బూడిద రాశులు..బండరాళ్ల సమాధులు.. | Sakshi
Sakshi News home page

బూడిద రాశులు..బండరాళ్ల సమాధులు..

Published Thu, Dec 25 2014 3:11 AM

బూడిద రాశులు..బండరాళ్ల సమాధులు..

మానవుడు భూమిపై తిరగడం మొదలుపెట్టి దాదాపు ఐదు లక్షల సంవత్సరాలైంది. అప్పట్లో ఆది మానవుడు చెట్లపైన, రాతిగుహల్లోనూ నివసించేవాడు. ప్రకృతిలో లభించిన కాయాకసరూ.. వేరూదుంపా తినేవాడు. లేదంటే జంతువులను వేటాడి వాటి మాంసం తినేవాడు. తలదాచుకునేందుకు ఇళ్లు, కట్టుకునేందుకు బట్టలు లేవు. వ్యవసాయం అంటే ఏమిటో తెలీదు.
 
 ఆధునిక మానవుడి వరకు
 నాటి నుంచి నేటి వరకు గడచిన ఇన్నేళ్లలో ఆది మానవుడు ఎన్నో ఆపదలను ఎదుర్కొన్నాడు. భయంకరమైన ప్రకృతి ప్రళయాలను చవిచూశాడు. అయినా రోజురోజుకూ శారీరకంగా, మానసికంగా ఎదుగుతూ రాయీరప్పను మలచి అనేక ఆయుధాలను తయారు చేసుకున్నాడు. ప్రకృతితో, జంతువులతో పోరాడి చివరకు విజేతగా నిలిచాడు. అప్పటి ఆది మానవుడు నేటి ఆధునిక మానవుడయ్యాడు. మానవ జాతి పరిణామక్రమాన్ని ఒక గంట వ్యవధిగల సినిమా తీస్తే అందులో 59 నిమిషాలు మనిషి ఆదిమ దశ నుంచి పైకి ఎగబాకడానికి సంబంధించిన పరిణామాలకే సరిపోతుంది. మిగిలిన నాగరిక జీవితం అంతా ఒక నిమిషంలో గడచిపోతుంది.
 
 తెలంగాణ-మానవుడి ఆనవాళ్లు
 ఆది మానవుడి ఆనవాళ్లు కలిగిన అతి ప్రాచీన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఆది మానవుడి ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తాయి. ఒకప్పటి తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. దక్కన్ పీఠభూమిలోని తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన, వేటాడటానికి సంబంధించి గీసిన చిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. వీటి గురించి విశ్లేషించుకోవడం అంటే మన గతాన్ని తవ్వుకోవడమే! మన పూర్వీకులను మనం వెదుక్కోవడమే.
 
 దశలవారీగా..
 మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని గమనిస్తే తొలి మానవుడి కదలికలు మూడు దశలుగా కనిపిస్తున్నాయి.పాత రాతియుగంలో నివసించిన మానవుడిని మెగాలిత్ మానవుడని అంటారు. ఈ మానవుడు రాతపూర్వకంగా మనకు మిగిల్చిన ఆనవాళ్లేమీ లేవు. కానీ ఆ కాలపు ఆయుధాలు, ఎముకలు, ఆభరణాలు, బొమ్మలు, చిత్రాలు (గుహల్లో గీచినవి) మాత్రం అప్పటి ఆది మానవుడి జీవనానికి సాక్షీభూతాలుగా నేటికీ నిలిచి ఉన్నాయి. వీటన్నింటినీ వెలికితీసి మనకు అందించిన ఆంగ్లేయుడు, చరిత్ర పూర్వయుగ పితామహుడు(Father of Pre Historical Period in India) రాబర్ట్ బ్రూస్‌ఫూట్. ఈ కాలంలో మనిషి ఉపయోగించిన పనిముట్లను మెగాలిత్స్ అంటారు. ఇవి మొరటుగా ఉండే పెద్ద బండరాళ్లు. పెద్దపులిని చంపాలన్నా, చెట్టును కొట్టాలన్నా, నేలను తవ్వాలన్నా.. ఇలా అన్ని పనులకూ ఆ ‘రాయే’ ఆధారం.  పాతరాతి యుగపు చివర్లో మానవులు తమ భుజ బలం సహాయంతో జంతువులను వేటాడేందుకు విల్లు-అంబులు ఉపయోగించారు. దీనికి సంబంధించి గార్డెన్ చైల్డ్ తన గ్రంథమైన  Man makes Himselfలో.. ‘‘మనిషి కనుక్కొన్న మొట్టమొదటి యంత్రం విల్లే’’ అని పేర్కొన్నారు.
 
