పదోతరగతితో రైల్వే ఉద్యోగం | Sakshi
Sakshi News home page

పదోతరగతితో రైల్వే ఉద్యోగం

Published Thu, Sep 12 2013 1:00 PM

Railway jobs in 10th class qualification

వరుస నోటిఫికేషన్లతో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ బోర్డుగా మారిన రైల్వే శాఖ.. మరో సారి భారీ స్థాయిలో కొలువుల జాతరకు తెరతీసింది.. దాదాపు 2వేలకు పైగా గ్రూప్-డి కేటగిరీ పోస్టుల భర్తీ కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే)-రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)
 నోటిఫికేషన్ విడుదల చేసింది.. కేవలం పదో తరగతి అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.. కాసింత శ్రమిస్తే ఐదంకెల వేతనంతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.. ఈ నేపథ్యంలో రిక్రూట్‌మెంట్ విధానం, ప్రిపరేషన్ ప్లాన్, తదితర అంశాలపై ఫోకస్..
 
 తాజా నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేసే పోస్టుల సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ.. పదో తరగతి అర్హత కావడంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. కాబట్టి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తేనే విజయం సాధ్యమవుతుంది.
 
 భర్తీ చేసే పోస్టుల సంఖ్య:
 పోస్టులు    ఖాళీలు
 ట్రాక్‌మెన్    1,979
 హెల్పర్-2:    440
 అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్:    382
 మొత్తం    2,801
 
 
 ఎంపిక విధానం:
 ఎంపిక ప్రక్రియలో మొత్తం మూడు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), మెడికల్ టెస్ట్. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ.. పీఈటీ, మెడికల్ టెస్ట్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది.
 
 రాత పరీక్ష:
 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానం(మల్టిపుల్ చాయిస్)లో నిర్వ హిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక్కొ క్క మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. ఈ క్రమంలో జనరల్ స్టడీస్, అర్థమెటిక్-రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 విభాగాల వారీగా-జనరల్ స్టడీస్:
 ఈ విభాగం నుంచి 80 ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు కేటాయించారు. ఇందులో స్టాక్ జనరల్ నాలెడ్జ్ (జీకే), కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, క్రీడారంగం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి కచ్చితంగా ఇన్ని ప్రశ్నలు వస్తాయని చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రశ్నల విభజన (డివిజన్) మారుతుంటుంది.
 
 ఇందులో చక్కని స్కోర్ చేయాలంటే దృష్టి సారించాల్సిన అంశాలు: దేశాలు- రాజధానులు- కరెన్సీ-భాషలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ పార్కులు, అబ్రివేషన్స్, అంతరిక్ష పరిశోధనలు, భారత రక్షణ వ్యవస్థ, సమాచార రంగం, రవాణా వ్యవస్థ, భారతదేశం- రాజ్యాంగం, భారతదేశ చరిత్ర- ముఖ్యాంశాలు, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, జనరల్ సైన్స్, వివిధ పరిశోధనలు- శాస్త్రవేత్తలు, శాస్త్రీయ పరికరాలు, ఆవిష్కరణలు- ఆవిష్కర్తలు, ఆంధ్రప్రదేశ్- ముఖ్యాంశాలు, దేశాలు- వైమానిక సంస్థలు, పితామహులు, పూర్వపు పేర్లు-మారు పేర్లు, సరిహద్దు రేఖలు, అవార్డులు, క్రీడలు, విశ్వం- పుట్టుక, భౌగోళికంగా పేర్లు, రోజుల ప్రాధాన్యత, తొలి వ్యక్తులు, బిరుదులు, నాట్యాలు- నృత్యాలు- పండగ లు, ప్రముఖ రచయితలు- రచనలు, నదీ తీర నగరాలు, జాతీయ చిహ్నాలు, దేశాలు- చిహ్నాలు, వివిధ సంస్థలు- నెలకొల్పిన ప్రదేశాలు, ప్రముఖుల నినాదాలు మొదలైనవి.
 
 రిఫరెన్స్ బుక్స్:
 జనరల్ అవేర్‌నెస్- అరిహంత్ పబ్లికేషన్స్, ఇతర స్టాండర్డ్ పుస్తకాలు, మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ (ఇయర్ బుక్ నుంచే ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది), 8,9,10 తరగతులకు సంబంధించి సైన్స్, సోషల్ పుస్తకాలు.
 
 ఇందులో అడిగే ప్రశ్నల సరళి:
 1.సున్నపు తేటను పాలలా మార్చే వాయువు?
 ఎ) CO2     
 బి) O2
 సి) H2
 డి) SO2
 
 జవాబు: ఎ
 
 2.దేశంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రం?
 ఎ) ఆంధ్రప్రదేశ్
 బి) ఒడిశా
 సి) మధ్యప్రదేశ్    
 డి) పశ్చిమ బెంగాల్
 
 జవాబు: సి
 
 3.కర్ణాటక ముఖ్యమంత్రి?
 ఎ) సిద్ధరామయ్య
 బి) యడ్యూరప్ప
 సి) కుమారస్వామి    
 డి) ఎవరూ కాదు
 
 జవాబు: ఎ
 
 అర్థమెటిక్:
 అభ్యర్థుల గణిత సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించిన విభాగమిది. ఇందులో సంఖ్యలు, గ.సా.భా-క.సా.గు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు-ఘన మూలాలు, సూక్ష్మీకరణ, సరాసరి (సగటు), వయసు, నిష్పత్తి-అనుపాతం, భాగస్వామ్యం, శాతాలు, లాభ- నష్టాలు, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యం, ఘనపరిమాణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 రిఫరెన్స్ బుక్స్:
 అర్థమెటిక్ బై ఆర్ ఎస్ అగర్వాల్
 అర్థమెటిక్ బై గులాటి
 
 ఇందులో అడిగే ప్రశ్నల సరళి:
 1.ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు గంటకు 30 కిలో మీటర్ల వేగంతో, ఆఫీస్ నుంచి ఇంటికి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణానికి 30 నిమిషాల సమయం పడితే ఇంటి నుంచి ఆఫీస్‌కు ఎంత దూరం?
 ఎ) 24 కి.మీ.    
 బి) 12 కి.మీ.
 సి) 6 కి.మీ.    
 డి) 3 కి.మీ
 
 జవాబు: సి
 
 2.ఒక త్రిభుజ వైశాల్యం 300 చదరపు మీటర్లు. దాని భూమి 20 మీటర్లు. అయితే ఎత్తు ఎంత?
 ఎ) 15 మీటర్లు    
 బి) 30 మీటర్లు
 సి) 45 మీటర్లు    
 డి) 60 మీటర్లు
 
 జవాబు: బి
 
 3.సంవత్సరానికి 8 శాతం బారువడ్డీ చొప్పున రూ. 20,000 అసలు మొత్తం కొంత కాలానికి రూ. 23, 200 అయితే ఆ కాలాన్ని కనుక్కోండి?
 ఎ) ఒక సంవత్సరం    
 బి) రెండు సంవత్సరాలు
 సి) నాలుగు సంవత్సరాలు
 డి) 12 సంవత్సరాలు
 
 జవాబు: బి
 
 రీజనింగ్: ఈ విభాగంలో వరుస క్రమ పరీక్ష, పోలికలు, భిన్నంగా ఉన్న వాటిని గుర్తించడం, కోడింగ్-డికోడింగ్, రక్త సంబంధాలు (బ్లడ్ రిలేషన్స్), దిశలు-దూరం, మిశ్రమ భిన్నాలు, గడియారం, క్యాలెండర్, వెన్ చిత్రాలు, లాజికల్-వెన్ చిత్రాలు, ర్యాంకింగ్ పరీక్ష, నంబర్/ఆల్ఫాబెట్ పరీక్ష, గణిత గుర్తులు, పాచికల పరీక్ష, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, లాజికల్ రీజనింగ్, నాన్-వెర్బల్ రీజనింగ్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 రిఫరెన్స్ బుక్స్:
 వెర్బల్ రీజనింగ్ బై ఆర్‌ఎస్ అగర్వాల్
 బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రముఖ ప్రచురణ సంస్థలు వెలువరించే లాజికల్ రీజనింగ్ బుక్స్.
 
 
 
 
 
 
 
 1.    ఒక పరిభాషలో CBD అనే పదాన్ని FEG అని రాస్తే SRT అనే పదాన్ని ఏ విధంగా రాయాలి?
 ఎ) UVW
 బి) WVU
 సి) VUW     
 డి) VUX
 
 
 2.4, 8, 24, 94, --?
 ఎ) 376    
 బి) 470
 సి) 420    
 డి) 620
 జవాబు: బి
 
 3.రాజు ఫొటోలో ఉన్న ఒక అమ్మాయిని పరిచయం చేస్తూ.. ‘ఆ అమ్మాయి తండ్రి, మా నాన్నకు ఏకైక కొడుకు’ అని చెప్పాడు. రాజుకు ఆ అమ్మాయి ఏమవుతుంది?
 ఎ) సోదరి    
 బి) తల్లి
 సి) కూతురు    
 డి) అత్త
 జవాబు: సి
 
 ప్రిపరేషన్: అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు 70 మార్కులు కేటాయించారు. వీటిల్లో 70 ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగాల్లో అడిగే ప్రశ్నల క్లిష్టత 7వ తరగతి స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా సంబంధిత విభాగాల్లోని ప్రాథమిక భావనల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు సులభంగానే సాధించే విధంగా ఉంటాయి. 7వ తరగతి స్థాయి కాబట్టి నాన్- మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఈ విభాగాన్ని సులభంగానే చేయవచ్చు. కొద్దిపాటి ఆలోచనతో జవాబులను కనుక్కోవచ్చు. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇందులో చక్కని స్కోర్ సాధించవచ్చు.
 
 తెలుగులో కూడా: రాత పరీక్షను ఇంగ్లిష్, హిందీతోపాటు స్థానిక భాషలైన ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీలలో కూడా నిర్వహిస్తారు. కాబట్టి మన రాష్ట్ర అభ్యర్థులు తెలుగు భాషలో కూడా పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో భాష ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని పేర్కొనాలి.
 
 ఫిజికల్ టెస్ట్: రాత పరీక్ష తర్వాత నిర్వహించే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ట్ పురుష, మహిళా అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో 1:3 నిష్పత్తిలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పురుష అభ్యర్థులు 1,000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులకు 400 మీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి 3 నిమిషాల 10 సెకన్లు కేటాయించారు. ఈ దశలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
 
 సాధన ఇలా: ఫిజికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం రెండు నెలల పాటు రోజుకు మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. మొదటి నెల రోజులు పరుగెత్తడం అలవాటుగా చేసుకోవాలి. ఆ తర్వాత నెల రోజులు ఎంత సమయంలో పరుగెత్తుతున్నారో చూసుకోవాలి. 1 కి.మీ. (1,000 మీటర్లు) దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తేలా సిద్ధపడాలి. ఉదయం, సాయంత్రం ఇలా ఏ వేళల్లో పరుగెత్తినప్పటికీ నిర్దేశిత సమయంలో పరుగెత్తడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ టెస్ట్ ఉదయమే నిర్వహిస్తారని గ్యారంటీ ఏమీలేదు.
 
 
 ఆర్‌ఆర్‌సీ గ్రూప్-డి సమాచారం
 
 వేతనం: రూ. 5,200-20,200 గ్రేడ్ పే రూ.1,800
 అర్హత: పదోతరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత
 వయోపరిమితి: 18-33 ఏళ్లు (జనవరి 1, 2014 నాటికి)
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్‌లో హైదరాబాద్/ సికింద్రాబాద్‌లలో చెల్లేలా తీసిన రూ.100 (దరఖాస్తు రుసుం, ఎస్సీ/ఎస్టీ, మహిళ, మైనార్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (వార్షిక ఆదాయం రూ.50 వేలలోపు ఉన్న వారు)కు ఫీజు నుంచి మినహాయింపు). డీడీ/ ఇండియన్ పోస్టల్ ఆర్డర్(ఐపీఓ)ను జత చేయాలి. డీడీ/ఐపీఓను ‘అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్(రిక్రూట్‌మెంట్), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సికింద్రాబాద్’ పేరిట తీయాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2013
 పూర్తి చేసిన దరఖాస్తులను పోస్ట్ లేదా స్వయంగా కింద పేర్కొన్న చిరునామాలో అందజేయాలి (స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ అంగీకరించరు).
 అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, సౌత్ సెంట్రల్ రైల్వే,
 రిటెన్ ఎగ్జామినేషన్ కంట్రోల్ సెంటర్,
 రైల్వే బంగ్లా నంబర్ 100,
 సెయింట్ ఆంథోనిస్ చర్చి ఎదురుగా,
 మెట్టుగూడ బస్టాప్ పక్కన,
 సౌత్ లాలాగూడ, సికింద్రాబాద్-500017.
 వివరాలకు: www.scr.indianrailways.gov.in
 స్పోర్ట్ కోటాలో.. గ్రూప్-సి కేటగిరీ 21 పోస్టులు, గ్రూప్-డి కేటగిరీలో 40 పోస్టుల భర్తీకి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ వెలువడింది.
 దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2013.
 ఇతర నోటిఫికేషన్లు
 నార్త్ ఈస్టర్న్ రైల్వే:
 గ్రూప్-డి కేటగిరీ 1,422 పోస్టులు
 దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2013
 వివరాలకు:www.ner.indianrailways.gov.in
 
 ఈస్ట్ సెంట్రల్ రైల్వే:
 ట్రైన్స్ క్లర్క్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అప్రెంటీస్ విభాగాల్లో 132 పోస్టులు
 దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2013
 వివరాలకు: www.ecr.indianrailways.gov.in
 
 సెంట్రల్ రైల్వే:    అప్రెంటీస్ ట్రైనింగ్ 74 పోస్టులు
 దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2013
 వివరాలకు: www.cr.indianrailways.gov.in
 

Advertisement
Advertisement