ఒప్పందాలు...ఉపసంహరణలు | Sakshi
Sakshi News home page

ఒప్పందాలు...ఉపసంహరణలు

Published Wed, Mar 19 2014 2:02 AM

election season changes party leaders

 అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నికల సీజన్‌లో క్షణక్షణానికి సీన్ మారిపోతుంటుంది. బస్తీమే సవాల్ ఈ సీటు నాదే... నాముందు నిలిచేవారెవరంటూ బీరాలు పలికినవారు నామినేషన్ ఘట్టానికి వచ్చేసరికి చతికిలపడుతుంటారు. స్నేహాలు, బంధుత్వాలు, డబ్బు, సామాజికవర్గ మొహమాటాలు, బెదిరింపులు వెరసి పోటీ నుంచి నిష్ర్కమణలు. ఇలాంటి దృశ్యాలు ప్రతి చోటా దర్శనమిస్తున్నాయి. నామినేషన్లకు ముందే కొందరు వీటికి లొంగి తప్పుకుంటుంటే మరికొందరు నామినేషన్ల అనంతరం. ఏదైతేనేం మొత్తానికి పోటీలో లేకుండా పోతున్నారు. పోటీలో నిలబడి తీరతామని మీసం మెలేసి చెప్పిన వారు సైతం రహస్య బేరాలకు తలొగ్గి నామినేషన్ పత్రాల దాఖలులో కావాలని కొన్ని పొరపాట్లు చేసి అవి తిరస్కరణకు గురయ్యేలా చేసుకుంటున్నారు.  
 
 అమలాపురం మున్సిపాలిటీలో పలువార్డుల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. మూడో వార్డులో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి పరోక్షంగా సహకరిస్తూ మరో ప్రధాన పార్టీ అభ్యర్థి లోపాయికారీ ఒప్పందాలతో సహకరించారు. అతనికి ఖర్చు చేసే సత్తా లేక పోవడంతో నామినేషన్ వేసినట్టే వేశారు. అయితే ఆ నామినేషన్ పత్రాలను కావాలని  సరిగ్గా పూర్తి చేయలేదు. నామినేషన్ పరిశీలనలో అతని నామినేషన్‌ను అనుకున్నట్టుగానే తిరస్కరించారు. దాంతో ఆ వార్డులో ఆయన స్నేహితుడి విజయం నల్లేరుపై నడకైంది. అలాగే నాలుగో వార్డులో కూడా ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిపై పోటీ చేసి తీరతానని మరో ప్రధాన పార్టీ నాయకుడు బీరాలు పలికారు. ఆతర్వాత అతనికి సహకరించేలా పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. దాంతో నామినేషన్ల ఘట్టం ముగిసే వరకు ఆ నాయకుడు పత్తా లేకుండా పోయారు. 
 
 ఫోన్ స్విచ్‌ఆఫ్ కూడా చేసేశారు. ఏడో వార్డు విషయానికి వస్తే ఓ ప్రధానపార్టీ అభ్యర్థిని గెలుపు కోసం తెరవెనక ఒత్తిడితో  మరో ప్రధాన పార్టీ అభ్యర్థిని నామినేషన్ చెల్లుబాటు కాకుండా  చేశారు. చివరకు ఆ అభ్యర్థి నామినేషన్ పత్రంలో ప్రపోజర్ సంతకం చేసిన వ్యక్తిని కూడా పథకం ప్రకారం అక్కడ నుంచి అదృశ్యం అయ్యేలా చేశారు. దాంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. అలాగే 20వ వార్డులో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి సామాజిక వర్గీయులు మరో ప్రధాన పార్టీ నుంచి నామినేషన్ వేసిన అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరి నుంచి తప్పించేందుకు రెండు రోజులపాటు గట్టిగా కృషి చేశారు. చివరికి వారి కృషి ఫలించి మంగళవారం పోటీనుంచి తప్పుకొనేందుకు ఆ అభ్యర్థి అంగీకరించారు. దాంతో ఆ వార్డు ఏకగ్రీవానికి దారి తీసింది.  

Advertisement
Advertisement