 పాత రాతియుగపు ప్రదేశాలు
 తెలంగాణ ప్రాంతంలో పాత రాతియుగపు ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి 40 మైళ్ల దూరంలో ఆది మానవుడికి చెందిన 35 రకాల పనిముట్లు 50 గజాల మేర తవ్వకాల్లో దొరికాయి. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఏకంగా ఈ 50 గజాల ప్రదేశాన్ని ‘పాత రాతియుగపు పనిముట్ల పరిశ్రమ’గా అభివర్ణించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ పాత రాతియుగపు మానవుడికి చెందిన ఆధారాలు లభించాయి. హైదరాబాద్‌కు 50 కి.మీ. దూరంలో ఉన్న రాచకొండ గుట్టల్లో ఆది మానవుడి కళా జీవనం కనిపిస్తుంది. ఇక్కడి గుహల్లో వేల ఏళ్ల కిందట ఆది మానవులు గీసిన ఎరుపు రంగు వర్ణ చిత్రాలు, రేఖాచిత్రాలు అబ్బురపరుస్తాయి. ఆరుగురు వ్యక్తులు తమ వద్ద ఉన్న బాణాలతో పులిని వేటాడుతున్నట్లు చిత్రకారుడు గీశాడు. తెలంగాణలో ఆది మానవుడి చిత్రకళకు ఇది నిదర్శనం.
 
 మధ్య రాతియుగం- మైక్రోలిత్స్
 మధ్య రాతియుగం అంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది నిప్పు. ఈ నిప్పును మధ్య రాతియుగంలోనే కనుగొన్నారు. ఈ యుగంలోనే జంతువులను కూడా మచ్చిక చేసుకున్నారు. నిప్పు ఆవిష్కరణకు, జంతువుల మచ్చికకు దగ్గర సంబంధాలున్నాయి. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం కలిగిస్తుందని, తన వద్ద నిప్పు నెగడులు ఉంటే అటవీ జంతువులు భయపడతాయని ఆది మానవుడు తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని గ్రహించాడు. నిప్పుల్లో మాంసం, దుంపలు కాల్చుకొని తినడం ప్రారంభించాడు.
 
 నిప్పు పుట్టుకకు సాక్ష్యం
 దేశం మొత్తంమీద నిప్పును కనుగొన్న ఆనవాళ్లు మొట్టమొదటగా రాబర్ట్ బ్రూస్‌ఫూట్ తెలంగాణ ప్రాంతంలోనే కనుగొన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉట్నూరులో నిప్పును మండించిన తర్వాత మిగిలిన బూడిద రాశులు అనేకం తవ్వకాల్లో దొరికాయి. కర్రలను లేదంటే రాళ్లను రాపాడించి నిప్పును కనుగొన్నది తెలంగాణలోని తొలి మానవుడే కావడం విశేషం. రాబర్ట్ బ్రూస్‌ఫూట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉట్నూరులోని బూడిద రాశులు (అటజి కౌఠఛీట) మొదట పేడ పోగులు. వేసవిలో అవి అంటుకుంటూ, రాపిడికి గురై బూడిద రాశులుగా మిగిలాయి. వీటికి బ్రిటిష్ మ్యూజియం అధికారులు రసాయన పరీక్షలు కూడా నిర్వహించారు.
 
 బూడిద రాశులు ఎలా ఏర్పడ్డాయి?
 తెలంగాణలో బయటపడిన బూడిద రాశులపై పరిశోధన చేసిన మరో బ్రిటిష్ శాస్త్రవేత్త ఎఫ్.ఆర్.ఆల్చిన్. ఆయన అభిప్రాయం ప్రకారం బూడిద రాశులు అనేక అంచెలుగా ఉన్నాయి. అవి ఉన్న ప్రదేశాల్లో మొదట్లో పశువులను కట్టి ఉంచారు. వాటి పేడను ఒక చోట పెంటపోగుగా వేశారు. ఆది మానవులు ఆ ప్రదేశం నుంచి వెళ్లేటప్పుడు పేడపోగులను తగలబెట్టేవారు. ఇలా ఏర్పడిన బూడిద రాశులే తవ్వకాల్లో బయటపడ్డాయి.

  ఆది మానవుడు పేడదిబ్బలను కాల్చడం, తర్వాత ఆ ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్లడం వంటి పరిణామాలను పరిశీలిస్తే రుతువులు మారినప్పుడు పశువులతో సహా మనుషులు మరో చోటుకు తరలివేళ్లేవారని తెలుస్తోంది. పశువుల మందలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు ఉత్సవాలు, కర్మకాండలు నిర్వహించేవారు. ఈ అలవాటు శతాబ్దాలు గడిచినా నేటికీ సంప్రదాయంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇప్పటికీ పశువులను గౌరవిస్తూ, ఆరాధిస్తూ ‘సదర్’ అనే ఉత్సవాన్ని జరుపుకోవడం దీనికి నిదర్శనం.
 
 ఉట్నూరులో బయటపడిన బూడిదరాశుల ద్వారా రెండు విషయాలను తెలుసుకోవచ్చు. అవి 1. మానవుడు నిప్పును కనుగొనడం. 2. పశువులను మచ్చిక చేసుకొని, వాటిపై ఆధారపడి జీవించడం. మరొక ఉదాహరణ ఏమిటంటే.. నేటికీ తెలంగాణ ప్రాంతంలో పంట మార్పి డి జరిగిన తర్వాత పొలంలో మిగిలిన దుబ్బులను తగలబెడతారు. అవి నల్లటి బూడిదలా మారతాయి. భారతదేశానికి నిప్పు ద్వారా వెలుగు నింపిన కొద్ది ప్రాంతాల్లో మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు ఉండటం గొప్ప ఉద్వేగాన్ని కలిగిస్తోంది. మధ్య రాతియుగంలో మానవుడు చిన్నచిన్న రాతి పరికరాలు (పెచ్చులు- రాతి బ్లేడులు) ఉపయోగించాడు. వీటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తేలిగ్గా తీసుకెళ్లేవాడు.
 
 నవీన శిలాయుగం
 తెలంగాణ ప్రాంతంలో నవీన శిలాయుగానికి చెందిన చాలా ప్రదేశాలు కనిపిస్తాయి. వీటిలో మౌలాలి, హఫీజ్‌పేట ముఖ్యమైనవి. ఈ ప్రాంతాల్లో అప్పట్లో ఉపయోగించిన రాతి పనిముట్లు, మంటల్లో కాల్చిన మట్టిపాత్రలు-వాటిపై వేసిన డిజైన్లలను చూడొచ్చు. మౌలాలి, భువనగిరిమెట్టల్లో నవీన శిలాయుగపు చిన్నెలు (ఎత్తయిన, సన్నని దిమ్మెలు) బయటపడ్డాయి. ప్రమాదాల సమయంలో ఆది మానవుడు వీటిపైకి ఎక్కి తలదాచుకునేవాడు. ఇలాంటి చిన్నెలు ఇంకా గోల్కొండ కోట, దౌలతాబాద్ కోటల్లో కూడా కనిపిస్తాయి. ఖమ్మం జిల్లాలో ఐదు చోట్ల, భువనగిరిలో రెండు చోట్ల నవీన శిలాయుగపు వస్తువులు లభించాయి. భువనగిరి ప్రాంతంలో ఏకంగా నవీన శిలాయుగపు గ్రామమే తవ్వకాల్లో బయటపడింది.
 
 తెలంగాణలో లోహయుగం (మెటల్ ఏజ్)
 తొలి మానవుడు మొదట వాడిన లోహం రాగి (కాపర్). ఈ రాగి కాలానికి చెందిన ఒక కత్తి ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దొరికింది. దేశం మొత్తంమీద ఈ ప్రాంతంలో మాత్రమే రాగి కత్తి లభించింది.
 
 బృహత్ శిలాయుగం
 పాత రాతియుగపు మానవుడు పెద్దపెద్ద రాళ్లను ఉపయోగించి, జీవనం సాగించేవాడన్నది తెలిసిందే. నవీన శిలాయుగం చివర్లో బృహత్ శిలాయుగాన్ని తెలంగాణ ప్రాంతంలో మనం చూడొచ్చు. అతిపెద్ద వలయాకారపు బండరాళ్లను చనిపోయిన వారి సమాధులపై ఉంచేవారు. చనిపోయిన మనిషిని రాతిపెట్టె బండల మధ్య ఉంచేవారు. ఈ రాతి పెట్టెలో మనిషి ఉపయోగించిన ఎరుపు-నలుపు చిత్రాలు, చాకులు, బల్లేలు, ఆభరణాలు ఉంచి పైన మరో రాతి పలకతో మూసేవారు. పక్కన పేర్చిన రాతి పలకల్లో ఒక దానికి రంధ్రం చేశారు. ఇలా ఉంచడానికి కారణం.. బహుశా అతని ఆత్మ స్వేచ్ఛగా బయట తిరిగి, మళ్లీ లోపలికి వచ్చి శరీరంలో ప్రవేశిస్తుందనే నమ్మకం కావచ్చు. ఈ పెట్టె వంటి నాలుగు పలకల రాతి బండను సిస్ట్ (జీట్ట) అంటారు. ఈ రాతి పేటికపై ఒక పెద్ద వలయాకారపు బండరాయిని పెడతారు. వీటినే రాక్షసగుళ్లు లేదా పాండవ గుళ్లు అని అంటారు. కొన్ని రాతి సమాధులపై మూడు టన్నుల బరువైన రాళ్లను కూడా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి పనులు చేసేందుకు అవసరమైన దేహ దారుఢ్యం అప్పటి మనుషుల సొంతం!
 
 బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు
 దక్షిణ భారతదేశం మొత్తంమీద బృహత్ శిలాయుగపు వలయాకారపు బండరాళ్లు ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా కొండలు, గుట్టల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి.మెడోస్ టైలర్ అనే శాస్త్రవేత్త నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద పదుల సంఖ్యలో రాక్షసగుళ్లను కనుగొన్నాడు. నిజామాబాద్ తూర్పు కొన నుంచి తెలంగాణ అంతటా ఈ తరహా రాక్షసగుళ్లు కనిపిస్తాయి.మధిర, చింతగాని, డోర్నకల్, మానుకోట, రాయగిరి, మౌలాలి, బాలానగర్, బేగంపేట, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, కరీంనగర్‌లోని ధూళికట్టల్లో వలయాకారపు పెద్దపెద్ద బండరాళ్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటిని రాక్షసగుళ్లుగా చెప్పొచ్చు. వీటికింద తొలి మానవుడు వాడిన వస్తువులతో పాటు, అస్తిపంజరం కచ్చితంగా నిక్షిప్తమై ఉంటుంది.

 

Advertisement
Advertisement