టీఆర్‌ఎస్.. ధోకా, ధమ్కీ, దక్కా పార్టీ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్.. ధోకా, ధమ్కీ, దక్కా పార్టీ

Published Fri, Apr 18 2014 3:32 AM

టీఆర్‌ఎస్.. ధోకా, ధమ్కీ, దక్కా పార్టీ - Sakshi

*కేసీఆర్ పెద్ద దొరైతే..కేటీఆర్ చిన్నదొర
*ధోకాబాజీలతో జరభద్రం
*కేంద్ర మంత్రి జైరాం రమేష్  

వికారాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అంటే ధోకా, ధమ్కీ, దక్కా పార్టీ అని కేంద్రమంత్రి జైరాం రమేష్ ధ్వజమెత్తారు. పచ్చి అబద్దాలకోరు, ధోకాబాజీ అయిన కేసీఆర్‌తో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు.
 
‘టీఆర్‌ఎస్ దొరల పార్టీ.. అందులో కేసీఆర్ పెద్దదొరైతే.. ఆయన కుమారుడు కేటీఆర్ చిన్నదొర’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీలో ఉన్నవారంతా చుట్టాలేనని, అందులో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పేరులోంచి కే తీసివేస్తే సీఆర్.. అంటే అర్థం ‘క్రోర్స్’ అని విమర్శనాస్త్రాలు సంధించారు.
 
ఉద్యమ సమయంలో మొసలి కన్నీరు కార్చిన ఆయన.. బిర్యానీలు తింటూ మీడియా కనబడగానే ముఖంవాల్చి ఫోజులిచ్చేవాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి.. తర్వాత మాటమార్చాడని, అయితే.. సీమాంధ్రలో కాంగ్రెస్ దెబ్బతింటుందని తెలిసి కూడా సోనియా గాంధీ మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు పింఛన్లు ఇస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని జైరాంరమేష్ హామీ ఇచ్చారు.
 
హైదరాబాద్ నుంచి పొమ్మనడానికి నువ్వెవరు?

సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లోనే ఉంటారు.. వారిని పొమ్మడానికి నువ్వెవరు అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మతత త్వ పార్టీకి ఓటేసినా ఒరిగేదేమీలేదన్నారు. తెలంగాణను అడ్డుకున్న పార్టీల్లో టీడీపీతోపాటు బీజేపీ కూడా ఉందన్నారు. సుస్థిర పాలన కేవలం కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. 

Advertisement
Advertisement