గొడవల గుట్టు.. బడుగుల బతుకులు.. | Sakshi
Sakshi News home page

గొడవల గుట్టు.. బడుగుల బతుకులు..

Published Thu, Feb 6 2014 2:34 PM

Panchayat Secretary exam for Social Tensions & Conflicts

2,677 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు కేటాయించారు. రెండో పేపర్ (గ్రామీణాభివృద్ధి- సమస్యలు) సిలబస్‌లో మొత్తం అయిదు అంశాలున్నాయి. వీటిలో రెండో అంశంగా ‘సమకాలీన సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- అణగారిన వర్గాలవారి సమస్యలు’ ఉన్నాయి. ఈ విభాగం నుంచి గరిష్టంగా 30 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇందులోని అన్ని అంశాలను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువర్తింపజేసుకుంటూ చదివినప్పుడే ప్రిపరేషన్ పూర్తిస్థాయిలో ముగిసినట్లవుతుంది.


 
 మూలాలు ఎక్కడ?
 హిమగిరి శ్రేణులు మకుటంగా విరాజిల్లుతున్న భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల సంగమమైన భారతీయ సమాజాన్ని పోలిన సమాజం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా మార్పులకు గురవుతూనే ఉంది. ఒక మనిషి తన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడే క్రమంలో వివిధ సామాజిక సంస్థలకు పునాదులుపడ్డాయి. ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఏర్పడ్డాయి. అయితే ఇలాంటి సామాజిక ఏర్పాట్ల మధ్య మనుగడ సాగించే మనుషుల్లో విలువల పతనం సామాజిక ఘర్షణలకు, ఉద్రిక్తతలకు కారణమవుతోంది.


 
 సామాజిక ఉద్రిక్తతలకు కారణాలు
 
 వర్గ పోరాటాలు   

  రాజకీయ అవినీతి
 నేరాలు
 పోటీతత్వం
 నిరుద్యోగం
 జాత్యహంకారం
 మత, కులపరమైన అసహనం
 భాషా విభేదాలు    
 తీవ్ర సామాజిక మార్పులు
 సంపద పంపిణీలో అసమానతలు
 వీటికి సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకున్న సమకాలీన సంఘటనలు, కారణాలు, ఫలితాలను అధ్యయనం చేయాలి
 

ఉదాహరణ:    శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న లక్ష్మింపేట దళితుల ఊచకోత ఘటనకు కారణం?
 ఎ) నీటి వివాదం    బి) భూ వివాదం
 సి) కులాంతర వివాహం    డి) మత కలహాలు
 జవాబు : బి
 
 అభ్యర్థులు దృష్టిసారించాల్సిన అంశాలు:
 సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- కారణాలు, వివిధ రూపాలు
 మతమౌఢ్యం, దేశంలో చోటుచేసుకున్న మతపర హింస, పరిణామాలు, దాని కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు
 ఉగ్రవాదం, ప్రాంతీయ తత్వం, భాషాతత్వం, నక్సలైట్ ఉద్యమం
 వ్యభిచారం, భిక్షాటన వంటి అనైతిక ప్రవర్తనా రీతులు. వాటిని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
 దేశంలో కుల ఘర్షణలు- సమాజంపై వాటి ప్రభావం.
 కుటుంబ వ్యవస్థలో రుణాత్మక మార్పులు (విడాకులు, గృహ హింస)
 సామాజిక నిర్మాణంలో లోపాలు, ఇతర కారణాల వల్ల ఎక్కువగా నష్టపోతున్న బలహీన వర్గాల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలు
 
 ఉగ్రవాదం:
 స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాయి. దురదృష్టవశాత్తు వీటి ఫలాలు అర్హులైన వారికి అందలేదు. దళితులు, ఆదివాసులు, మహిళల జీవితం మరింత దుర్భరమైంది. ఈ నేపథ్యంలో నక్సలిజం ఆవిర్భవించింది. దీన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించే క్రమంలో బలహీనవర్గాలు సమిధలవుతున్నాయి.
 అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ప్రయత్నిస్తున్న భారత్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుసవాలుగా మారింది. కేంద్ర హోంశాఖ వివరణ ప్రకారం నేడు దేశాన్ని రెండు రకాల ఉగ్రవాదం కలవరపరుస్తోంది. అవి.. 1. బహిర్గత ఉగ్రవాదం (పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుంచి). 2. అంతర్గత ఉగ్రవాదం (మత హింస, నక్సలిజం..).
 అభ్యర్థులు దేశంలో ఉగ్రవాదం పెచ్చుమీరుతుండటానికి కారణాలు, ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న సంఘటనలు (2013, ఫిబ్రవరి 21- దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు), ప్రభుత్వ చర్యలు, చట్టాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి.
 ఇటీవల కాలంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ప్రముఖ రాజకీయ నాయకులను చంపడాన్ని చూస్తుంటే మధ్య, తూర్పు భారతదేశంలో అంతర్గత భద్రత ఎంత పేలవంగా తయారైందో చెప్పొచ్చు. దేశంలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో యువత కోసం రోష్నీ పేరిట కొత్తగా నైపుణ్య అభివృద్ధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ 2013, జూన్ 7న ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని అత్యంత సమస్యాత్మకమైన 24 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లా ఇందుకు ఎంపికైం ది. ఇలాంటి సమకాలీన పరిణామాలను తెలుసుకోవాలి.


 
 అవినీతి
 అవినీతి సూచీలో భారత్ స్థానం 94. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 177 దేశాలతో విడుదల చేసిన జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్‌లు గుర్తింపు సాధించాయి.  
 
 
 భారత ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై అవినీతి తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ ప్రగతికి పెద్ద అవరోధంగా పరిణమిస్తోంది. 2జీ స్పెక్ట్రం కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం వంటి భారీ అవినీతి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. ప్రభుత్వ విభాగాల్లో పెచ్చుమీరిన అవినీతి వల్ల సామాన్య జనం ఇబ్బందిపడుతున్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చింది. అన్ని రకాల అవినీతిని ముఖ్యంగా ఉన్నత స్థాయిలోని అవినీతిని అరికట్టేందుకు చేసిన ప్రజా పోరాటంలో దీన్ని ఒక కీలక ఘట్టంగా చెప్పొచ్చు. అభ్యర్థులు లోక్‌పాల్, లోకాయుక్తల చట్టం- 2013లోని అంశాలపై దృష్టిసారించాలి. దీనికి సంబంధించిన బిల్లును గతేడాది డిసెంబర్ 17న రాజ్యసభ, డిసెంబర్ 18న లోక్‌సభ ఆమోదించింది. అభ్యర్థులు ఈ చట్టానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను తప్పనిసరిగా చదవాలి.


 ఉదాహరణ:    లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్‌తో పాటు గరిష్టంగా ఎందరు సభ్యులుంటారు?
 ఎ) 6     బి) 7     సి) 8     డి) 9
 జవాబు: సి
 
మత ఘర్షణలు: భిన్న మతాల ప్రజలున్న భారత్‌లో తరచూ ఎక్కడో చోట మత విద్వేషాల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనల సమయంలో ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గోద్రా అల్లర్లు దేశంలో సంచలనం సృష్టించాయి. 2013లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది మరణించారు. మతపర హింసను నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అభ్యర్థులు మత ఘర్షణలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను తెలుసుకోవాలి.
 
 కమిషన్లపై పట్టు సాధించాలి: జాతీయ మానవ హక్కుల కమిషన్, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌ల కూర్పు, విధులు, చైర్మన్లు తదితర అంశాలపై దృష్టిసారించాలి. మహిళా కమిషన్లు; ఎస్సీ- ఎస్టీ కమిషన్లు; బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు వంటి వివిధ సంఘాల ప్రాథమిక అంశాలను తప్పనిసరిగా చదవాలి.
 
 ఉదాహరణ:జాతీయ ఎస్సీ కమిషన్ (ఎన్‌సీఎస్సీ) విధులను నిర్దేశించే రాజ్యాంగ అధికరణ?
 ఎ) 332     బి) 338     సి) 339     డి) 238
 జవాబు: బి
 


 నమూనా ప్రశ్నలు
 1.2013, డిసెంబర్ 3న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అవినీతికి సంబంధించి విడుదల చేసిన జాబితాలో భారత్ ర్యాంకు?
 ఎ) 91     బి) 92     సి) 93     డి) 94
 
 2.జాతీయ ఎస్టీ కమిషన్ ప్రస్తుత చైర్మన్?
 ఎ) రామేశ్వర్ ఓరాన్     బి) పి.ఎల్.పునియా
 సి) రాజ్‌కుమార్ వెర్కా     డి) పీఎస్ మెహతా
 
 3.నేషనల్ సఫాయి కర్మచారీస్ ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
 ఎ) 1996     బి) 1997     సి) 1998    డి) 2000
 
 4.వెట్టిచాకిరి, మనుషుల అక్రమ రవాణాను నిషేధించిన రాజ్యాంగ అధికరణ?
 ఎ) ఆర్టికల్ 26     బి) ఆర్టికల్ 33
 సి) ఆర్టికల్ 36     డి) ఆర్టికల్ 23
 
 5.దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన మహిళా బ్యాంకు నినాదం?
 ఎ) ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ఇండియా
 బి) ఎంపవరింగ్ ఇండియా, ఎంపవరింగ్ ఉమెన్
 సి) ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ భారత్
 డి) ఎంపవరింగ్ భారత్, ఎంపవరింగ్ ఉమెన్
 
 6.మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ?
 ఎ) రాజేంద్ర సచార్     
 బి) మోహన్ చంద్ర
 సి) రెహమత్ అలీ     
 డి) బి.పి.మండల్
 
 7.అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ అధికరణ?
 ఎ) 14     బి) 15     సి) 16     డి) 17
 
 8.భూమి లేని ఎస్సీ, ఎస్టీల కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 ఏప్రిల్‌లో ప్రకటించిన పథకం?
 ఎ) మన భూమి     బి) భూ తోరణం
 సి) పచ్చ తోరణం డి) మీ భూమి
 
 9.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
 ఎ) జూన్, 2001     బి) మే, 2002
 సి) ఆగస్టు, 2003 డి) జూలై, 2004
 
 10.2002లో అక్షరధామ్ ఆలయంపై దాడి జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
 ఎ) మహారాష్ట్ర     బి) గుజరాత్
 సి) బీహార్ డి) మధ్యప్రదేశ్
 
 11.ప్రస్తుతం భారతదేశంలో అంతర్రాష్ట్ర వివాదాలకు ప్రధాన కారణం?
 ఎ) ఖనిజ వనరులు
 బి) జలవనరులు
 సి) అటవీ సంపద
 డి) సరిహద్దు అంశాలు
 
 సమాధానాలు:
 1) డి 2) ఎ 3) బి 4) డి 5) ఎ 6) ఎ 7) డి 8) సి 9) డి 10) బి 11) బి
 
 బలహీన వర్గాలు- సంక్షేమం
 పేదలు, మహిళలు, పిల్లలు, అనాథలు, రోగులు తదితరుల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. పథకాలు అమలవుతున్న తీరు గురించి కూడా చదవాలి. గ్రామీణ గృహ పథకం; వృద్ధాప్య పింఛను పథకం; పేద విద్యార్థులకు ఫీజుల తిరిగి చెల్లింపు పథకం; ఆహార భద్రత చట్టం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలను నిరోధించే ఉద్దేశంతో తెచ్చిన ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం (1989) నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
 
 ఇన్‌పుట్స్:Prof. K. Ramanuja Rao
 Department of Sociology,
 Kakatiya university.
 

Advertisement
Advertisement