ప్రొఫెషనల్ కోర్సులకు.. ఫీజుల సెగ! | Sakshi
Sakshi News home page

ప్రొఫెషనల్ కోర్సులకు.. ఫీజుల సెగ!

Published Sun, May 1 2016 4:49 AM

ప్రొఫెషనల్ కోర్సులకు.. ఫీజుల సెగ! - Sakshi

ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫీజుల భారం పెరగనుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఐఐటీల్లో ఫీజుల మోత మోగింది. ఇప్పుడిక రాష్ట్రాల స్థాయి కళాశాలల్లో సైతం భారీగా ఫీజుల పెంపు దిశగా రంగం సిద్ధమైంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకుంటే లక్షలు కుమ్మరించాల్సిందే!
 
* పెను భారం కానున్న వృత్తివిద్యా చదువులు
* ఏకీకృత ఫీజులను నిర్ధారించిన ఏఐసీటీఈ
* ఫీజులు పెంచేందుకు సిద్ధమవుతున్న ఏఎఫ్‌ఆర్‌సీ

 
ఇంతకీ ఏ ఫీజు
జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజు ఉండేలా ఏఐసీటీఈ నియమించిన నేషనల్ ఫీ ఫిక్సేషన్ కమిటీ ఫీజులు ఖరారు చేసింది. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం కూడా లభించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలో అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ అథారిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)లు 2016-19 బ్లాక్ పీరియడ్‌కు ఫీజులు పెంచే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాంతో ఫీజు ఎంత పెరుగుతుందో.. అసలు ఈ విద్యా సంవత్సరంలో  ఏకీకృత, ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజుల్లో ఏది అమల్లోకి వస్తుందో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
 
భారీగా ఫీజుల సిఫార్సు
బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఫార్మా-డి తదితర కోర్సుల్లో జాతీయ స్థాయిలో ఒకే విధమైన ఫీజు విధానాన్ని అమలు చేయాలని 2014లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశ వ్యాప్తంగా పలు కళాశాలల యాజమాన్యాలు, విద్యావేత్తలు, ఇతర వర్గాలతో పలు సంప్రదింపులు చేసింది. చివరకు గత నవంబర్‌లో ఆయా కోర్సులకు ఫీజులు నిర్ధారిస్తూ నివేదిక అందించింది. దీనికి ఏఐసీటీఈ ఆమోదం కూడా లభించింది.
 
ఇంజనీరింగ్ కనీసం 1.44 లక్షలు..
నేషనల్ ఫీ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సు చేసిన ఫీజుల మొత్తాలు విద్యార్థుల గుండెలను గుభేల్‌మనిపిస్తున్నాయి. ఒక్క ఇంజనీరింగ్ కోర్సునే చూస్తే ఏడాదికి కనిష్టంగా 1.44 లక్షలు, గరిష్టంగా 1,58,300గా నిర్ధారించింది.  నగరాలు/పట్టణాలను మూడు కేటగిరీలుగా (టైప్-ఎక్స్, టైప్-వై, టైప్-జెడ్)  వర్గీకరించి ఫీజులు నిర్ధారించింది. ఇందుకోసం ఆరో వేతన సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం విశేషం!
 
తుదిదశకు చేరుకున్న ఏఎఫ్‌ఆర్‌సీల కసరత్తు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ, సమీక్ష, నిర్ధారణకు  ఏర్పాటైన అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) 2016-19 బ్లాక్ పీరియడ్‌కు కొత్త ఫీజుల ఖరారు దిశగా కసరత్తు తుది దశలో ఉంది. ఇప్పటికే 2013-16 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ వార్షిక ఫీజులు రూ. 30 వేల నుంచి రూ. 1.09 లక్షల వరకు ఉంది. 2013-16 బ్లాక్ పిరియడ్ వ్యవధి ముగియడంతో మరో మూడేళ్ల బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి 2016-19 విద్యా సంవత్సరాల్లో ఫీజులు నిర్ధారించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఫీజులు 20 నుంచి 30 శాతం మధ్యలో పెరగనున్నట్లు సమాచారం.
 
తెలుగు రాష్ట్రాల్లో టైప్-ఎక్స్ పరిధిలో హైదరాబాద్, టైప్-వై పరిధిలో విజయవాడ, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు... మిగిలిన అన్నీ టైప్ -జడ్ పరిధిలోనే ఉన్నాయి. ఈ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఒకవేళ జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజుల విధానాన్నే అమలు చేస్తే అధిక సంఖ్యలో ఉన్న టైప్-జడ్ పట్టణాలు/ నగరాల్లో బీటెక్ చదవాలంటే.. ఏడాదికి రూ.1,44,900 చెల్లించాల్సి ఉంటుంది. అత్యున్నత ప్రమాణాలు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు అదనంగా 20 శాతం, అటానమస్ కళాశాలలు అదనంగా పది శాతం వసూలు చేసుకోవచ్చనే కమిషన్ సిఫార్సు మరింత భారం పెంచనుంది.
 
జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజుల అమలు దిశగా యోచిస్తున్న ఏఐసీటీఈ.. వాటిని అమలు చేసే ముందు ఆయా కళాశాలలు పాటిస్తున్న ప్రమాణాల విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలి. అలా కాకుండా కేవలం కమిటీ సిఫార్సులపైనే ప్రాంతాల వారీగా ఫీజులు నిర్ధారించడం వల్ల విద్యార్థులకు చదవులు భారం అవుతాయే తప్ప నైపుణ్యాలు లభిస్తాయన్న గ్యారెంటీ లేదు.
- ప్రొఫెసర్. వి.ఎస్. ప్రసాద్, న్యాక్ మాజీ డెరైక్టర్

Advertisement
Advertisement