30లోగా పాత ఎంపీలకే చాన్స్ | Sakshi
Sakshi News home page

30లోగా పాత ఎంపీలకే చాన్స్

Published Fri, May 9 2014 4:37 AM

Former MPs will chance to cast vote right

* ‘స్థానిక’ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియోలపై న్యాయ శాఖ స్పష్టత
* 16 తర్వాత కొత్త ఎమ్మెల్యేలకు ఓటు హక్కు
* ప్రమాణ స్వీకారం చేయకున్నా ఓటేయొచ్చు
* చైర్‌పర్సన్ల ఎన్నికపై తొలగిన సందిగ్ధం
* జూన్ 2 తర్వాత నిర్వహణకే ఈసీ మొగ్గు

 
 సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్‌పర్సన్ల పరోక్ష ఎన్నికల నిర్వహణపై న్యాయ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహిస్తే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ప్రస్తుతమున్న ఎంపీలకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుందని పేర్కొంది. అయితే రాష్ర్ట శాసనసభ రద ్దయినందున ఎమ్మెల్యేల విషయాన్ని మాత్రం న్యాయశాఖ ప్రస్తావించలేదు. స్థానిక సంస్థలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తి చేసి ఫలితాల విడుదలకు సిద్ధమైన ఈసీ.. వాటి చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికపై సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే.
 
 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 16న వెల్లడికానున్న నేపథ్యంలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయంలో స్పష్టత కోరుతూ రాష్ర్ట ప్రభుత్వానికి ఈసీ గత నెలలో లేఖ రాసింది. ప్రభుత్వం దీనిపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరింది. అయితే ఈలోగానే రాష్ర్ట శాసనసభ రద్దు కావడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీల పదవీకాలం ఈ నెల 30 వరకు ఉన్నందున ఆలోగా స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే పాత వారికే ఓటుహక్కు కల్పించాలని న్యాయశాఖ తేల్చింది.
 
 అయితే మున్సిపల్ చట్టాల ప్రకారం స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరోక్ష ఎన్నికల నిర్వహణకు నిర్దేశిత కాలపరిమితేమీ లేదని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఎంపీపీ, జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులు పాల్గొన్నప్పటికీ వారికి ఓటు హక్కు ఉండదు. మున్సిపల్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిషత్‌లకు ఎప్పుడైనా పరోక్ష ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది. ఇక మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎన్నిక విషయంలో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో మే 16 తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఎమ్మెల్యేలు జూన్ రెండో తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేనందున.. అప్పటివరకు పరోక్ష ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.
 
 రాజస్థాన్‌లో గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేయకున్నా చైర్‌పర్సన్ల పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని, అదే పద్దతిని ఇక్కడ కూడా పాటించే అవకాశం లేకపోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ విధానంలో ఈ నెల 30లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రస్తుత ఎంపీలు, కొత్త ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. కానీ లోక్‌సభ ఫలితాలతో కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు మాత్రం దూరంగా ఉండాల్సిందే. ఈ వివాదాలన్నింటినీ అధిగమించాలంటే.. జూన్ రెండో తేదీ తర్వాతే పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే మేలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత స్థానిక సంస్థల పాలకమండళ్లకు పరోక్ష పద్ధతిలో నిర్వహించే ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement