పీపుల్ స్కిల్స్‌తో పదిలమైన అవకాశాలు.. | Sakshi
Sakshi News home page

పీపుల్ స్కిల్స్‌తో పదిలమైన అవకాశాలు..

Published Sun, Oct 2 2016 4:22 AM

పీపుల్ స్కిల్స్‌తో పదిలమైన అవకాశాలు..

‘ఈ రోజుల్లో ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగంలో చేరితే అందులోని అన్ని విభాగాలపై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరిగా మారుతోంది. పీపుల్ స్కిల్స్ ఉన్న వారేఈ మేరకు రాణించగలరు’ అని ఐఐఎం-లక్నో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ దేబాశిశ్ ఛటర్జీ అంటున్నారు. కెరీర్ సక్సెస్‌కు అవసరమైన నైపుణ్యాలపై ఆయనతో గెస్ట్‌కాలం..
 
 నేడు స్కిల్స్ పరిధి విస్తృతమవుతోంది. సాఫ్ట్‌వేర్ విప్లవంతో సాఫ్ట్ స్కిల్స్ ప్రాధాన్యం పెరిగింది. తర్వాత గ్లోబలైజేషన్ యుగంలో బిజినెస్ స్కిల్స్ ఉన్నవారికే కార్పొరేట్ అవకాశాలు దక్కేవి. ఇప్పుడు ఉద్యోగార్థిలో పీపుల్ స్కిల్స్ కీలకంగా మారాయి.
 
 పీపుల్ స్కిల్స్ అంటే
 ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం, నలుగురిలో బెరుకు లేకుండా మాట్లాడటం, బృంద వాతావరణంలో పనిచేయడం, క్లయింట్లను మెప్పించడం, నెగోషియేషన్ స్కిల్స్‌ను ప్రదర్శించడాన్ని పీపుల్ స్కిల్స్‌గా పేర్కొంటారు. ఉద్యోగి తన విభాగానికే పరిమితం కాకుండా అన్ని విభాగాల వారితో మాట్లాడుతూ ఆయా నైపుణ్యాలను సముపార్జించుకోవడం, పనిలో నైపుణ్యం చూపడాన్ని కూడా పీపుల్ స్కిల్స్‌గా పరిగణించొచ్చు.
 
 పోటీ ప్రపంచంలో మనమెక్కడ?
 ఇరవై ఒకటో శతాబ్దం.. ఇంటర్నెట్ విప్లవం.. గ్లోబలైజేషన్.. అన్నీ అరచేతిలో.. ఒక్క క్లిక్ దూరంలోనే! నిత్యం అప్‌డేట్ కావాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో నెగ్గుకురావాలంటే బహుముఖ నైపుణ్యాలు ఉండాలి. అందుకే యువత ముందుగా స్వీయ పరిశీలన చేసుకోవాలి. ‘పోటీ ప్రపంచంలో మనం ఎక్కడున్నాం? అందరికన్నా ముందుండాలంటే ఏం చేయాలి?’ అని ప్రశ్నించుకోవాలి.
 
 పరిశ్రమ వర్గాలు ముందుకు రావాలి
 అభ్యర్థుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండటం లేదని చెబుతున్న పరిశ్రమ వర్గాలు వాటిని మెరుగుపరిచేందుకు చొరవ చూపాలి. విద్యాసంస్థలను విస్తృతంగా సంప్రదించాలి. పాఠ్య ప్రణాళికను, బోధనను పరిశ్రమ అవసరాలకు తగ్గట్లు రూపొందించేందుకు సహకరించాలి. చాలా కంపెనీలు పేరొందిన విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో సాధారణ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉద్యోగ వేటలో వెనకబడుతున్నారు.
 
 మెంటారింగ్‌తో ముందడుగు
  మట్టిలో మాణిక్యాలున్నట్లు మామూలు కాలేజీల్లోనూ మెరికల్లాంటి విద్యార్థులుంటారు. వారిలోని బలహీనతలను, ఆత్మన్యూనతను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలి. విద్యార్థి విజయ పథంలో సాగడానికి సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరం. ఉద్యోగ సంస్థలు ఒక వ్యక్తి పనితీరునే ప్రామాణికంగా తీసుకునే విధానానికి స్వస్తి పలకాలి. మిగతా ఉద్యోగుల్లోని సామర్థ్యాలనూ గుర్తించే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న ‘ఆట్రిషన్’ సమస్యకు ప్రధాన కారణం ఉద్యోగికి పనిచేసే చోట సరైన గుర్తింపులేక పోవడమే.
 
 కొత్త నైపుణ్యాలు అవసరం..
 మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ ఔత్సాహికులు గ్రోత్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి. కాలేజీ/వర్సిటీలో చేరి క్యాంపస్ కొలువు పొందితే చాలు కెరీర్‌లో స్థిరపడినట్లే అనే భావన వీడాలి. ఉద్యోగ జీవితంలో ముందుకు సాగేందుకు నిరంతరం కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అకడమిక్ స్థాయి నుంచే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే కెరీర్‌కు, జీవిత లక్ష్యానికి సార్థకత, పరిపూర్ణత లభిస్తుంది. సక్సెస్ బదులు పర్‌ఫెక్షన్ అనే సూత్రాన్ని పాటించాలి. సమస్యకు పరిష్కారం లభించినంత మాత్రాన దాన్నే సక్సెస్‌గా భావించకూడదు. కచ్చితత్వం దిశగా సాగాలి. అప్పుడే అసలైన విజయం సొంతమవుతుంది.
 
 ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం నలుగురిలో బెరుకు లేకుండా మాట్లాడటం బృంద స్ఫూర్తి
 క్లయింట్లను మెప్పించడం..
 
 ప్రొ॥దేబాశిశ్ ఛటర్జీ, లక్నో ఐఐఎం
 

Advertisement
Advertisement