Sakshi News home page

భువనగిరి టాప్.. మల్కాజిగిరి లాస్ట్

Published Sat, May 3 2014 3:32 PM

భువనగిరి టాప్.. మల్కాజిగిరి లాస్ట్ - Sakshi

తెలంగాణ ప్రాంతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోను, అత్యల్ప పోలింగ్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోను నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ తెలిపారు. మొత్తం 17 నియోజకవర్గాల పరిధిలో కలిపి సగటున 70.85 శాతం పోలింగ్ నమోదైందని, అత్యల్పంగా మల్కాజిగిరిలో 51.19 శాతం, అత్యధికంగా భువనగిరి 81 శాతం పోలింగ్ నమోదైందని ఆయన వివరించారు. 80 శాతం పోలింగ్తో ఖమ్మం రెండో స్థానంలో నిలిచిందన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ స్థానాల్లో 3 శాతం పోలింగ్ పెరిగిందని భన్వర్‌లాల్ చెప్పారు.

ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎన్నికల సోదాల్లో రూ. 140 కోట్లు పట్టుబడ్డాయని, 5 లక్షల లీటర్ల మద్యం, 74 కేజీల బంగారం, 933 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఇది చాలా ఆందోళనకరమని, భారత ఎన్నికల కమిషన్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు.

ఇక రెండోదశ పోలింగ్లో అరకు, పాడేరు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని, అలాగే కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెద్దకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్లలలో 7 నుంచి  సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. మిగతా 165 స్థానాల్లో సాధారణంగానే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. తెలంగాణలో పోలింగ్ తగ్గినా, అది కేవలం నగర ప్రాంతంలోనేనని, అందువల్ల సీమాంధ్రలో మరింత ఎక్కువ పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నామని భన్వర్లాల్ చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement