సమన్వయ లోపం | Sakshi
Sakshi News home page

సమన్వయ లోపం

Published Sun, May 11 2014 12:08 AM

groups fightings in congress

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  కాంగ్రెస్‌లో వర్గపోరు ఎన్నికలయ్యాక కూడా కొనసాగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకత్వం ఎవరికివారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ, వర్గపోరు కారణంగా జెడ్పీ పీఠం ఆ పార్టీకి దక్కడం ప్రశ్నార్థకమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం ఆ పార్టీ జిల్లా నాయకులు ఏ వర్గానికి.. ఆ వర్గం నిర్వహించిన సమావేశాలే ఇందుకు నిదర్శనం. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడిన అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశాలు నిర్వహించారు.

ఒకవర్గ నాయకులు మంచిర్యాలలో సమావేశం నిర్వహిస్తే.. మరో వర్గం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ రెండు సమావేశాల అజెండా ఒక్కటే అయినప్పటికీ ఎవరికివారే అన్నట్లు రెండు చోట్ల సమావేశాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన జెడ్పీటీసీ సభ్యులందరిని ఏకతాటిపైకి తేవడం అంత సులభమైన పనికాదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జీల సిఫార్సుల మేరకే కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ టిక్కెట్లు కేటాయించారు. అయితే ఈ నాయకుల్లో తీవ్ర వర్గపోరు నెలకొంది. దీంతో ఒక వర్గం చైర్మన్ బరిలో ఉన్న అభ్యర్థికి మద్దతిస్తే.. వ్యతిరేక వర్గం నేతల అనుచరులైన జెడ్పీటీసీలుగా మద్దతిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

జెడ్పీ పీఠంపై ముందే కన్నేసిన కొందరు జెడ్పీటీసీలు ఇప్పుడు రెండు వర్గాల నేతలను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తాను ఏ వర్గానికి చెందిన వ్యక్తిని కాదని చూపేందుకు చైర్‌పర్సన్ రేసులో ఉన్న సభ్యులు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 52 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. కనీసం 27 మంది జెడ్పీటీసీలు మద్దతుంటే పీఠాన్ని దక్కించుకోవచ్చు. ఒక వర్గం సభ్యులు మద్దతివ్వని పక్షంలో ప్రత్యర్థి పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మంతనాలు సాగిస్తున్నారు. మద్దతిచ్చిన సభ్యులకు భారీ మొత్తంలో నగదు, పీఠం అధిరోహించాక రూ.లక్షల్లో అభివృద్ధి పనులు ఇస్తామని మచ్చిక చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలోని ముఖ్య నాయకుల మద్దతును కూడా కూడగట్టేందుకు తంటాలు పడుతున్నారు.

 అధిష్టానంపైనే భారం
 జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సభ్యులందరు నడుచుకోవాలని నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నిక బాధ్యతలను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తామని ఆ పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. పార్టీ ఆదేశాల మేరకు అందరు సభ్యులు నడుచుకోవాలని, లేని పక్షంలో అనర్హత వేటు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Advertisement
Advertisement