నిలువునా ముంచారు.. | Sakshi
Sakshi News home page

నిలువునా ముంచారు..

Published Mon, May 12 2014 12:50 AM

నిలువునా  ముంచారు.. - Sakshi

 విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘పొత్తన్నారు.. మన వల్ల మేలు పొందారు. సహకరిస్తామన్నారు. కలిసివస్తామని నమ్మించారు. చివరికి నిలువునా ముంచేశారు. వెన్నుపోటు పొడిచారు.’ తెలుగుదేశం సహకారంపై ఇదీ బీజేపీ ముఖ్య కార్యకర్తల, క్షేత్రస్థాయి నాయకుల ఆక్రోశం. ఎన్నికల వేళ టీడీపీ స్థానిక నాయకుల నయవంచనపై కమలనాథుల గుండెల్లో వెల్లువెత్తిన ఆవేశం. ఎన్నికల సందడి సద్దుమణిగిన తరుణంలో, అంతా ఫలితాల కోసం ఉత్కంఠతో నిరీక్షిస్తున్న సమయంలో.. బీజేపీ స్థానిక నాయకులు పొత్తు చిత్తయిన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పెద్దలతో నిర్వహించిన సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగా
 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ లోక్‌సభ స్థానానికి అభ్యర్థి హరిబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో టీడీపీ వంచనను ప్రముఖంగా ప్రస్తావించారు. తమ్ముళ్ల సహాయ నిరాకరణంపై, ప్రచార సమయంలో వారి జులుంపై మండిపడ్డారు. రుషికొండలోని ఐటీ పార్క్‌లో బీజేపీ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆతిథ్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కేడర్‌లోని ముఖ్యులు.. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక నిర్వర్తించిన నగర నాయకులు పాల్గొన్నారు. మీడియాను అనుమతించని ఈ సమావేశానికి సంబంధించి అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. నగరంలోని వివిధ వార్డుల్లో బీజేపీ నాయకులు ప్రచార సమయంలో టీడీపీ నేతల, కార్యకర్తల ధోరణిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. 

వారిని నమ్ముకునే కన్నా బయటి వారిపై విశ్వాసం పెంచుకోవడం లాభించిందని చెప్పారు. తమతో తిరుగుతూనే వెన్నుపోటుకు సిద్ధపడేవారని, వారితో తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డామని ఆరోపించారు. ఏ రోజు ప్రచారానికి పిలిచినా భారీగా ఆర్డర్లు ఇచ్చేవారని, దాంతో వారిని భరించడం కష్టంగా ఉండేదని విమర్శించారు. ముఖ్యంగా 32వ వార్డు, 14వ వార్డు, ఎన్‌ఏడీ కొత్తరోడ్, కొబ్బరితోట వంటి ప్రాంతాల్లో బీజేపీ జెండాలు పట్టుకోవడానికి కూడా టీడీపీ నేతలు ఇష్టపడేవారు కాదని దుయ్యబట్టారు. భీమిలి, పశ్చిమ, గాజువాక నియోజక వర్గాల్లో టీడీపీ సహకరించిన దాఖలాలు లేవన్నారు.

టీడీపీ నేతల కన్నా కాంగ్రెస్ నాయకులు వెయ్యి రెట్లు నయమని కొందరు బహిరంగంగానే కుండబద్దలు కొట్టారు. గాజువాకతో బాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు తమతో లోపాయికారీ ఒప్పందాలకు వచ్చారని, కాంగ్రెస్ ఎంపీకి బదులు కమలానికి ఓటేయాలంటూ తమ ఎదురుగానే చెప్పారని తెలియజేశారు. ఈ పరిణామాలతో అవాక్కయిన బీజేపీ నేతలు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయవద్దని...తర్వాత ఇబ్బందులొస్తాయని వాళ్ల నోరు నొక్కేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు పివి నారాయణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు.
 
 హరిబాబు ఏమన్నారంటే...
 ‘మనం స్వల్ప మెజార్టీతోనైనా గెలుస్తాం. కానీ మనం ఓడిపోతామని ఇంటెలిజెన్స్ మాత్రం నివేదిక ఇచ్చింది. మోడీ గాలి వీస్తున్న తరుణంలో టీడీపీతో పొత్తు బాగా కలిసి వచ్చింది. టీడీపీ నేతలు సహకరించకపోయినా పొత్తు వల్ల వారితో కలసి పనిచేయక తప్పలేదు. అందుకే కేడర్‌ను భారీగా పెంచుకోవాల్సి ఉంది. మనకు కేడర్ లేకనే పొత్తుకెళ్లాం.’

Advertisement

తప్పక చదవండి

Advertisement