అప్పుడు వైఎస్ఆర్ - ఇప్పుడు వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

అప్పుడు వైఎస్ఆర్ - ఇప్పుడు వైఎస్ జగన్

Published Thu, May 22 2014 1:13 PM

అప్పుడు వైఎస్ఆర్ - ఇప్పుడు వైఎస్ జగన్ - Sakshi

కొన్ని పోలికలు విచిత్రంగా ఉంటాయి. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, 1999 అసెంబ్లీ ఎన్నికలకు మద్య ఎన్నో పోలికలున్నాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ ఆర్ గెలుస్తారనే అంతా భావించారు.

1999 అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పాపులారిటీ పడిపోతున్న చంద్రబాబుకి, దూసుకొస్తున్న వైఎస్ ఆర్ కి మద్య పోటీ జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు జగన్, చంద్రబాబు ల మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ కి ఎంత సానుకూలత ఉందో ఈ సారి జగన్ కీ అంతే సానుకూలత కనిపించింది. రెండు ఎన్నికల్లోనూ చంద్రబాబు అత్యంత బలహీన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ గెలుపు ఖాయమని, ఈ సారి వైకాపా గెలుపు ఖాయమని అనిపించింది.

అయితే చంద్రబాబు అప్పట్లో అటల్ బిహారీ వాజ్ పేయీ పాపులారిటీని అడ్డం పెట్టుకున్నారు. మూలుగుతున్న మూడో ఫ్రంట్ ను వదిలేసి బిజెపితో పొత్తు కుదుర్చుకున్నారు. కార్గిల్ పోరు వల్ల పెరిగిన బిజెపి బలాన్ని సొమ్ము చేసుకున్నారు.

2014 లోనూ ఆయన 'జీవితంలో బిజెపిని కలవను' అంటూనే కన్ను గీటారు. మోడీ వేవ్ కనిపించింది. అంతే మోడీ బండి బ్యాక్ సీటు ఎక్కేశారు. మూడో ఫ్రంటు ముచ్చట్లు చెప్పి మరీ మరోసారి కమలంతో దోస్తీ చేశారు.

అప్పట్లో నినాదం 'అబ్ కీ బారీ అటల్ బిహారీ' అయితే ఈ సారి 'అబ్ కీ బార్ మోడీ సర్కార్' ప్రధాన నినాదం.
ఈ కలయిక వల్ల కీలక లాభం జరిగింది. ఈ కలయిక వల్ల బిజెపికి కలిగిన లాభం గుప్పెడు. టీడీపీకి కలిగింది గంపెడు. 1999 లో కాంగ్రెస్ 75 సీట్లలో అయిదు వేల కన్నా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సారి 25  చోట్ల వైకాపా అయిదు వేల కన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఇంతా చేసి అయిదు లక్షల ఓట్లే ఆట తీరును మార్చేశాయి.

1999 ఓటమి తరువాత కాంగ్రెస్ షాక్ కి గురైంది. అయితే తరువాత వైఎస్ ఆర్ పుంజుకున్నారు. అలుపెరగని పోరాటం చేశారు. దాని ఫలితమే 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి. అప్పడు వైఎస్ ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ సారి కూడా సరిగ్గా అలాంటి ఫలితమే వచ్చింది. అప్పట్లాగానే ఇప్పుడు కూడా చరిత్ర తిరగబడుతుందా? కొత్త చరిత్ర తయారవుతుందా? అయిదేళ్లు వేచి చూస్తే చాలు! జవాబు తెలిసిపోతుంది.

Advertisement
Advertisement