స్టడీ ఇన్ సింగపూర్ | Sakshi
Sakshi News home page

స్టడీ ఇన్ సింగపూర్

Published Fri, Sep 23 2016 3:41 AM

స్టడీ ఇన్ సింగపూర్

సింగపూర్.. భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు గమ్యస్థానంగా నిలుస్తోన్న దేశాల్లో ఒకటి. ప్రపంచంలోని అత్యున్నత విద్యా సంస్థలకు వివిధ సంస్థలు ఇచ్చే ర్యాంకుల్లో సింగపూర్ యూనివర్సిటీలు.. టాప్-100లో చోటు దక్కించుకుంటున్నాయి. ప్రపంచంలోనే సురక్షిత దేశాల్లో ఒకటి కావడం, వివిధ బహుళజాతి సంస్థలు సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటం వంటి కారణాలతో ఈ దేశాన్ని ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ యూనివర్సిటీలు.. ప్రవేశాలపై ప్రత్యేక కథనం..
 
 ప్రస్తుతం ఆసియాలో ఆర్థికంగా గణనీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన సింగపూర్‌ను మంచి ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా పరిగణిస్తున్నారు. నాణ్యమైన విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోర్సులను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం సింగపూర్‌ను ఎంచుకుంటున్నారు. భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండటం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉండటం మన దేశ విద్యార్థులను సింగపూర్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి.
 
 నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)
 ఆసియాలో పేరుగాంచిన యూనివర్సిటీల్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఒకటి. 2016-17 క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే 12వ స్థానంలో నిలిచింది. ఇక సబ్జెక్టుల పరంగా చూస్తే కంప్యూటర్ సైన్‌‌సలో 9, బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ స్టడీస్‌లో 12వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో 13 అండర్‌గ్రాడ్యుయేట్ స్కూళ్లు, 4 గ్రాడ్యుయేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 300 పైగా వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రీసెర్చ్ బేస్‌డ్ ఎడ్యుకేషన్‌కు ఈ యూనివర్సిటీ పెట్టింది పేరు. ఆ దేశ విద్యార్థులతో కలిపి వివిధ దేశాల నుంచి సుమారు 38 వేల మంది విద్యార్థులు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో విద్యను అభ్యసిస్తున్నారు.
 అడ్మిషన్‌‌స:
 అండర్‌గ్రాడ్యుయేషన్: అక్టోబర్, మార్చి
 గ్రాడ్యుయేషన్: జనవరి, ఆగస్టు
 వెబ్‌సైట్:  www.nus.edu.sg
 
 నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్‌టీయూ)
 ఆసియాలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఎన్‌టీయూ టాప్-5లో ఉంటుంది. 2016-17కు క్యూఎస్ ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీల ర్యాంకుల్లో ప్రపంచంలోనే 13వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా రీసెర్చ్ ప్రోగ్రామ్‌లకు ఈ యూనివర్సిటీ ఉత్తమమైంది. దీని పరిధిలో ప్రస్తుతం ఐదు కాలేజీలు, ఐదు అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు 16 ఇతర ఇన్‌స్టిట్యూట్లు, సెంటర్లు ఉన్నాయి. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో దాదాపు 33 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
 
 అడ్మిషన్‌‌స:
 అండర్‌గ్రాడ్యుయేషన్: ఆగస్టు - జనవరి
 గ్రాడ్యుయేషన్: ఆగస్టు - జనవరి    
 వెబ్‌సైట్: www.ntu.edu.sg
 
 
 సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ (ఎస్‌ఎమ్‌యూ)
 సింగపూర్‌లోని టాప్ యూనివర్సిటీల్లో ప్రధానమైంది సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సోషల్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ యూనివర్సిటీ. దీని పరిధిలోని అకౌంటెన్సీ, బిజినెస్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, లా, సోషల్ సైన్స్ విభాగాల్లో ఆరు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీటితోపాటు మరో 11 విద్యా సంస్థలు ఎస్‌ఎంయూ పరిధిలో ఉన్నాయి.
 అడ్మిషన్‌‌స:
 అండర్‌గ్రాడ్యుయేషన్: అక్టోబర్ - మార్చి
 గ్రాడ్యుయేషన్: ఏప్రిల్ - నవంబర్
 వెబ్‌సైట్: www.smu.edu.sg
 
 సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
 సింగపూర్‌లోని ఉత్తమ విద్యా సంస్థల్లో మరొకటి.. సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్. 2005లో ఏర్పాటు చేసిన ఈ ప్రైవేట్ యూనివర్సిటీ పరిధిలో ఆర్ట్స్- సోషల్ సెన్సైస్, బిజినెస్,  హ్యూమన్ డెవలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు చెందిన ఐదు స్కూళ్లలో దాదాపు 50 డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సుమారు 14 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో అడ్మిషన్ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
 వెబ్‌సైట్: http://www.sim.edu.sg
 
 సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్   టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్‌యూటీడీ)
 టెక్నాలజీ అండ్ డిజైన్ కోర్సులకు ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ.. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యూఎస్, చైనా సర్టిఫికెట్లు అందిస్తోంది. ఆర్కిటెక్చర్ అండ్ సస్టైనబుల్ డిజైన్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్ సిస్టమ్స్ అండ్ డిజైన్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ టెక్నాలజీ అండ్ డిజైన్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్ ఈ యూనివర్సిటీ అందిస్తున్న ప్రధానమైన కోర్సులు.
 అడ్మిషన్‌‌స:
 గ్రాడ్యుయేషన్: మార్చి
 పోస్ట్‌గ్రాడ్యుయేషన్: సెప్టెంబర్
 వెబ్‌సైట్: www.sutd.edu.sg
 
 
 ప్రస్తుతం భారతీయ విద్యార్థులు విదేశీ విద్యపై ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. అక్కడ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అభ్యసించవచ్చు. సింగపూర్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలకు చెందిన ప్రముఖ విద్యా సంస్థలు కూడా తమ క్యాంపస్‌లను నెలకొల్పాయి. ఆయా దేశాల్లో ఉన్నత విద్య ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అదే విద్యను సింగపూర్‌లో తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చు. సింగపూర్‌లో ఎక్కువగా మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎంఎస్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలు జీఆర్‌ఈ స్కోరు లేకుండా కూడా అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యకు సింగపూర్ బెస్ట్ చాయిస్.
 
 - అరుల్ జోసెఫ్, అడ్మిషన్ కన్సల్టెంట్, హైదరాబాద్
 
 

Advertisement
Advertisement