జిల్లాలో బీజేపీ బోణి | Sakshi
Sakshi News home page

జిల్లాలో బీజేపీ బోణి

Published Sat, May 17 2014 1:48 AM

జిల్లాలో బీజేపీ బోణి - Sakshi

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :  జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బోణీ కొట్టింది. శుక్రవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తాడేపల్లిగూడెంలో ఆ పార్టీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు విజయం సాధించారు. సామాన్య ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించిన పైడికొండల మాణిక్యాలరావు కాషాయ పార్టీ జిల్లా తొలి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో మొదటి నుంచి ఉనికిలో ఉండేది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న తరుణంలో జిల్లాలో ఆ పార్టీ బలం పుంజుకుంది.
 
 అప్పట్లో ఈ పార్టీ తరఫున కౌన్సిలర్లుగా కొందరు ఎన్నికయ్యారు. సినీనటుడు యూవీ కృష్ణంరాజు నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించి కేంద్ర మంత్రి పదవిని సైతం చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా నుంచి ఆ పార్టీ ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్థానం ఆ పార్టీకి కేటాయించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన మాణిక్యాలరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట గోపిపై 14 వేల 73 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలైన ఓట్లలో మాణిక్యాలరావుకు 73,339 ఓట్లు రాగా గోపీకి 59,266 ఓట్లు దక్కాయి.  దేశవ్యాప్తంగా వాజ్‌పేయ్ హవా కొనసాగుతున్న వేళ  కృష్ణంరాజు గెలుపొందగా నేడు నరేంద్ర మోడీ గాలిలో మాణిక్యాలరావు గెలవడం విశేషం. రెండుసార్లూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం గమనార్హం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement