ఎకానమీపై పట్టు ఇలా.. | Sakshi
Sakshi News home page

ఎకానమీపై పట్టు ఇలా..

Published Thu, Apr 28 2016 4:00 AM

ఎకానమీపై పట్టు ఇలా..

 సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో ఎకానమీ కీలకాంశం. వివిధ సర్వీస్ కమిషన్లు  నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో ఎకానమీకి సంబంధించి 15 నుంచి 20 ప్రశ్నలు కచ్చితంగా ఉంటున్నాయి.   ఈ నేపథ్యంలో ఎకానమీని ఎలా  అధ్యయనం చేయాలో తెలుసుకుందాం..
 
 వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఎకానమీలో భాగంగా కింది అంశాల అధ్యయనం ప్రిలిమినరీ పరీక్షతోపాటు మెయిన్‌‌సకు కూడా ఉపకరిస్తుంది.
 
 పెట్టుబడిదారీ, సామ్యవాద, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు.
 పంచవర్ష ప్రణాళికలు - సమ్మిళిత వృద్ధి - నీతి ఆయోగ్.
 భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు.
 
 జాతీయాదాయం-వివిధ భావనలు-జాతీయాదాయం లో వివిధ రంగాల వాటా - జాతీయ, తలసరి ఆదాయం.
 బ్యాంకింగ్ రంగం - జాతీయీకరణ - కేంద్ర బ్యాంకు - పరిమాణాత్మక, గుణాత్మక పరపతి సాధనాలు.
 పేదరికం - నిరుద్యోగం - నిరుద్యోగ కొలమానాలు - శ్రామిక శక్తి - ద్రవ్యోల్బణం.
 స్వయం ఉపాధి, వేతన ఉపాధి కార్యక్రమాలు - సామాజిక భద్రతా పథకాలు.
 
 అంతర్జాతీయ వాణిజ్యం - ఎగుమతులు, దిగుమతులు - చెల్లింపుల శేషం - మూల్యహీనీకరణ - కరెంట్ అకౌంట్ లోటు - మూలధన ఖాతా.
 
 భారతదేశంలో పన్నుల వ్యవస్థ - బడ్జెటరీ విధానం - ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం - రెవెన్యూ, మూలధన ఖాతా - ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం.
 
 ఆర్థిక సంస్కరణలు - పారిశ్రామిక, బీమా, బ్యాంకింగ్, మూలధన మార్కెట్.
 
 ద్రవ్య విధానం, కోశ విధానం.
 వ్యవసాయ రంగం - హరిత విప్లవం - వ్యవసాయ పరపతి - మద్ధతు ధరలు.
 
 పారిశ్రామిక రంగం - ఎంఎస్‌ఎంఈ రంగం - పారిశ్రామిక పరపతి సంస్థలు - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - ప్రత్యేక ఆర్థిక మండళ్లు.
 
 సేవా రంగం - జాతీయాదాయంలో సేవా రంగం వాటా - పర్యాటక రంగం.
 
 ఐఎంఎఫ్ - ప్రపంచ బ్యాంకు - ఐడీఏ
 ప్రపంచ వాణిజ్య సంస్థ.
 
 మానవాభివృద్ధికి సంబంధించి యూఎన్‌డీపీ, వివిధ కొలమానాలు.
 ప్రణాళికలు - సమ్మిళిత వృద్ధి - నీతి ఆయోగ్
 
 వివిధ పోటీ పరీక్షల ప్రిలిమినరీ ప్రశ్న పత్రాల్లో  ప్రణాళికల లక్ష్యాలు, ప్రణాళికల్లో సాధించిన విజయాలు, సమ్మిళిత వృద్ధి సాధనకు వేటిపై దృష్టి సారించాలి అనే అంశాలకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలితోపాటు నీతి ఆయోగ్ ఏర్పాటు ఉద్దేశం, ప్రణాళికా యుగంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగారు. ఆయా అంశాలకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి.
 
 1. పన్నెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశం?         
   (2014 సివిల్స్)
 1) సమ్మిళిత వృద్ధి, పేదరికం తగ్గింపు
 2) సమ్మిళిత, సుస్థిర వృద్ధి
 
 3) నిరుద్యోగం తగ్గింపునకు సుస్థిర, సమ్మిళిత వృద్ధి
 4) వేగవంతమైన, సుస్థిర, అధిక సమ్మిళిత వృద్ధి
 
 2. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు మొదలు పెట్టారు?     (2008, ఏపీపీఎస్సీ)
 1) జనవరి 1, 1989    2) జనవరి 1, 1990
 3) ఏప్రిల్ 1, 1992        4) ఏప్రిల్ 1, 1991
 
  జాతీయాదాయం
 జాతీయాదాయానికి సంబంధించి స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం అంచనాలు, జాతీయాదాయ కమిటీ, కేంద్ర గణాంక సంస్థతోపాటు జాతీయాదాయ భావనలైన స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం, జీడీపీ డిఫ్లేటర్  లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అనేక ప్రశ్న పత్రాల్లో కనిపిస్తాయి. గత రెండేళ్ల కాలంలో జాతీయ, తలసరి ఆదాయాల గణాంకాలను మార్కెట్, స్థిర ధరల వద్ద పరిశీలించాలి. జాతీయాదాయ లెక్కింపులో ఎదురయ్యే సమస్యలతోపాటు, జాతీయాదాయాన్ని లెక్కించేందుకు ఉపయోగించే ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులకు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. గినీ సూచీ, లారేంజ్ నిష్పత్తి లాంటి పదాల పట్ల అవగాహన అవసరం. గత ప్రశ్న పత్రాల్లో ఆయా అంశాలపై వచ్చిన ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి.
 
 1.భారతదేశంలో జాతీయాదాయాన్ని దేని సహాయంతో లెక్కిస్తారు? 2008, ఏపీపీఎస్సీ)
 1) ఆదాయ పద్ధతి             2) ఉత్పత్తి పద్ధతి
 3) వ్యయ పద్ధతి             4) అన్ని పద్ధతులు
 
 2.జాతీయాదాయం?    (ఎస్‌ఎస్‌సీ ఎఫ్‌సీఐ పరీక్ష, 2012)
 1) నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు + సబ్సిడీలు
 2) స్థూల జాతీయోత్పత్తి - ప్రత్యక్ష పన్నులు
 3) స్థూల దేశీయోత్పత్తి - దిగుమతులు
 4) నికర దేశీయోత్పత్తి + ఉత్పత్తులు
 
 బ్యాంకింగ్ రంగం
 ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్ రంగాన్ని ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలి. పోటీ పరీక్షల్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పదకోశాలను అధికంగా ఇచ్చారు.  లీడ్ బ్యాంక్ పథకం, ప్రాధాన్యతా రంగ రుణం, నిరర్థక ఆస్తులు, బ్యాంక్ రేటు, బహిరంగ మార్కెట్ చర్యలు, నగదు నిల్వల నిష్పత్తి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపోరేటు, రివర్‌‌స రెపోరేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ లాంటి పదాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను తెలుసుకునే ప్రశ్నలు, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రధానంగా ఉంటాయి. వీటితోపాటు నరసింహం కమిటీ, నాయక్ కమిటీ సిఫార్సులతో పాటు, జన్‌ధన్ యోజన, బ్రిక్స్‌బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్స్ లాంటి అంశాలకు సంబంధించి సమగ్ర నోట్స్ రూపొందించుకోవాలి.
 
 1.రిజర్‌‌వబ్యాంక్ బ్యాంకు రేటు తగ్గింపు దేనికి దారి తీస్తుంది? (2011, సివిల్స్)
 1) మార్కెట్‌లో అధిక ద్రవ్యత్వం
 2) మార్కెట్‌లో తక్కువ ద్రవ్యత్వం
 3) మార్కెట్ ద్రవ్యత్వంలో మార్పు ఉండదు
 4) వాణిజ్య బ్యాంకులు అధిక డిపాజిట్లు సమీకరించుకోవడానికి అవకాశం
 
 డిగ్రీ స్థాయిలో ఎకానమీ అభ్యసించని విద్యార్థులు  మొదటగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలపై అవగాహన ఏర్పర్చు కోవాలి. సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని వివిధ పద కోశాలను అవగాహన చేసుకోవాలి. దీనివల్ల వివిధ అంశాల అధ్యయనం సులువవుతుంది. జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగం, బడ్జెట్‌లాంటి అంశాలను అధ్యయనం చేసే క్రమంలో తాజా గణాంకాలపై దృష్టి సారించాలి.

Advertisement
Advertisement