లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఎన్నిక | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఎన్నిక

Published Thu, Jun 12 2014 5:00 AM

లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఎన్నిక - Sakshi

 జాతీయం
 లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఎన్నిక

 బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభ స్పీకర్‌గా జూన్ 6న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీరా కుమార్ తర్వాత సభాపతి స్థానాన్ని అధిష్టించిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ఈమె ఇండోర్ (మధ్యప్రదేశ్)  లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
 
 వస్త్రాల ఎగుమతిలో రెండో స్థానంలో భారత్
 జర్మనీ, ఇటలీలను అధిగమించి భారత్ వస్త్రాల ఎగుమతిలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంది. అయితే, చైనా కంటే వెనుకబడి ఉంది. అప్పెరల్ ఎక్స్‌పోర్‌‌ట ప్రమోషన్ కౌన్సిల్ (ఎఇపీసీ) జూన్ 2 విడుదల చేసిన లెక్కల ప్రకారం 2013లో భారత వస్త్రాల ఎగుమతులు 40 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. ఇటలీ ఎగుమతులు 36 బిలియన్ డాలర్లు, జర్మనీ ఎగుమతులు 35 బిలియన్ డాలర్లు. చైనా ఎగుమతులు భారత్ కంటే 274 బిలియన్ డాలర్లుగా ఎక్కువ. ఈ వస్త్రాలలో బట్టలకు వాడే దారం, కాటన్, సిల్క్, ఉన్ని, సింథటిక్‌తో చేసిన రెడీమేడ్ దుస్తులు ఉన్నాయి.
 
 భారత్-ఫ్రాన్స్ సంయుక్త వాయు విన్యాసాలు
 ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రాన్‌‌సకు చెందిన ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వాయు విన్యాసాలు జూన్ 2న జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ప్రారంభమయ్యాయి. జూన్ 13 వరకు సాగే ఈ విన్యాసాలకు ‘ఈఎక్స్ గరుడ 5 ((Ex Garuda V) అనే పేరు పెట్టారు.
 
 బ్రహ్మోస్ విజయవంతం
 యుద్ధనౌకలను తుత్తునియలు చేసే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత్ జూన్ 9న కర్ణాటకలోని కర్వార్ తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. 290 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఇది గురి తప్పకుండా ఛేదించగలదు.
 
 కేఎన్‌పీపీ రికార్డు
 తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి రికార్డు సృష్టించింది. కేఎన్‌పీపీలోని ఒకటో యూనిట్‌లో జూన్ 7న మధ్యాహ్నం నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని, దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయడం ఇదే తొలిసారి అని ప్లాంటు డెరైక్టర్ ఆర్‌ఎస్ సుందర్ వెల్లడించారు. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్నారు. కేఎన్‌పీపీ దేశంలో నిర్మించిన 21వ అణువిద్యుత్ రియాక్టర్.  తొలి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కూడా ఇదే.
 
 రాష్ట్రీయం
 తెలంగాణ శాసనసభ  స్పీకర్‌గా మధుసూదనాచారి

 తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్‌గా వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి (టీఆర్‌ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూన్ 10న ఆయన బాధ్యతలు స్వీకరించారు.
 
 నదీ బోర్డుల ఏర్పాటు

 కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ఆవిర్భావ తేదీ జూన్ 2 తర్వాత 60 రోజుల్లోగా రెండు బోర్డులను ఏర్పాటు చేయాలన్న పునర్విభజన బిల్లు సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా కేంద్ర జలసంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎ.బి. పాండ్యాను, గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా కేంద్ర జలసంఘంలోని సభ్యుడైన మహేంద్రన్‌ను కేంద్రం నియమించింది. పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డును తెలంగాణలోనూ, కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాల్సి ఉంది.
 
 ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా
 చంద్రబాబు ప్రమాణం
 ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబుతో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత 19 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
 
 అంతర్జాతీయం  బ్రస్సెల్స్‌లో జీ-7 సదస్సు
 జీ-7 సదస్సు జూన్ 4,5 తేదీల్లో బ్రస్సెల్స్‌లో జరిగింది. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునెటైడ్ కింగ్‌డమ్, అమెరికా దేశాల నాయకులతోపాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ సంక్షోభం, రష్యా ప్రతిస్పందనపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రపంచ వృద్ధి, నిరుద్యోగ సమస్యసు అధిగమించడం  వంటి అంశాలపై చర్చలు జరిపారు. భూతాప ప్రభావాన్ని తగ్గించేందుకు 2015లో జరిగే వాతావరణ మార్పుల ఒప్పందం పట్ల తమ నిబద్ధతను ప్రకటించాయి. జీ-7 సదస్సును తొలిసారి యూరోపియన్ యూనియన్ నిర్వహించింది.
 
 ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పెట్రో పోరోషెంకో
 ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పెట్రో పోరోషెంకో జూన్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. పోరోషెంకోను పశ్చిమ దేశాలు సమర్థిస్తున్నాయి. ఈయన మే 25న దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
 
 సిరియా అధ్యక్ష ఎన్నికల్లో అసద్ విజయం
 సిరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. జూన్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అసద్‌కు 10 మిలియన్ల (88.7శాతం) ఓట్లు దక్కాయి. దీంతో అధికార బాత్ పార్టీ మరో ఏడేళ్లు అధికారంలో ఉంటుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 15.8 మిలియన్ల ఓటర్లకు గాను 11.6 మిలియన్ల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.
 
 ఐక్యరాజ్య సమితి ఐసీహెచ్ కమిటీకి భారత్ ఎన్నిక
 స్పృశించరాని వారసత్వ సంపద (ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ - ఐసీహెచ్)ను పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి అంతర్ ప్రభుత్వ కమిటీకి భారత్ తిరిగి ఎన్నికైంది. జూన్ 4న జరిగిన ఓటింగ్‌లో 142 దేశాల్లో భారత్‌కు 135 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఐసీహెచ్ కమిటీలో 24 మంది సభ్యులు ఉంటారు. నాలుగేళ్లపాటు సభ్యులుగా కొనసాగుతారు. ఆచారాలు, అలవాట్లు, వ్యక్తీకరణలు, జ్ఞానం, నైపుణ్యం వంటివి అంటే పాటలు, సంగీతం, పండుగలు, హస్తకళానైపుణ్యం మొదలైన వాటిని స్పృశించరాని వారసత్వ సంపదగా పేర్కొంటారు.
 
 ఈజిప్టు అధ్యక్షునిగా అబ్దెల్ ఫత్తా
 ఈజిప్టు మాజీ సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్- సిసీ దేశాధ్యక్షునిగా జూన్ 8న బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్ల పాటు ఆయన అధ్యక్షునిగా కొనసాగుతారు. అధ్యక్షపదవికి గతవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 96.6 శాతం ఓట్లు వచ్చాయి. 59 ఏళ్ల అబ్దెల్ ఫత్తా ఈజిప్టుకు 7వ అధ్యక్షుడు. ప్రజాస్వామిక పద్ధతిలో తొలిసారి ఎన్నికైన మహమ్మద్ మోర్సీని ఆయన గత ఏడాది పదవీచ్యుతుడిని చేశారు.
 
 పాలస్తీనా యూనిటీ ప్రభుత్వం ఏర్పాటు
 రెండు పాలస్తీనా వర్గాలైన ఫతా, హమాస్‌ల మధ్య ఏడేళ్ల విభేదాలకు స్వస్తి పలుకుతూ పాలస్తీనా యూనిటీ ప్రభుత్వం జూన్ 2న రొమల్లాలో ప్రమాణ స్వీకారం చేసింది. ప్రధానమంత్రిగా రామి హమ్‌దల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్‌లో కుదిరిన శాంతి ఒప్పందం యూనిటీ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడింది. పాలస్తీనా వ్యవహారాల్లో రాజకీయ, భౌగోళిక విభజనను కొత్త యూనిటీ ప్రభుత్వం రూపుమాపుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పాలస్తీనా ఎన్నికలు 2015లో నిర్వహించేందుకు తోడ్పడుతుంది. కొత్త ప్రభుత్వం 2007 తర్వాత తొలిసారిగా గాజా, వెస్ట్ బ్యాంక్‌లను ఒకే రాజకీయ ఆధిపత్యం కిందికి తీసుకొస్తుంది. 2006లో జరిగిన పాలస్తీనా చట్టసభ ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది. అప్పటి నుంచి వెస్ట్‌బ్యాంక్ అధ్యక్షుడు మొహ్మద్ అబ్బాస్, ఫతా పాలన కింద ఉంది. గాజా ప్రాంతం ఉగ్రవాద గ్రూపుగా భావిస్తున్న హమాస్ పాలనలో ఉంది.
 
 30 శాతం కర్బన ఉద్గారాలను తగ్గించనున్న అమెరికా

 అమెరికా తన విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించాలని జూన్ 2న ప్రతిపాదించింది. 2005 స్థాయి నుంచి 2030 నాటికి జాతీయ సరాసరిలో 30 శాతం కర్బన ఉద్గారాలను తగ్గించాలని భావిస్తోంది. అమెరికాలో వెలువడే కార్బన్ డైఆక్సైడ్‌లో 40 శాతం విద్యుత్ కేంద్రాల నుంచే వెలువడుతుంది. ఈ వాయువు వాతావరణ మార్పునకు ప్రధాన కారణం. ఈ తగ్గింపు వల్ల పిల్లల్లో 6,600 ముందస్తు మరణాలను, 150,000 ఆస్తమా జబ్బులను నివారించవచ్చని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.
 
  క్రీడలు కెనడా గ్రాండ్‌ప్రి విజేత
 రికియార్డో
 కెనడా గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ డానియెల్ రికియార్డో విజేతగా నిలిచాడు. నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 
 ఫ్రెంచ్ ఓపెన్-2014 విజేతలు
 మహిళల సింగిల్స్: ఈ విభాగంలో మరియా షరపోవా(రష్యా) విజేతగా నిలిచింది. జూన్ 7న జరిగిన ఫైనల్లో సిమోనా హలెప్ (రుమేనియా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్: రాఫెల్ నాదల్ (స్పెయిన్) విజేతగా నిలిచాడు. జూన్ 8న జరిగిన ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పై విజం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాదల్ గెలవడం ఇది 9వ సారి కాగా... వరుసగా ఐదో సారి (2010-2014) కావడం విశేషం. ఈ టైటిల్‌తో అతను అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ (అమెరికా)సరసన నాదల్ ఉన్నాడు. 17 టైటిల్స్‌తో ఈ జాబితాలో ఫెదరర్ (స్విట్జర్లాండ్) అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళల డబుల్స్ విజేతలు: సువీ హసిహ్ (తైపీ), పెంగ్ షూయ్ (చైనా) జంట; పురుషుల డబుల్స్ విజేతలు: మార్షల్ గ్రనొల్లెర్స్, మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట; మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు: అన్నా లీనా గ్రొనెఫెల్డ్ (జర్మనీ), జీన్ జులియెన్ రోజెర్ (నెదర్లాండ్స్) జంట.
 
 వార్తల్లో వ్యక్తులు
 ఐరిష్ రచయిత్రి మాక్‌బ్రైడ్‌కు
 బెయ్‌లీస్ ఉమెన్‌‌స ప్రైజ్

 2014 బెయ్‌లీస్ ఉమెన్‌‌స ప్రైజ్ (కాల్పనిక రచన) ఐరిష్ రచయిత్రి ఇమీర్ మాక్‌బ్రైడ్‌కు లభించింది. ఈ బహుమతిని జూన్ 5న లండన్‌లో ప్రదానం చేశారు. ఆమె రాసిన ‘ఎ గర్‌‌ల ఈజ్ ఎ హాఫ్ ఫార్మడ్ థింగ్’ నవలకు ఈ బహుమతి దక్కింది. భారత సంతతికి చెందిన అమెరికన్ రచయిత్రి జుంపా లహరి ‘ది లో ల్యాండ్’ రచనతో ఈ నవల పోటీ పడింది. ఈ బహుమతిని ప్రతి సంవత్సరం మహిళా రచయితలు రాసిన కాల్పనిక రచనలకు ప్రదానం చేస్తారు. బహుమతి కింద 30,000 పౌండ్లు అందజేస్తారు. గతంలో ఈ బహుమతిని ఆరంజ్ ప్రైజ్‌గా పిలిచేవారు.
     
 ఐరాస మండేలా పురస్కారం
 జాతివివక్ష వ్యతిరేక పోరాటయోధుడు, నల్ల సూరీడు నెల్సన్‌మండేలా గౌరవార్థం ఐక్యరాజ్యసమితి ఆయన పేరుతో ఒక అవార్డును నెలకొల్పింది. జూన్ 7న జరిగిన సర్వసభ్య సభ సమావేశం ‘ఐక్యరాజ్యసమితి నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా పురస్కారా’న్ని నెలకొల్పుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. మండేలా అందించిన జ్యోతిని ముందుకు తీసుకెళ్లటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ సర్వసభ్య సభ సమావేశంలో పేర్కొన్నారు.
 
 ఐరాస నిపుణుల బృందంలో
 భారతీయుడికి చోటు
 ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ నిపుణుల బృంద ంలో భారత్‌కు చెందిన విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ గుహా నియమితులయ్యారు. ఈ బృందంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. ఐక్యరాజ్యసమితి చేపట్టే శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో ఉపయోగించాల్సిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అంశాలపై ఈ బృందం సలహాలు, సూచనలు ఇస్తుంది.
 
 కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతి
 కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే (64) న్యూఢిల్లీలో జూన్ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముండే మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు. ఆ రాష్ట్రంలోని బీడ్ పార్లమెంట్ సభ్యుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మే 26న తొలిసారి కేంద్రమంత్రిగా చేరారు. 1995-99లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముండే పూర్తిపేరు గోపీనాథ్ పాండురంగ్ ముండే. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బీడ్ జిల్లా నత్రాలో జన్మించారు.
 
 నూతన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్
 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను నూతన సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ)గా ప్రభుత్వం నియమించింది. రంజిత్‌కుమార్‌ను ఎస్‌జీగా నియమిస్తూ జూన్ 7న న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు మనిందర్ సింగ్, తుషార్ మెహతా, ఎల్ నాగేశ్వరరావు, పీఎస్ పత్వాలియా, నీరజ్ కిషన్ కౌల్, పీఎస్ నరసింహలను అదనపు సొలిసిటర్ జనరల్ పదవుల్లో నియమించింది.
 

Advertisement
Advertisement