ఐరాస దక్షిణాసియా మహిళా ప్రచారకర్తగా సానియా | Sakshi
Sakshi News home page

ఐరాస దక్షిణాసియా మహిళా ప్రచారకర్తగా సానియా

Published Thu, Dec 4 2014 1:05 AM

ఐరాస దక్షిణాసియా మహిళా ప్రచారకర్తగా సానియా

 అంతర్జాతీయం:  ఖాట్మండులో 18వ సార్క్ సదస్సు
దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) 18వ సదస్సు నేపాల్ రాజధాని ఖాట్మండులో నవంబరు 26-27 తేదీల్లో జరిగింది. ఉగ్రవాదం, తీవ్రవాదాలను సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉమ్మడి, ఆర్థిక ద్రవ్య వ్యవస్థగా సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు, సార్క్ అభివృద్ధి నిధిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సదస్సు ప్రకటించింది. సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలను ఎదుర్కొనేందుకు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాలని పిలుపునిచ్చారు. సార్క్ సభ్యదేశాలు: భారత్, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, అఫ్గానిస్థాన్. 19వ సదస్సు పాకిస్థాన్‌లో జరగనుంది.
 
 ఐరాసలో మరణశిక్షలపై తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్
 మరణశిక్షల తాత్కాలిక నిలిపివేతకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ముసాయిదా తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. నవంబరు 24న జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 114 దేశాలు, వ్యతిరేకంగా 36 దేశాలు ఓటు వేశాయి. 34 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షను విధిస్తున్నట్లు భారత్ పేర్కొంది.
 
 నేపాల్ - భారత్ మధ్య 10 ఒప్పందాలు
 18వ సార్క్ సదస్సులో భాగంగా నేపాల్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 25న ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య 10 ఒప్పందాలపై చర్చలు జరిగాయి. నేపాల్‌కు 100 కోట్ల అమెరికన్ డాలర్ల సాయం, మోటారు వాహనాల ఒప్పందం కింద ఇరు దేశాల్లో నిర్ధారించిన మార్గాల్లో ప్రయాణించేందుకు అనుమతి, ట్విన్ సిటీ ఒప్పందం కింద ఖాట్మండు-వారణాసి, జనక్‌పూర్- అయోధ్య, లుంబినీ-బోధ్ గయా నగరాల అనుసంధానం, ఇరు దేశాల సందర్శకులు రూ.500, రూ.1000 నోట్లు తీసుకెళ్లడానికి అనుమతి మొదలైనవి ఉన్నాయి. ఇప్పటివరకు రూ.100 నోట్లకే అవకాశం ఉండేది.
 
 జాతీయం
 43 దేశాల ప్రజలకు ఈ-వీసా సౌకర్యం
 పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత్ 43 దేశాలకు చెందిన ప్రజలకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించింది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవంబరు 27న న్యూఢిల్లీలో ప్రారంభించారు. సౌకర్యం పొందిన దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, రష్యా ఉన్నాయి. ఈ-వీసా 30 రోజులపాటు చెల్లుబాటవుతుంది. ఏడాదిలో రెండుసార్లు దీన్ని వినియోగించుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, గోవా, కోచి విమానాశ్రయాల్లో తొలిసారిగా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.
 
 ఖాట్మండు-ఢిల్లీ బస్సు ప్రారంభం
 భారత ప్రధాని నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కొయిరాలా నవంబరు 25న ఖాట్మండు-ఢిల్లీ మధ్య బస్సును ఖాట్మండులో ప్రారంభించారు. ఈ బస్సుకు పశుపతి నాథ్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. అదే రోజు ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ-ఖాట్మండు బస్సు సర్వీసును ప్రారంభించారు. రెండు దేశాల మధ్య బస్సు సేవలు ప్రారంభం కావడం ఇదే మొదటిసారి.
 
 హార్‌‌నబిల్ ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని
 ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో డిసెంబరు 1న నాగాలాండ్ రాజధాని కోహిమలో పర్యటించారు. వార్షిక హార్న్‌బిల్ ఉత్సవాలను ప్రారంభించారు. త్రిపురలోని ఉదయ్‌పూర్‌లో నిర్మించిన పలతానా విద్యుత్ ప్రాజెక్టులో 750 మెగావాట్ల రెండో యూనిట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు.
 
