ఖర్చులకివ్వరా? | Sakshi
Sakshi News home page

ఖర్చులకివ్వరా?

Published Thu, Mar 20 2014 3:07 AM

congress party got new problem

 సాక్షి, అనంతపురం : కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్య ఎదురవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతికష్టం మీద ఒప్పించి కొంత మందితో నామినేషన్లు వేయించి జబ్బలు చరుచుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఎవరికి వారు ప్రచారం చేసుకునే పనిలో ఇక నిమగ్నం కావాలని నాయకులు పదే పదే ఆదేశిస్తున్నా ప్రచారం గురించి పట్టించుకోకుండా పార్టీ ఫండ్ ఇవ్వాలంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
 
 పస్తుతం ఎన్నికల ఫండ్ ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నా అభ్యర్థులు ఎంతో కొంత ఇస్తేనే వెళ్తామంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక డీసీసీ కార్యాలయ నాయకులు తలలు బాదుకొంటున్నారు. నామినేషన్లు వేయకముందు ఖర్చులకు డబ్బు ఇవ్వమని చెప్పి ఉంటే తాము నామినేషన్లు వేసే వాళ్లమే కాదని కాంగ్రెస్ కార్యాలయం వద్దకు వచ్చిన పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 అనంతపురం నగరపాలక సంస్థతో పాటు మరో 11 మున్సిపాలిటీల్లోని 373 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున 146 మందిని బరిలోకి దింపారు. రాయదుర్గం, పామిడి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గుత్తిలో ఒకటి, గుంతకల్లులో 4, తాడిపత్రిలో 2, ధర్మవరంలో మూడు వార్డులకు మాత్రమే కాంగ్రె స్ తరఫున అభ్యర్థులు పోటీలో వున్నారు. ఏదో ఒక విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత మందిని రంగంలో దింపి పరువు కాపాడుకున్నామని భావిస్తున్న ఆ పార్టీ నేతలకు ప్రాదేశిక (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలకు అభ్యర్థులను వెతకలేక.. ఆయా మండల నాయకులకే వదిలేశారు.
 
 కనీసం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలపడాలంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కొంత డబ్బు ఇవ్వాల్సిందేనని మండల నాయకులు పట్టుబడుతున్నారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా గెలిచే పరిస్థితి లేనందున అధిష్టానం కూడా ఎన్నికల ఖర్చు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత కింది స్థాయి నాయకులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో కనీసం ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ఎన్నికల ఫండ్ తీసుకొని ప్రచారం కోసం వెళ్లకుండా ఇచ్చిన డబ్బును జేబులో వేసుకొని నిశ్చింతగా ఉండాలనుకుని ఆశల్లో తేలిపోయిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఇదిలా ఉండగా కొంతమంది మాత్రం అధిష్టానం ఎన్నికల ఖర్చు కోసం డబ్బు పంపినా.. బయటకు తీయకుండా ఆ మొత్తాన్ని స్వాహా చేసే కుట్ర జరుగుతోందని కింది స్థాయి నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కనిపిస్తే ఖర్చులకు డబ్బులు అడుగుతారని నేతలు తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement