టానింగ్‌కు ఉపయోగపడేది ఏది? | Sakshi
Sakshi News home page

టానింగ్‌కు ఉపయోగపడేది ఏది?

Published Tue, Jan 31 2017 1:35 AM

టానింగ్‌కు ఉపయోగపడేది ఏది?

మాదిరి ప్రశ్నలు
1. పారమీషియం, అమీబా వంటి ఏక కణ జీవుల్లో విసర్జక విధానాన్ని తెలపండి.
2. టానిన్, రెజిన్ల గురించి వర్ణించండి.
3. మన శరీరంలో సమతుల్యత ఎలా సాధ్యమవుతుందో వివరించండి.
4.ఎక్కువ నీరు తాగినప్పుడు వాసోప్రెస్సిన్‌ ఎందుకు ఉత్పత్తి కాదో పేర్కొనండి.    (1 మార్కు)
జ.శరీరంలో నీరు తగ్గినప్పుడు వాసోప్రెస్సిన్‌ ఉత్పత్తి అయి నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువల్ల మూత్రం గాఢత చెందుతుంది. నీరు అధికంగా తాగినప్పుడు శరీరానికి సరిపడినంత నీరు ఉండటం వల్ల వాసోప్రెస్సిన్‌ ఉత్పత్తి కాదు.
5.మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం?         (1 మార్కు)
జ.యూరోక్రోం అనే వర్ణకం వల్ల మూత్రం పసుపు రంగులో ఉంటుంది.

ప్రశ్నించడం, పరికల్పన (2 మార్కులు)

6.మూత్రపిండాల్లో నీటి పునఃశోషణ జరగకపోతే ఏమవుతుంది?
జ.నీటి పునఃశోషణ జరగకపోతే మూత్రం ద్వారా అధిక నీరు విసర్జితమవుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో జీవనం కష్టమవుతుంది. జీవులు నీటి నష్టాన్ని తగ్గించడానికి నీటి పునఃశోషణ చేస్తాయి.
7.అవయవదానం గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్‌ను కలిసే అవకాశం వస్తే ఏ ప్రశ్నలు అడుగుతావు?
జ.) అవయవదానం ఎవరు చేయొచ్చు?
2) బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తులు ఏ అవయవాలను దానం చేయొచ్చు?
3) అవయవదానం కోసం ఎవరిని సంప్రదించాలి?
4) పాము కాటు, విష ప్రయోగాల వల్ల చనిపోయిన వ్యక్తుల అవయవాలు దానం చేయొచ్చా?
5) జీవించి ఉన్న వ్యక్తులు ఏ అవయవాలను దానం చేయొచ్చు?

మాదిరి ప్రశ్నలు

1.మూత్రపిండాల అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్టును ఏయే ప్రశ్నలు అడుగుతావు?
      ప్రయోగాలు– క్షేత్ర పరిశీలనలు
1.మూత్రపిండ బాహ్య, అంతర లక్షణాలను పరిశీలించడానికి వాటి నిలువు కోత విధానం, పరిశీలనలు రాయండి.
జ.ఉద్దేశం: మూత్రపిండం బాహ్య, అంతర లక్షణాలను పరిశీలించడం
పరికరాలు: మేక/గొర్రె మూత్రపిండం, పదునైన బ్లేడు, ట్రే, నీరు, ఫోర్‌సెప్స్‌.
ప్రయోగ విధానం: మేక/గొర్రె మూత్రపిండాన్ని సేకరించి నీటితో శుభ్రంగా కడగాలి. ట్రేలో పెట్టి బాహ్య లక్షణాలను పరిశీలించి నోట్‌బుక్‌లో నమోదు చేయాలి. పదునైన బ్లేడుతో మూత్రపిండాన్ని నిలువుగా కోసి అంతర్నిర్మాణాన్ని పరిశీలించాలి.
పరిశీలనలు: 1. బాహ్య లక్షణాలు: మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. నొక్కు భాగంలో మూడు నాళాలు బయటకు వస్తాయి. దాని పైభాగంలో టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది.
2. అంతర లక్షణాలు: వెలుపల ముదురు గోధుమ వర్ణంలో వల్కలం, లోపల లేత వర్ణంలో దవ్వ ఉంటాయి.
సమాచార సేకరణ నైపుణ్యాలు (4 మార్కులు)

కింది సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1.మందుల తయారీకి ఉపయోగపడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవి?
జ.టానిన్లు, జిగుర్లను మందుల తయారీలో ఉపయోగిస్తారు.
2.పాము కాటు నుంచి రక్షణ పొందేందుకు వాడే రిసర్పిన్‌ను ఏ మొక్క నుంచి, అందులోని ఏ భాగం నుంచి సేకరిస్తారు?
జ.రిసర్పిన్‌ను సర్పగంధి మొక్కలోని వేరు నుంచి సేకరిస్తారు.
3.టానింగ్‌కు ఉపయోగపడేది ఏది?
జ.తోళ్లను పదునుపెట్టడాన్ని టానింగ్‌ అంటారు. దీనికి ఉపయోగపడేది టానిన్లు.
4.ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జ.మొక్కల సాధారణ పెరుగుదల, అభివృద్ధి మినహా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు.
ఉదా‘‘ టానిన్, రెసిన్, జిగుర్లు, లేటెక్స్, ఆల్కలాయిడ్లు.

Advertisement

తప్పక చదవండి

Advertisement