భంగపాటు తప్పదా ! | Sakshi
Sakshi News home page

భంగపాటు తప్పదా !

Published Mon, Apr 21 2014 2:13 AM

all opposition  to tdp in bhadrachalam

భద్రాచలం, న్యూస్‌లైన్ : ఒక్కసారైనా భద్రాచలం పీఠాన్ని దక్కించుకోవాలనే టీడీపీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఆ పార్టీ అగ్రనాయకుల వ్యవహార శైలితో కేడర్‌లో పూర్తిగా నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మండల స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదు. గ్రామాల్లో అయితే పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కార్యకర్తలే కరువయ్యారు. ఆ పార్టీకి కొంత కేడర్ ఉన్నప్పటికీ డివిజన్ స్థాయిలో ఆధిపత్యం కోసం పార్టీ నాయకులు తరచూ కుమ్ములాడుకోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో భద్రాచలంలో నడిరోడ్డుపైనే నాయకులు ముష్టి యుద్ధాలకు దిగారు.

 పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న తమలాంటి వారిని యశోద రాంబాబు చిన్నచూపు చూస్తున్నారంటూ ఇటీవల అర్ధరాత్రి వేళ ఆ పార్టీ కార్యాలయం ఎదుటే అతని అనుచరులు హల్‌చల్ చేశారు. వారం క్రితం భద్రాచలం మండలంలోని పలు గ్రామాల ముఖ్య కేడర్ అంతా యశోద రాంబాబు వ్యవహారశైలిపై పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో మాట ఇచ్చిన తప్పిన ఆయన గ్రామాల్లోకి వస్తే ఓట్లు వేసేది లేద ంటూ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

 రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయం ముందు హల్‌చల్ చేసిన నాయకులు ఏకంగా కార్యాలయానికి తాళాలు కూడా వేశారు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో పూర్తిగా నిస్తేజం ఏర్పడింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, సీపీఎం తర్వాత మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ప్రస్తుతం గ్రామాల్లో పూర్తిగా పట్టు తగ్గింది. వెంకటాపురం, చర్ల, భద్రాచలం, కూనవరం మండలాల్లో వర్గపోరు ఉంది. వ్యతిరేక వర్గాన్ని దెబ్బకొట్టేందుకు వేరే పార్టీకైనా ఓట్లు వేయించేందుకు సిద్ధమేనని అక్కడి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని మండలాల్లో టీడీపీ ప్రచారంలో మిగతా పార్టీల కన్నా పూర్తిగా వెనుకబడిపోయింది.

 ఫణీశ్వరమ్మకు టికెట్టుపై తమ్ముళ్ల ఆగ్రహం : భద్రాచలం నియోజకవ ర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఏనాడూ అందుబాటులో లేని ఫణీశ్వరమ్మకు అధిష్టానం టికెట్టు కట్టబెట్టడంపై స్థానిక నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. టికెట్టు తమకే వస్తుందని ఆశతో ఎంతో కాలంగా పార్టీ అభివృద్ధి కోసమని పనిచేస్తున్న  వాజేడుకు చెందిన బోదెబోయిన బుచ్చ య్య, చర్లకు చెందిన ఇర్పా శాంత, కూనవరానికి చెందిన సీనియర్ నాయకుడు సోడే రామయ్య భారీగానే ఆశలు పెట్టుకున్నారు. వీరంతా ఆయా మండలాల్లో మంచి పట్టుఉన్న నాయకులే.

 అయితే మూడు సార్లు ఎంపీగా గెలిచి, ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత సోడె రామయ్యను ప్రచారం లో విస్మరించారు. హైదరాబాద్‌లోనే ఉంటూ పార్టీ అధినేతను ప్రసన్నం చే సుకున్న ఫణీశ్వమ్మ బరిలో నిలవటంతో ఆశావాహులంతా నిరుత్సాహంలో పడిపోయారు. బోదెబోయిన బుచ్చయ్య వంటి నాయకులు రెబల్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ, చివరకు మొత్తబడి విరమించుకున్నారు. అయితే ఫణీశ్వరమ్మకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించటం లేదని పరిశీలకులు అంటున్నారు.

 అధిష్టానం మాట చెవికెక్కేనా : భద్రాద్రి తమ్ముళ్ల కుమ్ములాట తారాస్థాయికి చేరటంతో తెలంగాణ జిల్లాల పరిశీలకులు మండవ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిన ఇక్కడి నాయకత్వంపై తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి దిద్దుబాటు చేస్తున్న సమయంలోనే ఇరువురు నాయకులు వాదులాటకు దిగారు. ఇది చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేంత వరకూ వెళ్లింది. దీంతో తేరుకున్న జిల్లా నాయకత్వం పార్టీని గాడిలో పెట్టేందుకు తోటకూర రవిశంకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా యశోద రాంబాబుకు కూడా దీనిలో భాగస్వామ్యులను చేశారు. అయితే అధిష్టానం మాట భద్రాద్రి టీడీపీ తమ్ముళ్లు చెవికెక్కించుకుంటారా..?అనేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement