కృత భాషలో ఉన్న పంచతంత్రం గ్రంథాన్ని తెలుగులోకి తర్జుమా చేసిన కవి?
 1) పోతనామాత్యుడు
 2) దూబగుంట నారాయణకవి
 3) గౌరన     4) వేమన


 7.    ఓరుగల్లు పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చింది?
 1) అల్లాఉద్దీన్ ఖిల్జీ     
 2) అల్లాఉద్దీన్ హసన్‌గంగూ
 3) మహ్మద్ బిన్ తుగ్లక్
 4) మహ్మద్‌షా బహమనీ


 8.    అనుమనగంటి పురవరాధీశ్వర అనే బిరుదు ఉన్న రాజు?
 1) ప్రోలయ నాయకుడు    2) దాచానేడు
 3) ముసునూరి కాపయనాయకుడు
 4) సర్వజ్ఞ సింగభూపాలుడు


 9.    ఆంధ్రనగరి అని ఏ పట్టణానికి పేరు?
 1) విశాఖపట్నం     2) ఓరుగల్లు
 3) విజయవాడ     4) కర్నూలు


 10.    సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదున్న పాలకుడు?
 1)అనపోతానాయకుడు
 2) కుమార సింగభూపాలుడు
 3) దాచానాయకుడు     
 4) ముమ్మిడి సింగభూపాలుడు


 11.    రత్న పాంచాలిక అనే నాటకాన్ని ఎవరు రచించారు?
 1) కుమార సింగభూపాలుడు
 2) దాచానాయకుడు
 3) అనపోతానాయకుడు
 4) బేతాళ నాయకుడు


 12.    అమరకోశానికి వ్యాఖ్యానం రాసినవారు?
 1) పోతనామాత్యుడు
 2) బొమ్మకంటి అప్పయామాత్యుడు
 3) సింగభూపాలుడు
 4) శ్రీనాథుడు


 13.    పంచపాండ్య దళ విభాళ అనే బిరుదున్న రాజు?
 1) దాచానాయకుడు
 2) అనపోతానాయకుడు
 3) సింగభూపాలుడు
 4) పోచానాయకుడు


 14.    సంగీత సుధాకరం గ్రంథ రచయిత?
 1) శ్రీనాథుడు  2) పోతనామాత్యుడు
 3) సింగభూపాలుడు
 4) అనపోతానాయకుడు


 15.    రణము కుడుపు అనే భైరవ తాంత్రిక పూజా విధానం ఏ రాజుల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంది?
 1) రెడ్డిరాజులు     2) కాకతీయులు
 3) ముసునూరి నాయకులు
 4) రేచర్ల పద్మనాయకులు
 
 సమాధానాలు
 1) 1;    2) 4;    3) 1;    4) 4;    5) 1;
 6) 2;    7) 3;    8) 3;    9) 2;  10) 2;
 11) 1;    12) 2;    13) 1;    14) 3; 15) 4.

Advertisement
Advertisement