ఆర్థిక వృద్ధి- పర్యావరణం | Sakshi
Sakshi News home page

ఆర్థిక వృద్ధి- పర్యావరణం

Published Wed, Sep 16 2015 11:47 PM

ఆర్థిక వృద్ధి- పర్యావరణం - Sakshi

వృద్ధితో పాటే విచ్ఛిన్నం: స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికాబద్ద ఆర్థిక ప్రగతిలో భాగంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. జాతీయాదాయం, తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో అధిక ప్రగతి నమోదైంది. దేశంలో సహజ వనరుల వినియోగంలో విచక్షణ పాటించకపోవటం, పునరుత్పన్నం కాని వనరులను ఇష్టానుసారం ఉపయోగించటం, పర్యావరణ-జీవ వైవిధ్యం ప్రాధాన్యతను గుర్తించకపోవటం వల్ల దేశంలో పర్యావరణ తులారాహిత్యం పెరుగుతోంది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత్ వాటా తక్కువగా ఉన్నప్పటికీ, పారిశ్రామిక కాలుష్యాలైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో దేశానికి అధిక వాటా ఉండటం గమనించాల్సిన అంశం.
 
 జనాభా-పర్యావరణం:
 గత 50 ఏళ్ల కాలంలో ప్రపంచ జనాభా 3.5 బిలియన్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన జనాభాలో 85 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఈ దేశాల్లో గ్రామీణ జనాభా రెట్టింపై, పర్యావరణ పరిరక్షణకు సవాలుగా పరిణమించింది.పట్టణ జనాభా వృద్ధి కారణంగా మౌలిక వసతుల కల్పనపై ఒత్తిడి పెరిగింది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఘన వ్యర్థాల కాలుష్యంతో పాటు పాలిథిన్ సంచులు, రసాయనాలను విచక్షణారహితంగా ఉపయోగించటం వల్ల పర్యావరణ క్షీణత ఏర్పడింది. ఒకే పంటను ఎక్కువసార్లు పండించటం, పురుగు మందుల అధిక వినియోగం కారణంగా భూ సారం తగ్గింది. భూమి కోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, గుంతల్లో వ్యర్థాలను పూడ్చటం వంటి వాటివల్ల భూమి నాణ్యత క్షీణిస్తోంది. పట్టణ ప్రాంత జీవన విధానాల్లో వచ్చిన గణనీయ మార్పులు ప్రస్తుత తరాల జనాభాపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల్లో 1/3 వంతు మురికివాడల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. దక్షిణ- మధ్య ఆసియా, సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో పట్టణ ప్రాంత జనాభాలో 70 శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నట్లు అంచనా.
 
 వృద్ధి, పర్యావరణ క్షీణత:
 ప్రపంచ వ్యాప్తంగా మానవ కార్యకలాపాలు, భారీ పారిశ్రామికీకరణ ప్రక్రియ.. పర్యావరణ సమతుల్య సాధనకు అవరోధంగా నిలిచాయి. పర్యావరణ తులారాహిత్యానికి సంబంధించి పరిమాణాత్మక, ద్రవ్యపరమైన అంచనాలను రూపొందించటం కష్టతరమైనప్పటికీ, ఇటీవల కాలంలో కొన్ని దేశాలకు ఈ రకమైన అంచనాలు వెలువడ్డాయి. ప్రపంచ బ్యాంకు 2013, జూన్ నివేదికలో భారత్‌కు సంబంధించి 2009 సంవత్సరానికి పర్యావరణ క్షీణత అంచనాలను వెల్లడించింది.
 
 నివేదికలోని ముఖ్యాంశాలు:
 భారత్‌లో పర్యావరణ క్షీణత మొత్తం వ్యయం 3.75 ట్రిలియన్ రూపాయలు. ఇది స్థూలదేశీయోత్పత్తిలో 5.7 శాతానికి సమానం. 2009 ధరల వద్ద 1953-2009 కాలానికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టం సగటున ఏడాదికి రూ.150 బిలియన్లు. 1990-2008 మధ్యకాలంలో భారత్ తన సహజ సంపద విలువలో ఆరు శాతం కోల్పోయింది.

 నీరు, పారిశుద్ధ్యం, శుభ్రత లోపించటం వల్ల డయేరియా విజృంభిస్తోంది. భారత్‌లో 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాల్లో 14 శాతం డయేరియా మరణాలు.
 పట్టణ వాయు కాలుష్యం కారణంగా ఏడాదికి 1.09 లక్షల మంది వయోజనులు మరణిస్తున్నారు. దేశంలో పర్యావరణ క్షీణత వల్ల సంభవిస్తున్న నష్టంలో పట్టణ వాయు కాలుష్యం వాటా 29 శాతం. భారత్‌లో 853 మిలియన్ల ప్రజలు వంట చెరకు ఉపయోగిస్తున్నారు. 2009లో అంతర వాయు కాలుష్యం సగటు వ్యయం 865 బిలియన్ రూపాయలు. భూసార క్షీణత వల్ల జరిగిన నష్టం రూ.715 బిలియన్లు. ఇది 2010 జీడీపీలో 1.1 శాతానికి సమానం.
 
 పర్యావరణం-ఆర్థిక అకౌంటింగ్:
 పర్యావరణ, ఆర్థిక అకౌంటింగ్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుతమున్న జాతీయ ఆర్థిక అకౌంట్స్ పద్ధతులను విస్తరించటం. జాతీయ వనరులకు సంబంధించి ‘శాటిలైట్ సిస్టమ్ ఆఫ్ ఆకౌంట్స్’ను అభివృద్ధి చేశారు. దీన్ని ప్రస్తుతం గ్రీన్ జీఎన్‌పీగా పరిగణిస్తున్నారు. శ్రేయస్సును కొలవటంలో స్థూలజాతీయోత్పత్తి అంచనాలు ఎంతవరకు ఉపకరిస్తాయనే విషయంలో ఆర్థిక వేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు సందేహాలు వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఆర్థికాభివృద్ధి, జాతీయ శ్రేయస్సును కొలిచేందుకు జీఎన్‌పీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ జీఎన్‌పీ కొలమానం వెలుగులోకి వచ్చింది. మానవ శ్రేయస్సు, ఆదాయ పంపిణీలో సమానత్వం-సుస్థిర ఆర్థికాభివృద్ధిని గ్రీన్ జీఎన్‌పీ కొలమానం ద్వారా కచ్చితంగా అంచనా వేయొచ్చని కొందరు ఆర్థిక వేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం. వృద్ధి అకౌంటింగ్‌లో పర్యావరణ అంశాలను చేర్చటం ద్వారా 2015 నుంచి భారత ప్రభుత్వం గ్రీన్ జీడీపీ అంచనాలను రూపొందించాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా గ్రీన్ జీడీపీ అంచనాలను మొదటిసారిగా 2004 సంవత్సరానికి సంబంధించి 2006లో వెలువరించింది. భారత ప్రభుత్వం గ్రీన్ జీడీపీ అంచనాలను రూపొందిస్తే ‘పర్యావరణ గవర్నెన్స్’లో కీలక చర్యగా భావించవచ్చు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement