Sakshi News home page

గజరాజును మరిచారు !

Published Thu, Apr 24 2014 1:48 AM

గజరాజును మరిచారు ! - Sakshi

కనికరించని శత్రుచర్ల :అటవీశాఖ మంత్రిగా పని చేసిన శత్రుచర్ల విజయరామరాజు గిరిజనుల కష్టాన్ని హరిస్తున్న ఏనుగుల విషయాన్ని కనీసం పట్టించుకోలేదు. ఆపరేషన్ గజా విఫలం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి ఇక్కడ ఉన్న గజరాజులను వాటి ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తామని గతంలో సీతంపేటకు వచ్చిన సందర్భంగా బాలికల ఆశ్రమపాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే అది అతను మాజీగా మారినా కార్యరూపం దాల్చలేదు. ఇక్కడే ఏనుగులను ఉంచి అవిసంచరిస్తున్న ప్రదేశంలో కంచె వేసేస్తామని ప్రకటించడంతో గిరిజనుల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని విరమించుకున్నారు.అటు తర్వాత  ఏమిచేయలేమని చేతులెత్తేసారు. చివరకు వచ్చిన దారిన అవే వెళ్లిపోతాయని, అవి అడవిజంతువులని, వాటిని మనం ఏమీ చేయలేమని శత్రుచర్ల సెలవిచ్చేశారు.
 
 ఉద్యానవన పంటలకు భారీ నష్టం 
 ఏనుగుల దాడితో గిరిజనులు సాగు చేస్తున్న ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఏనుగులు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు మూడు వేల ఎకరాల్లో పంటలకు నష్టం  ఏర్పడింది. జీడి, మామిడి, పైనాపిల్, పసుపు, అల్లం, అరటి, కొబ్బరి ఇలా అన్ని రకాల పంటపై గజరాజులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. గిరిజనులకు అందిన నష్టపరిహారం మాత్రం నామమాత్రమే. కేవలం సర్వేలు, అంచనాల పేరుతో అటవీ శాఖ కాలం గడుపుతోంది. ప్రభుత్వం కూడా ఈ విషయమై కిమ్మనడం లేదు. రెండేళ్లుగా చూస్తే సీతంపేట మండలంలోని పులిపుట్టి, చిన్నబగ్గ, హడ్డుబంగి, కొండాడ పంచాయితీల్లోనే ఎక్కువగా ఏనుగుల వల్ల నష్టం జరిగింది. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉద్యానవన పంటలను ఐటీడీఏ అభివృద్ధి చేసినప్పటీకీ ఏనుగుల పుణ్యమాని అవి నాశనమౌతున్నాయి. వీటితో పాటు చెరుకు, వరి,రాగులు వంటి పంటలను కూడా ఏనుగులు విడిచి పెట్టడం లేదు. ప్రస్తుతం నాలుగు ఏనుగుల గుంపు పులిపుట్ట పంచాయతీ పరిధిలోనే సంచరిస్తున్నాయి.
 
 మైదాన ప్రాంతాల్లో తిష్ఠ
 అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. కొండదిగువన సంచరించడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొండపోడు పనులకు వెళ్లే సమయంలో ఎప్పుడైనా దాడిచేస్తాయేమోనని బయాందోళన చెందుతున్నారు. కొంతమంది గిరిజనులైతే ఏకంగా పనులు మానేసి ఇంటివద్దే ఉంటుండడంతో ఉపాధి కోల్పోతున్నారు. కె.గుమ్మడ, సుందరయ్యగూడ, ఇప్పగూడ,ఆనపకాయలగూడ, మోహనకాలనీ, బిల్లుమడ, వెంపలగూడ తదితర గ్రామాలు ప్రస్తుతం ఏనుగుల ప్రభావంతో వణికిపోతున్నాయి. టేకు తోటల్లోనే పగలు ఉండి, సాయంత్రం ఐదుగంటలు దాటితే బయటకు వచ్చేసి ఆహార సేకరణలో నిమగ్నమౌతున్నాయి. 
 
 స్తంభిస్తున్న జనజీవనం 
 ఏనుగుల సంచారంతో జనజీవనం స్తంభిస్తోంది. వర్షాకాలంలో కొండలపైకి వెళ్తున్న ఏనుగులు వేసవి ప్రారంభంతోనే కిందకు వచ్చి ఆరేడు నెలలు ఉండిపోతున్నాయి. కొండల్లో చెలమల నీరు ఎండిపోవడం, సాధారణ గెడ్డలు సైతం అడుగంటడంతో ఊటగెడ్డల కోసం ఏనుగులు వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే నీటి కోసం అవి మైదాన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అడవులు దట్టంగా ఉండేవి నీటికి కొరత ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొండపోడు వ్యవసాయం పేరుతో చదును చేయడంతో చలమలు ఎండిపోయాయి.
 
 మంత్రిగా ఉన్న సమయంలో శత్రుచర్ల విజయరామరాజు ఎన్నో హామీలను గిరిజనలకు ఇచ్చేశారు. అయితే ఒక్కటికూడా కార్యరూపం దాల్చలేదు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
  ఇతర రాష్ట్రాల నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి ఇక్కడ ఏనుగులను ఒడిశాకు పంపిస్తాం.
  ఏనుగుల వల్ల పంటలు నష్టపోయిన గిరిజనులందరికీ పరిహారం అందజేసి ఆదుకుంటాం.
  అవసరమైతే ఏనుగులను జంతు ప్రదర్శనశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తాం.
  ఏనుగులు సంచరించే ప్రాం తంలో పంటలు పోకుండా రక్షణ కంచె ఏర్పాటు చేస్తాం. 
  ట్రాకర్ల ద్వారా ఏనుగులను వచ్చిన తోవనే ఒడిశాకు పంపించే ఏర్పాట్లు చేస్తాం.
 
 వలసలే శరణ్యం
 
 ఏనుగుల వలన తీవ్రంగా నష్టపోతున్నాం. ఎన్నో ఏళ్లుగా పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో గిరిజనులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలానికి వెళ్లాలంటే భయంగా ఉంది. గిరిజనులకు ఎన్నాళ్లీ కష్టాలు.
 - సవర సుక్కమ్మ, సర్పంచ్, పులిపుట్టి  
 
 నిరంతర పోరాటం 
 ఏనుగుల సమస్యపరిష్కరించాలంటూ ఎప్పటి నుంచో గిరిజనులమంతా పోరా టం చేస్తునే ఉన్నాం. అధికారులకు  వినతి పత్రాలు సమర్పించాం. ప్రభుత్వం పట్టిం చుకోలేదు. పంటలు నష్టపోతున్నా పరి హారం కూడా ఇవ్వడం లేదు. దీంతో గిరి జనులు అన్నివిధాల చితికిపోతున్నారు.
  ఎ.భాస్కరరావు, గిరిజన నాయకుడు
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement