అస్త్రాలు సిద్ధం | Sakshi
Sakshi News home page

అస్త్రాలు సిద్ధం

Published Sat, Apr 12 2014 3:14 AM

అస్త్రాలు సిద్ధం - Sakshi

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్,నామినేషన్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార వ్యూహానికి పదును పెట్టే పనిలో ఉన్నారు. స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల పోలింగ్ తంతు శుక్రవారం సాయంత్రం ముగిసింది. మరోవైపు శనివారం మధ్యాహ్నానికి సాధారణ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రి యకు తెరపడనుంది. అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఉండటంతో బరి నుంచి తప్పించడం తలకు మించి భారంగా పరిణమిస్తోంది.

బుజ్జగింపుల ద్వారా కూడా తిరుగుబాటు అభ్యర్థులు తప్పుకోని పక్షంలో ప్రచారంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని అభ్యర్థులు భావిస్తున్నారు. పార్టీ ప్రచార సామగ్రిని ఇప్పటికే కొనుగోలు చేసిన అభ్యర్థులు కరపత్రాలు, నమూనా బ్యాలెట్లు వంటి సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ప్రచార రథాలు, వాహనాలు, మైక్‌సెట్ల వినియోగం కోసం అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, వ్యయంపై ఎన్నికల సంఘం నిఘా వేయడంతో అభ్యర్థులు పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 పార్టీ ఎజెండాలు, అభ్యర్థుల గుణగణాలు, తెలంగాణ సెంటిమెంటు తదితరాలను ప్రచార అస్త్రాలుగా సంధించేందుకు అభ్యర్థులు సన్నద్దమవుతున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా సీడీలు తయారు చేయించి ప్రచార రథాల ద్వారా హోరెత్తించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు, క్రియాశీల కార్యకర్తలు, ముఖ్యులను అంతర్గతంగా కలుస్తూ ఎన్నికల్లో మద్దతు కోరేలా ప్రచారానికి సిద్దమవుతున్నారు.

 భారీ బహిరంగ సభలకు సన్నాహాలు
 అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్య నేతలను రప్పించడం ద్వారా ప్రచారాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 16 తర్వాత మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నెల 15న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాలమూరు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధించిన కేసీఆర్ ఈ సభను కృతజ్ఞతా సభగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వె ల్లడించాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల జిల్లాలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 25వ తేదీ తర్వాత పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని ఎంపీ అభ్యర్థి రహమాన్ వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మార్చి 25న మహబూబ్‌నగర్‌లో ప్రజా గర్జన నిర్వహించారు. మూడో వారంలో జిల్లాలో రోడ్‌షో నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.


 బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులను రప్పించేలా బీజేపీ అభ్యర్థులు ప్రచార వ్యూహం సిద్దం చేస్తున్నారు. ప్రచారానికి తక్కువ వ్యవధి ఉండటంతో ఇంటింటి ప్రచారానికి బదులుగా రోడ్‌షోలు, బహిరంగ సభలు మేలని ఎంపీ అభ్యర్థులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ప్రతీ గ్రామాన్ని చుట్టివచ్చేలా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ముందస్తుగా ప్రచారం ప్రారంభిస్తే చేతి చమురు వదులుతుందనే భయం కూడా అభ్యర్థులను వెన్నాడుతోంది. దీంతో వీలైనంత ఆలస్యంగా బరిలోకి దిగి సుడిగాలి ప్రచారం చేసేలా వ్యూహం ఖరారు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement