సీఎం రమేష్.. ఓ బ్రోకర్ | Sakshi
Sakshi News home page

సీఎం రమేష్.. ఓ బ్రోకర్

Published Sat, Apr 12 2014 12:56 AM

సీఎం రమేష్.. ఓ బ్రోకర్ - Sakshi

* రాయదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డి విమర్శ

రాయదుర్గం, న్యూస్‌లైన్ : ‘తెలుగుదేశం పార్టీలో రాయలసీమ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రమేష్ ఓ చీడ పురుగు.. పార్టీలో బ్రోకర్ పాత్ర పోషిస్తున్నాడ’ని టీడీపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం రాత్రి  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నువ్వు వచ్చి పార్టీ అధినేతను కలువు అని సీఎం రమేష్ నాకు ఫోన్ చేశాడు. నేను హైదరాబాద్ వెళితే ఆ సమయంలో కాలవ శ్రీనివాసులు, మెట్టు గోవిందరెడ్డితో చంద్రబాబు చర్చిస్తున్నారు. నేనెళ్లగానే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పారు. ఆ సమయంలో సీఎం రమేష్ ఫోటో తీయించి అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని పత్రికల్లో స్టేట్‌మెంట్లు ఇప్పించాడు. ఇది పొలిటికల్ గేం’ అని ధ్వజమెత్తారు.

ఈ పరిస్థితిలో నేను ఎలా కొనసాగాలో శనివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీసీ మహిళ కేవీ ఉష నుంచి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ఆమెను మోసగించినట్టు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి నుంచి కూడా రూ. 20 కోట్ల నుంచి 60 కోట్ల వరకు సీఎం రమేష్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆయనే కారణమని, ఈ ఎన్నికల్లో కూడా డ్రామాలు ఆడి పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

Advertisement
Advertisement