కన్పించేది ఎన్నికలప్పుడే..! | Sakshi
Sakshi News home page

కన్పించేది ఎన్నికలప్పుడే..!

Published Mon, May 5 2014 2:46 AM

కన్పించేది ఎన్నికలప్పుడే..! - Sakshi

  • కామినేని మకాం అయితే అమెరికా.. లేకుంటే హైదరాబాద్
  •   ఓడిన ఐదేళ్లకు కైకలూరు రాక
  •   అప్పుడు అన్నయ్య..ఇప్పుడు తమ్ముడి ప్రచారం
  •   గతంలోనూ కలిసిరాని సినీనటుల ప్రచారం
  •   కైకలూరులో ఫ్యాన్ గాలి జోరు
  •   గెలుపుదిశగా రామ్‌ప్రసాద్..
  •  సాక్షి, మచిలీపట్నం/కైకలూరు, న్యూస్‌లైన్ : పెద్దగా పనులు చేయక్కర్లేదు కనీసం అందుబాటులో ఉంటే చాలు.. పంచభక్ష పరమాన్నం పెట్టక్కర్లేదు కనిపించినప్పుడు పలుకరిస్తే చాలు.. అందరివాడిగా ఉండే వాడినే ప్రజలు ఆదరిస్తారు.. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న రసవత్తరపోరులో సరిగ్గా ఇదే సీన్ కన్పిస్తోంది.

    ఒకరు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఉప్పాల రామ్‌ప్రసాద్ అయితే మరొకరు శ్రీమంతుడిగా పేరొందిన కామినేని శ్రీనివాస్. వీరద్దరి పోరును నిశితంగా గమనిస్తున్న కైకలూరు ప్రజలు ఓడినా గెలిచినా కామినేని శ్రీనివాస్ తమకు అందుబాటులో ఉండడని బాహాటంగానే చెబుతున్నారు. అందరికీ అనుకూలమైన, అందుబాటులో ఉండే రామ్‌ప్రసాద్‌ను గెలిపించుకుంటే ఐదేళ్లు తమవాడే ఎమ్మెల్యేగా ఉన్నాడన్న ఆనందం కలుగుతుందని కైకలూరు వాసులు చెబుతున్నారు.
     
    గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీకి దిగిన కామినేని శ్రీనివాస్ అయితే అమెరికా లేకుంటే హైదరాబాద్‌లో ఉంటారని కైకలూరు వాసులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో ఓడిన తరువాత హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తన వారసులు అమెరికాలో స్థిరపడటంతో ఎక్కువగా అమెరికా వెళ్లొస్తుంటారు. ఓటమి అనంతరం ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు.

    మళ్లీ ఎన్నికలొచ్చాక బీజేపీ టికెట్ దక్కించుకుని డబ్బు సంచులతో దిగారని పలువురు పేర్కొం టున్నారు. కామినేని కోటీశ్వరుడు కాబట్టి డబ్బులు వెదజల్లుతారన్న ప్రచారం ఊపందుకుంది. సామాజి కంగా, ఆర్థికంగా బలమైన కామినేని రెండోసారి పోటీకి దిగడంతో ఆయన ఎన్నికల సమయంలో వస్తున్నారు తప్పా కైకలూరు నియోజకవర్గ వాసులను ఎప్పుడూ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
     
    నాడు అన్నయ్య.. ఇప్పుడు తమ్మయ్య

    ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇప్పుడు వేర్వేరు రాజకీయ పార్టీల సేవలో తరిస్తున్నారు. రెండు ఎన్నికల్లోనూ మెగా అన్నదమ్ముల సేవలు కామినేనికి తప్పలేదు. 2009 ఎన్నికల్లో చిరంజీవి సర్వశక్తులు ఒడ్డి కామినేని కోసం ప్రచారం చేశారు. తాజా ఎన్నికల్లో పవన్ కైకలూరులో ఆదివారం ప్రచారం చేశారు. అన్నలానే సినీ డైలాగులు పేల్చారు. అయితే ఈ నియోజకవర్గంలో సినీ గ్లామర్  కలిసిరాదనే సంగతి తెల్సిన ప్రజలు పవన్ ప్రచారాన్ని సైతం పట్టించుకోలేదు.

    1999 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన యర్నేని రాజారామచందర్ ఓటమి కోసం టీడీపీ తరఫున సినీనటి విజయనిర్మల ప్రచారం చేసినా యర్నేనికే ప్రజలు పట్టంకట్టారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేసినా కామినేనికి ఓటమి తప్పలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తరఫున ఇటీవల చిరంజీవి, తాజాగా ఆదివారం కామినేని కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు.
     
    రాజకీయ పరిణితికి నిదర్శనం జగన్ సభ
     
    రాజకీయ పరిణితికి నిలువెత్తు నిదర్శనం ఇటీవల కైకలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన జనభేరి అని పలువురు కొనియాడుతున్నారు. జగన్, పవన్ సభలను విశ్లేషకులు బేరీజు వేస్తున్నారు. పవన్ సభ చంద్రబాబు, మోడీల భజన సభగా మారిందని పెదవి విరిచారు. అన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు, మోడీని ఉతికిపారేస్తుంటే, తమ్ముడు తగుదునమ్మా అంటూ అదే మోడీ, బాబును ప్రశంసించడం ఏమి రాజకీయమని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కైకలూరులో ఉప్పాల రామ్‌ప్రసాద్‌కే అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇక్కడ వైఎస్సార్ సీపీదే విజయమని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement