కాయ్ రాజా కాయ్.. | Sakshi
Sakshi News home page

కాయ్ రాజా కాయ్..

Published Wed, May 7 2014 2:53 AM

కాయ్ రాజా కాయ్.. - Sakshi

 ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి సమయం సమీపిస్తోంది. అభ్యర్థుల భవితవ్యంపై బెట్టింగ్ జోరందుకుంది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన పోటీలో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ నడుస్తోంది. కాయ్ రాజా కాయ్ అంటూ రూ.లక్షల్లో పందెం కాస్తున్నారు. ఫలానా నాయకుడు గెలుస్తాడని కొందరు.. ఇన్ని వేల మెజార్టీ వస్తుందని మరికొందరు.. అభ్యర్థుల గెలుపోటములపై ఎవరికి తోచినట్లుగా వారు పందెం కాస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల విజేతలపై పందెం కాసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
 
 ఫలితాలపై ఉత్కంఠ
 జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. దీంతో ఫలానా పార్టీ గెలుస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్, ముథోల్ స్థానాల్లో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ సాగింది. దీంతో ఈ స్థానాలపైనే ఎక్కువగా బెట్టింగ్ నడుస్తోంది. ఒక అభ్యర్థిపై రూ.వందకు రూ.200, మరొకరిపై రూ.200కు రూ.300 పందెం కాస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల ఆధిక్యతపై పందెం సాగుతోంది. పది వేల మెజార్టీ వస్తే ఓ రేటు, 20వేల మెజార్టీపై ఓ రేటు ఇలా బెట్టింగ్ నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.50 వేల వరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఈ బెట్టింగ్‌ల్లో మధ్యవర్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పందెం కాస్తున్న ఇద్దరి వద్ద ముందే డబ్బులు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమ కమీషన్ పోను మిగితా డబ్బులు గెలిచిన వారికి అప్పగించడం వారి బాధ్యత. బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు పందెంరాయుళ్లు, మధ్యవర్తులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
 
 ఎంపీ అభ్యర్థులపై భారీగా పందెం
 జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల గెలుపోటములపై భారీగా బెట్టింగ్ సాగుతోంది. రియల్టర్లు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు బెట్టింగ్‌లో పాలు పంచుకుంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి రాథోడ్ రమేశ్(టీడీపీ), గోడాం నగేష్(టీఆర్‌ఎస్), నరేష్‌జాదవ్(కాంగ్రెస్), పెద్దపల్లి స్థానంలో వివేకా(కాంగ్రెస్), బాల్క సుమన్(టీఆర్‌ఎస్) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ నాయకుడే గెలుస్తాడని, తమకే మెజార్టీ వస్తుందని అభ్యర్థుల అనుచరులు రూ.లక్షల్లో పందెం కాస్తున్నారు. సుమారు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ విషయాన్ని పక్కన పెడితే రెండు ఎంపీ స్థానాల్లో గెలుపెవరిదనే దానిపై చర్చ సాగుతోంది. అభ్యర్థులు మాత్రం ఈసారి గెలిస్తే చాలనుకునే పరిస్థితి నెలకొంది.
 
 గ్రామాల్లోనూ...
 గ్రామాల్లోని యువత ఎక్కువగా పందెం కాస్తోంది. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పందెం కాస్తున్నారు. కొందరు నగదు రూపంలో కాకుండా నజరానాల రూపంలో బెట్టింగ్ కడుతున్నారు. సెల్‌ఫోన్లు, కెమెరాలు, చిన్నపాటి మందు పార్టీలు, విందులపై బెట్టింగ్ నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు కావడంతోనే బెట్టింగ్‌లు పెద్ద ఎత్తున కాస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరో తొమ్మిది రోజుల్లో జిల్లాలో రూ.కోట్లు చేతులు మారనున్నాయి.

Advertisement
Advertisement