 మేఘాలయకు తొలి ప్యాసింజరు రైలు
 మేఘాలయకు తొలిసారిగా రైలు అనుసంధానాన్ని కల్పిస్తూ మెందిపథర్-గౌహతి ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 29న ప్రారంభించారు. అలాగే మిజోరంలోని భాయ్బ్రీ-సాయ్‌రంగ్ మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చడానికి శంకుస్థాపన చేశారు.
 
 గుజరాత్‌లో జాతీయ భద్రతా దళం కేంద్రం
 జాతీయ భద్రతా దళం కేంద్రాన్ని (ఎన్‌ఎస్‌జీ) గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు సమీపంలోని రందేశన్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. 2008 ముంబైలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం నేపథ్యంలో 2009లో ముంబై, చెన్నై, కోల్‌కత, హైదరాబాద్‌లలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రందేశన్‌లో నెలకొల్పే ఐదో ఎన్‌ఎస్‌జీ కేంద్రం వచ్చే ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి రానుంది.  
 
  అవార్డులు
 బిలాల్ తన్వీర్‌కు శక్తిభట్ ఫస్ట్ బుక్ ప్రైజ్
 లాహోర్‌కు చెందిన రచయిత బిలాల్ తన్వీర్‌కు శక్తిభట్ ఫస్ట్ బుక్ ప్రైజ్-2014 లభించింది. ఆయన రాసిన నవల ద స్కాటర్ హియర్ ఈజ్ టూ గ్రేట్‌కు ఈ బహుమతి దక్కింది. ఈ అవార్డును న్యూఢిల్లీలో డిసెంబర్ 2న ఆయన అందుకున్నారు. అవార్డు కింద రూ. 2 లక్షల నగదు బహుకరించారు.
 
 ప్రొ.శ్రీనాథ్‌రెడ్డికి లండన్
 యూనివర్సిటీ డాక్టరేట్
 భారతీయ ప్రజారోగ్య సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డికి లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ డాక్టరేట్‌ను నవంబరు 26న యూనివర్సిటీ ఛాన్స్‌లర్ బ్రిటిష్ యువరాణి ప్రదానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనాథ్‌రెడ్డి ప్రజారోగ్యం, గుండె సంబంధ వ్యాధులపై అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
 
 లెవియాథన్ చిత్రానికి బంగారు నెమలి అవార్డు
 గోవా రాజధాని పనాజీలో 11 రోజుల పాటు జరిగిన 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (ఐఎఫ్‌ఐఎఫ్‌ఐ - ఇఫీ) నవంబరు 30న ముగిశాయి.
 
 అవార్డులు-విజేతలు:
     ఉత్తమ చిత్రం (బంగారు నెమలి):
 లెవియాథన్ (రష్యా)
     ఉత్తమ దర్శకుడు: నదావ్ లాపిడ్
 (ఇజ్రాయ్ చిత్రం కిండర్ గార్డెన్ టీచర్ దర్శకత్వానికి)
     స్పెషల్ జ్యూరీ, సెంటినరీ అవార్డు: శ్రీహరి సాథె (భారతీయ చిత్రం: ఎక్ హజరాచీ నోట్‌కి దర్శకత్వానికి)
     ఉత్తమ నటుడు: అలెక్సెల్ సెరిబ్రియాకోవ్ (లెవియాథన్ హీరో), దులాల్ సర్కార్ (బెంగాళీ చిత్రం: చోటోదర్ చోబీ) లు సంయుక్తంగా అందుకున్నారు.
     ఉత్తమ నటి: క్యూబన్ నటి ఎరీనా రోడ్రిగ్ (చిత్రం: బిహేవియర్), సరిత్ లారీ (ఇజ్రాయ్ చిత్రం: కిండర్ గార్డెన్ టీచర్)లు సంయుక్తంగా అందుకున్నారు.
 
 రాష్ట్రీయం
 కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తెలంగాణ
 తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ప్రాజెక్టు అనుమతి, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం-(టీఎస్-టీపాస్) బిల్లు- 2014 పేరుతో బిల్లును నవంబరు 25న మంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం, ఒకే చోట పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం, పరిశ్రమలు వేగంగా ఉత్పత్తి చేపట్టడం అనే లక్ష్యాలతో కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. భారీ పరిశ్రమలకు 15 రోజుల్లో, మధ్య తరహా పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. జిల్లా స్థాయిలో నెలరోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు.
 
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జపాన్ పర్యటన
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనలో నవంబరు 28న టోక్యోలో ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశమయ్యారు. నూతన రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటామని అబే తెలిపారు. ఐదురోజుల పర్యటనలో జపాన్ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో పలు ఒప్పందాలు జరిగాయి. జపాన్ కంపెనీ సుమిటోమితో విద్యుత్ ఉత్పత్తి, రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో ఒప్పందాలు చేసుకుంది.
 
 వార్తల్లో వ్యక్తులు
 ఐరాస దక్షిణాసియా మహిళా ప్రచారకర్తగా సానియా
 ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా విభాగం గుడ్‌విల్ అంబాసిడర్ (సౌహార్ధ్ర రాయబారి)గా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా నవంబరు 25న నియమితులయ్యారు. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం పొందిన తొలి మహిళ సానియా.
 
 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సి.కె.ప్రసాద్
 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌ను ఉపరాష్ట్రపతి నేతృత్వంలోని కమిటీ నవంబరు 25న ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్‌గా ఉన్న మార్కండేయ మూడేళ్ల పదవీకాలం అక్టోబరు 11న ముగిసింది. దీంతో ఆ స్థానంలో సి.కె. ప్రసాద్ నియమితులయ్యారు.
 
 తపన్‌రాయ్ చౌదురీ మృతి
 చరిత్రకారుడు తపన్ రాయ్ చౌదురీ (90) నవంబరు 26న మృతి చెందారు. ఆయన 1973 నుంచి 1992 వరకు ఆక్స్‌ఫర్డ్‌లోని సెంట్ ఆంటోనీ కాలేజీలో ఆధునిక దక్షిణాసియా విభాగంలో రీడర్‌గా పనిచేశారు. అందులోనే భారత చరిత్ర, నాగరికత పీఠంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. బెంగాల్ అండర్ అక్బర్ అండ్ జహంగీర్ అనే పుస్తకంతో పాటు తన జ్ఞాపకాలపై బెంగాల్ నామా అనే పుస్తకాన్ని బెంగాలీ భాషలో రాశారు.
 
 కథక్ నర్తకి సితారాదేవి మృతి
 ప్రముఖ కథక్ నర్తకి సితారాదేవి (96) నవంబరు 25న ముంబైలో మరణించారు. ఆమె 1969లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 1973లో పద్మశ్రీ, 1995లో కాళిదాస్ సమ్మాన్ పురస్కారం పొందారు.     
 
 క్రీడలు
 కర్ణాటకకు విజయ్ హ జారే ట్రోఫీ
 క్రికెట్‌లో విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో నవంబరు 25న జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించి కర్ణాటక విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
 
 ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి
 దేశవాళి క్రికెట్‌లో ఆడుతూ గాయపడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) సిడ్నీ ఆసుపత్రిలో నవంబరు 27న మరణించారు. బౌలర్ సీన్‌అబాట్ వేసిన బంతి హ్యూస్ తలకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది.
 పీవీ సింధుకు మకావ్ ఓపెన్ టైటిల్
 భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. నవంబరు 30న మకావ్‌లో జరిగిన ఫైనల్‌లో కిమ్ హ్యోమిన్ (దక్షిణ కొరియా) ను డిఫెండింగ్ ఛాంపియన్ సింధు ఓడించింది. విజేతకు రూ. 5.60 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. సింధుకు ఇది మూడో గ్రాండ్ ప్రి టైటిల్.
 
 ఐబీఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా మోహన్
 అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ పి.వి.కె.మోహన్ ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కాగా ఆసియా నుంచి మూడో వ్యక్తి. ఈ హోదాలో ఆయన రెండేళ్లు కొనసాగుతారు.
 
 స్నూకర్ టైటిల్ విజేత బింగ్ టావ్
 ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను 14 ఏళ్ల చైనాకు చెందిన యాన్ బింగ్‌టావ్ కైవసం చేసుకున్నాడు. 12 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్ అద్వానీ సహా హేమాహేమీలను ఓడిస్తూ ఫైనల్‌కు చేరిన యాన్... తుదిపోరులో మహ్మద్ సజ్జాద్ (పాకిస్థాన్) ను ఓడించాడు. దీంతో అత్యంత పిన్న వయసులో స్నూకర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఘనత అతడికి దక్కింది. మహిళల విభాగంలో వాండీ జాన్స్ (బెల్జియం) రష్యాకు చెందిన అనస్తాషియా నెచెయివాను ఓడించి టైటిల్ సాధించింది.

- ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు

 

Advertisement
Advertisement