ఉన్నత విద్య ప్రక్షాళనకు..హీరా! | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య ప్రక్షాళనకు..హీరా!

Published Mon, Aug 7 2017 2:47 AM

ఉన్నత విద్య ప్రక్షాళనకు..హీరా!

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ).. ఇక కనుమరుగు కానుందా? ఏఐసీటీఈ.. అనే మాట భవిష్యత్తులో వినపడదా..? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం.. Higher Education Empowerment Regulation Agency (HEERA-హీరా) పేరుతో దేశంలోని రెండు ప్రధాన విద్యా నియంత్రణ సంస్థల (యూజీసీ, ఏఐసీటీఈ) స్థానంలో ఒకే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ యోచనే. నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు ఉమ్మడి నియంత్రణ వ్యవస్థ రూపకల్పన దిశగా అడుగులు పడుతున్న తరుణంలో.. ‘హీరా’పై విశ్లేషణ..

శంలో ఉన్నతవిద్య పరంగా పలు రకాల నియంత్రణ వ్యవస్థలు.. ఒక్కోదాని పరిధిలో ఒక్కో కోర్సు. ఇదే క్రమంలో యూజీసీ.. ఏఐసీటీఈ. మిగతా నియంత్రణ వ్యవస్థలు (ఎంసీఐ, పీసీఐ, బీసీఐ తదితర) పరంగా... ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. యూజీసీ, ఏఐసీటీఈల మధ్య నిరంతరం ఏదో ఒక సమస్య. దీనికి పరిష్కారంగా నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వ్యవస్థే ‘హీరా’.

ఒకే గొడుగు కిందకు అన్ని సంస్థలు
హీరా ప్రధాన ఉద్దేశం.. దేశంలోని సాంకేతిక, సంప్రదాయ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు అన్నీ.. ఇకపై ఒకే నియంత్రణ వ్యవస్థకు జవాబుదారీగా ఉండటం. అదే విధంగా యూనివర్సిటీలకు అనుమతుల నుంచి ప్రమాణాలు, నైపుణ్యాల పెంపు వరకు ప్రతి అంశాన్ని హీరా పేరిట ఏర్పడనున్న కమిటీ పర్యవేక్షిస్తుంది. ఫలితంగా ఇప్పుడు ఒకే యూనివర్సిటీలో అమలవుతున్న పలు కోర్సులకు ఇటు ఏఐసీటీఈ, అటు యూజీసీ అనుమతులు తీసుకోవడమనే భారం తొలగనుంది. ఉదాహరణకు ఒక యూనివర్సిటీ పరిధిలో ఒక టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాలనుకుంటే ముందుగా ఇటు ఏఐసీటీఈకి, మరోవైపు సంబంధిత యూనివర్సిటీకి రెండింటికీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వివిధ సందర్భాల్లో గందరగోళం నెలకొంటోంది. ఈ క్రమంలోనే యూజీసీ, ఏఐసీటీఈ మధ్య కొంత ఆధిపత్య పోరు జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందుకు.. అన్ని యూనివర్సిటీలు, కోర్సులను ఒకే నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేవిధంగా హీరాకు అంకురార్పణ జరిగింది.

ఒకే వ్యవస్థపై ఎన్నో ఏళ్లుగా..
వాస్తవానికి దేశంలో అన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు యూజీసీ, ఏఐసీటీఈల స్థానంలో ఒకే నియంత్రణ వ్యవస్థను నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్నాయి. గతంలో యశ్‌పాల్‌ కమిటీ, నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రస్తుతం తాజాగా హరిగౌతమ్‌ కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో నీతి ఆయోగ్‌ ఆ సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతలను తీసుకొని.. పలు సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయానికి వచ్చి ‘హీరా’ పేరుతో ఒకే నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

వ్యవస్థల వైఫల్యాలు కూడా కారణం
హీరా పేరుతో ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకురావడంలో ఇప్పటికే ఉన్న నియంత్రణ వ్యవస్థలు యూజీసీ, ఏఐసీటీఈలు బాధ్యతలు నిర్వర్తించడంలో వైఫల్యం చెందడం కూడా మరో ముఖ్య కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు.. యూనివర్సిటీలు, కళాశాలలకు అనుమతులిచ్చేందుకే పరిమితమవుతున్నాయని.. ఆ తర్వాత వాటిపై కన్నెత్తి కూడా చూడటం లేదని, నిరంతర పర్యవేక్షణ సాగించడం లేదని, ఫలితంగా  విద్యార్థులు నిపుణులుగా రూపొందలేకపోతున్నారనే వాదనలు కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు సాంకేతిక సంస్థల ఏర్పాటు, అనుమతులు, ఇతర పర్యవేక్షణాధికారాలున్న ఏఐసీటీఈనే పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్‌ కోర్సులు పూర్తిచేస్తున్న విద్యార్థుల్లో దాదాపు 70 శాతం మందిలో ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు ఉండట్లేదు. దీనికి ప్రధాన కారణం అనుమతుల జారీకే పరిమితమవుతున్న ఏఐసీటీఈ, తర్వాత కాలంలో వాటిపై నిరంతర పర్యవేక్షణ సాగించకపోవడమే అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

యూజీసీది కూడా ఇదే తీరు
యూజీసీ.. తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వరకే పరిమితమవుతూ ఆపై వాటిపై నిరంతర పర్యవేక్షణలో వైఫ్యలం చెందిందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా ఆయా యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల లేమి, ఇతర సమస్యల కారణంగా పరిశోధనలు జరగకపోవడం, పర్యవసానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యూనివర్సిటీలు ఆశించిన రీతిలో నిధులు పొందలేకపోతున్నాయని.. ఫలితంగా కొన్ని  మూతపడే స్థితికి చేరుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలకు అనుమతులిస్తున్న యూజీసీ.. వాటి ఏర్పాటు తర్వాత కన్నెత్తి చూడకపోవడం, ఫలితంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే ఈ యూనివర్సిటీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.

ప్రొఫెషనల్‌ విద్యార్థులకు మేలు
హీరా పేరుతో విద్యాసంస్థలపై ఒకే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రధానంగా ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు మేలు చేయనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్ని రంగాలకు చెందిన నిపుణులు ఉండే హీరాలో.. ఆయా కోర్సులకు సంబంధించి తీసుకోవాల్సిన ప్రమాణాలు, చేపట్టాల్సిన తాజా చర్యలపై నిరంతరం సమీక్షించే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఏఐసీటీఈ, యూజీసీలు వైఫల్యం చెందడానికి మరో కారణం.. ఈ రెండు సంస్థల్లోనూ పలు నేపథ్యాలున్న వారు సభ్యులుగా ఉండటం, వారిలో కొందరికి అకడమిక్‌ సంబంధిత అంశాలపై అవగాహన లేకపోవడమేనని హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పేర్కొన్నారు. యూజీసీ ఏదైనా చర్యను తీసుకోవాలంటే దానికి సంబంధించిన అకడమిక్‌ ఫ్యాకల్టీ సభ్యులుగా సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసి, వాటి నివేదికలు – సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకుంటారు. దీనివల్ల అనవసర జాప్యం తలెత్తుతోంది. హీరాతో ఆ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

న్యాక్, ఎన్‌బీఏలు.. నామమాత్రమే
యూజీసీ, ఏఐసీటీఈ.. తమ పరిధిలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో అనుసరిస్తున్న ప్రమాణాలు, చేపట్టాల్సిన సంస్కరణలపై సిఫార్సులు చేసేందుకు న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కమిటీ), ఎన్‌బీఏ (నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌)లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ.. వాటి పనితీరు నామమాత్రంగా మిగిలిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు కమిటీలు.. ఆయా కళాశాలలకు తనిఖీలకు నిపుణులను పంపే క్రమంలో శాశ్వత ప్రాతిపదికన సంబంధిత అకడమీషియన్స్‌ లేకపోవడం. ఈ కారణంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన విద్యావేత్తలను ఇన్‌స్పెక్షన్‌ కమిటీల్లో తాత్కాలికంగా నియమించడం, వాటి ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇన్‌స్టిట్యూట్‌లలో జవాబుదారీతనం తగ్గుతోంది.

ఈ ఏడాది చివరికి ప్రారంభం?
ఇప్పటికే హీరాకు సంబంధించిన విధివిధానాలతో నివేదిక రూపొందిన నేపథ్యంలో ఈ ఏడాది చివరికి ప్రారంభించేలా ఎంహెచ్‌ఆర్‌డీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018–19 విద్యా సంవత్సరానికి కొత్త ఇన్‌స్టిట్యూట్‌ల అనుమతుల మంజూరు కూడా హీరా నేతృత్వంలోనే జరిగేలా చర్యలు ఊపందుకున్నట్లు సమాచారం.

ఆహ్వానించదగ్గ పరిణామం
ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల ఇటు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలకు, అటు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిరంతర పర్యవేక్షణ, కరిక్యులంలో మార్పులు వంటి వాటికి అవకాశం ఉండి విద్యార్థులకు ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌ అలవడతాయి.
– ప్రొఫెసర్‌ ఎం.జగదీశ్‌ కుమార్, వీసీ, జేఎన్‌యూ.

Advertisement

తప్పక చదవండి

Advertisement