మెడిసిన్‌ అబ్రాడ్‌ | Sakshi
Sakshi News home page

మెడిసిన్‌ అబ్రాడ్‌

Published Mon, Jun 11 2018 8:41 AM

Study Medicine In Abroad - Sakshi

మన దేశంలోని విద్యార్థులకు మెడిసిన్‌ కోర్సుల పట్ల అత్యంత క్రేజ్‌. దాదాపు 60 వేల సీట్లకు 12 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు అంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్‌ సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ! దాంతో నీట్‌లో మంచి ర్యాంకులు పొందిన కొద్ది మందికే  దేశంలో వైద్య కోర్సులుఅభ్యసించే అవకాశం లభిస్తోంది. దాంతో ఎలాగైనా ‘డాక్టర్‌’ కల నెరవేర్చుకోవాలనుకునే విద్యార్థులు విదేశాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఎంబీబీఎస్‌ అబ్రాడ్‌ కోణంలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు, ప్రవేశ విధానం, ఫీజులు, ఆయా దేశాల్లో పేరున్న యూనివర్సిటీల గురించి తెలుసుకుందాం..

చైనా
మెడికల్‌ కోర్సుల పరంగా ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థుల ఆదరణ పెరుగుతున్న దేశం చైనా.  కారణం.. ఇతర దేశాలతో పోల్చితే తక్కువ ఖర్చు, సరిహద్దునే ఉన్న దేశం. అన్నిటికంటే ముఖ్యంగా కరిక్యులం పరంగా క్లినికల్‌ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. ఇంగ్లిష్‌ మీడియం బోధన మరో కలిసొచ్చే అంశం. ఆరేళ్ల వ్యవధిలో ఉండే కోర్సు సమయంలో అయిదేళ్లు క్లాస్‌రూం బోధన, మరో ఏడాది ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. ఫీజు ఏడాదికి గరిష్టంగా రూ.రెండున్నర లక్షలు ఉంటుంది. ఏటా ఆగస్ట్‌/సెప్టెంబర్‌లో క్లాసులు ప్రారంభమవుతాయి. చైనా ప్రభుత్వం ఏటా అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు అనుమతి పొందిన మెడికల్‌ కాలేజీల జాబితాను ప్రచురిస్తుంది. విద్యార్థులు ఆ కాలేజీల్లోనే చేరడం మేలు. ఇలాంటి కాలేజీలు దాదాపు 50 వరకూ ఉంటాయి. ఇంటర్‌/10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన విద్యార్థులు చైనాలో మెడిసిన్‌ కోర్సుల్లో చేరేందుకు అర్హులు.

యూనివర్సిటీస్‌/ఇన్‌స్టిట్యూట్స్‌: చైనా మెడికల్‌ యూనివర్సిటీ; దలైన్‌ మెడికల్‌ యూనివర్సిటీ; జియాంగ్జు యూనివర్సిటీ; టియాన్‌జిన్‌ మెడికల్‌ యూనివర్సిటీ, జిలిన్‌ యూనివర్సిటీ; నాన్జింగ్‌ మెడికల్‌ యూనివర్సిటీ; సూచో యూనివర్సిటీ; సౌత్‌ఈస్ట్‌ యూనివర్సిటీ; సదరన్‌ మెడికల్‌ యూనివర్సిటీ; యాంగ్‌ఝౌ యూనివర్సిటీ తదితరాలు.  
వివరాలకు వెబ్‌సైట్‌: mbbs.cucas.edu.cn

రష్యా
రష్యా ప్రభుత్వం ఉన్నత విద్యకు రాయితీలు ఇస్తోంది. అంతేకాకుండా ఎక్కువ శాతం సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దాంతో రష్యాలో చదువుకయ్యే ఖర్చు తక్కువగా ఉంటోంది. రష్యాలో ఎండీగా పిలిచే మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి ఆరేళ్లు. ప్రవేశాలు ఆయా యూనివర్సిటీలను బట్టి జూలైలో జరుగుతాయి. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం లభిస్తుంది. అర్హత 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). కోర్సు బోధన ఇంగ్లిష్, రష్యన్‌లో కొనసాగుతుంది. ఫీజు ఏడాదికి  రూ. రెండు లక్షలు నుంచి  రూ. నాలుగున్నర లక్షల మధ్యలో ఉంటుంది. 
     
యూనివర్సిటీలు: రష్యన్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ, కర్స్క్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ, కజన్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ, ఐ.ఎం.షెనోవ్‌ మాస్కో మెడికల్‌ అకాడమీ, పీపుల్స్‌ ఫ్రెండ్‌షిప్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రష్యా మొదలైనవి.
వివరాలకు వెబ్‌సైట్‌: en.russia.edu.ru

ఉక్రెయిన్‌
ఫీజులు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయంతోపాటు నాణ్యమైన విద్యను అందుకునే అవకాశం ఉండటంతో మన విద్యార్థులు ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌లో మెడికల్‌ కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యూనివర్సిటీలకు యూరోపియన్‌ విశ్వవిద్యాలయాలతో ఉన్న అవగాహన కారణంగా ఎక్సే ్చంజ్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. కోర్సును రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలలోపు పూర్తిచేసుకునే అవకాశం ఉండటం వంటి కారణాలు సైతం ఉక్రెయిన్‌ను బెస్ట్‌ డెస్టినేషన్‌గా నిలుపుతున్నాయి. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా పిలిచే ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధి ఆరేళ్లు. వార్షిక ఫీజు రూ.2.25 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. అర్హత 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). 

యూనివర్సిటీలు: ఇవానో–ఫ్రాంకివ్‌స్క్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీ; లుగాన్స్క్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ, ఎం.గోర్కీ డొనెట్స్క్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీ; ఖార్కివ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీ తదితర.
వివరాలకు వెబ్‌సైట్‌: www.kmu.gov.ua

జర్మనీ
ప్రపంచంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది జర్మనీ. వాస్తవానికి జర్మనీలో అన్నిరకాల కోర్సులకు ఫీజులు తక్కువ. అలాగే మెడిసిన్‌ కోర్సులను కూడా తక్కువ ఫీజులతోనే పూర్తిచేసుకునే వీలుంది. జర్మనీ యూనివర్సిటీలు 5 శాతం సీట్లను విదేశీ విద్యార్థుల కోసం కేటాయిస్తుండటం ఈ దేశం ప్రత్యేకత. అయితే జర్మనీలో వైద్య కోర్సుల్లో చేరాలంటే.. టెస్ట్‌ ఫర్‌ మెడికల్‌ స్టడీస్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దాంతోపాటు జర్మన్‌ లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. జర్మనీలో మెడికల్‌ కోర్సులను జర్మన్‌ భాషలో బోధిస్తారు. మెడికల్‌ కళాశాలలను డిసీజెస్‌ రీసెర్చ్‌ సెంటర్లతో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థులకు చికిత్స పద్ధతులతోపాటు ఆయా వ్యాధులకు సంబంధించిన మూలాల గురించి తెలుసుకునే ప్రాక్టికల్‌ నైపుణ్యం లభిస్తుంది. జర్మనీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో మరో ప్రత్యేకత అండర్‌ గ్రాడ్యుయేట్‌ (ఎంబీబీఎస్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (ఎండీ) అని తేడా లేకుండా ఇంటిగ్రేటెడ్‌గా యూజీ, పీజీ కోర్సును అందించడం. ఏడేళ్ల వ్యవధిలో మొత్తం కోర్సు ఉంటోంది. అంతేకాకుండా జర్మనీలో అధిక శాతం యూనివర్సిటీలు ప్రభుత్వ పరిధిలో ఉండటం, నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ట్యూషన్‌ ఫీజులు లేకపోవడం మరో విశేషం. మెడికల్‌ కోర్సులకు ప్రవేశాలు జూలైలో ఉంటాయి. 

బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌: టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యునిచ్, లడ్‌విగ్‌ మ్యాక్స్‌ మిలన్‌ యూనివర్సిటీ–మ్యునిచ్, ఆల్బర్ట్‌–లడ్‌విగ్స్‌ యూనివర్సిటీ, హంబోల్ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బెర్లిన్, హంబర్గ్‌ యూనివర్సిటీ మొదలైనవి. 

కిర్గిజిస్థాన్‌
కిర్గిజిస్థాన్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య పొందొచ్చు. ఆరేళ్ల వ్యవధిలో ఉండే ఎండీ పేరుతో పిలిచే ఎంబీబీఎస్‌ తత్సమాన కోర్సు పూర్తిచేసేందుకు అయ్యే వ్యయం రూ.11 లక్షల నుంచి రూ. 20 లక్షలలోపే. ఏటా ఆగస్టు/సెప్టెంబర్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది.

విశ్వవిద్యాలయాలు:  ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కిర్గిజిస్థాన్, ఏషియన్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్, ఓష్‌ స్టేట్‌ యూనివర్సిటీ,  కిర్గిజ్‌ స్టేట్‌ మెడికల్‌ అకాడమీ. జల్‌–అలాబాద్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ తదితర.  

ఫిలిప్పీన్స్‌
తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తిచేయొచ్చు. ఆరేళ్ల వ్యవధిలో ఉండే అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సు ఫీజు 30 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్లు ఉంటుంది.
యూనివర్సిటీలు: అవర్‌ లేడీ ఫాతిమా యూనివర్సిటీ; ఏఎంఏ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌–మనీలా; ఎమిలో అగ్వినాల్డో కాలేజ్‌–మనీలా మొదలైనవి.
వెబ్‌సైట్‌: www.ched.gov.ph

జార్జియా
ఇక్కడ ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కచ్చితంగా యూఎస్‌ఎంఎల్‌ఈ లేదా పీఎల్‌ఏబీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఫీజు ఏడాదికి 4,500–6,500 డాలర్లు. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ మధ్యలో ప్రవేశాలు ఉంటాయి.
ప్రముఖ యూనివర్సిటీలు: జియోమెడి మెడికల్‌ యూనివర్సిటీ; టిబిల్సి మెడికల్‌ అకాడమీ; డేవిడ్‌ ట్విల్డియాని మెడికల్‌ యూనివర్సిటీ; కౌకాసస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ తదితరం.
వివరాలకు వెబ్‌సైట్‌: www.mes.gov.ge

Advertisement
Advertisement