హాట్టాపిక్: ప్రతిష్టాత్మక చాందినీచౌక్ | Sakshi
Sakshi News home page

హాట్టాపిక్: ప్రతిష్టాత్మక చాందినీచౌక్

Published Tue, Apr 8 2014 2:56 PM

హాట్టాపిక్: ప్రతిష్టాత్మక చాందినీచౌక్ - Sakshi

చాందినీచౌక్ చరిత్రాత్మక ప్రదేశం. మొఘల్ చక్రవర్తి షాజహాన్(1628-1658)  తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలనుకున్నప్పుడు యమునా నది తీరాన ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోటలో నివసించే వారి కోసం ఒక బజారు అవసరమని భావించిన షాజహాన్ కుమార్తె జంహా ఆరా చాందినీ చౌక్ బజార్‌కు రూపకల్పన చేశారు. చంద్రుడి వెన్నెల ప్రతిబింబించేలా అప్పట్లో ఈ బజారు మధ్యలో ఓ కొలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో కొలను పూడుకుపోయినా బజారు పేరు చాందినీ చౌక్ చిర స్థాయిగా నిలిచిపోయింది.

ఢిల్లీలో ప్రసిద్ది చెందిన చాందినీచౌక్‌ పేరును మార్చి, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలన్న  ప్రతిపాదన మూడేళ్ల క్రితం ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు  వచ్చింది. దానిని అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. చాందినీచౌక్‌ పేరు మార్చడమంటే దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించినట్లుగా భావించారు. చాందినీచౌక్‌ను షాజహాన్‌ నిర్మించాడని, ఈ పేరును మార్చడం ఈ నగరానికి ఉన్న చరిత్రను కించపర్చడమే అవుతుందని పలువురు  పేర్కొన్నారు.  దేశరాజధానిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చాందినీచౌక్‌లోని అన్ని వ్యాపార సంస్థలను ఆన్‌లైన్‌లో పెట్టినట్లు గూగల్‌ ఇండియా తెలిపింది. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 2500 వ్యాపార సంస్థలున్నాయి. వీటన్నింటికి ప్రత్యేకంగా ఒక్కో వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారస్తులే అధికం. అందుకే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి వ్యాపారులు లేదా ఆ వర్గానికి చెందిన వారే గెలుస్తూ ఉంటారు.

ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత గల ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ఈ సారి ముగ్గురు హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఈ నెల10న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.  కాంగ్రెస్ తరపున కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్, బిజెపి నుంచి పార్టీ సీనియర్ నేత  హర్షవర్థన్, ఆమ్ అద్మీ పార్టీ నుంచి  ప్రముఖ జర్నలిస్ట్ టీవీ యాంకర్ అషుతోష్ పోటీ చేస్తున్నారు.

కపిల్ సిబల్: పంజాబ్‌కు చెందిన కపిల్ సిబల్ గత ఎన్నికలలో ఇక్కడ నుంచే గెలుపొందారు. సాదారణంగా ఇక్కడ నుంచి వ్యాపారులు లేక ఆ వర్గానికి చెందినవారే గెలుస్తూ ఉంటారు. చాందినీ చౌక్ ప్రాంతంలో పంజాబీల సంఖ్య అధికం. తన రాష్ట్ర ఓటర్ల బలంతోనే  గతంలో ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో సిబల్ మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదు.  పంజాబ్‌లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని  ఆయన కాంగ్రెస్ అధిష్టానికి చెప్పారు. ఫలితంలేదు. ఆయన మాట అధిష్టానం వినలేదు.  విధిలేని పరిస్థితులలో సిబల్ మరోసారి చాందినీ చౌక్ నుంచి పోటీకి సిద్ధపడ్డారు.

హర్షవర్థన్: వ్యాపార వర్గానికి చెందిన హర్షవర్ధన్ బిజెపి సీనియర్ నేత.  హర్షవర్థన్ ఇటీవల ఢిల్లీ శాసనసభకు జరిగిన  ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. బిజెపికి తగిన సంఖ్యాబలం ఉంటే ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారు. స్థానికుడైన హర్షవర్థన్కు ఓటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. వృత్తిపరంగా వైద్యుడైన ఆయనను మిత్రులు, ప్రత్యర్థులు కూడా ‘డాక్టర్ సాబ్’ అని పిలుస్తారు.

అషుతోష్: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అషుతోష్ ప్రముఖ టీవీ చానల్‌లో పనిచేసి ఢిల్లీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ టీవీ చానల్‌లో యాంకర్గా పని చేసినంత కాలం వైశ్య కులాన్ని సూచించే పేరు ‘గుప్తా’ను పెట్టుకోలేదు. ఇప్పుడు నామినేషన్ వేసే సమయంలో మాత్రం తన పేరు చివర ‘గుప్తా’ను తగిలించుకున్నారు. చాందీనీ చౌక్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న వైశ్యుల మద్దతు సంపాదించేందుకే ఆయన ‘గుప్తా’గా పరిచయం చేసుకున్నారు.

ఈ ముగ్గురిలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత వల్ల ముస్లిం ఓట్లు తనకే పడతాయని కపిల్ సిబల్ ఆశ. వ్యాపార వర్గం ఓట్లు తనకే పడతాయన్నది హర్షవర్థన్ అభిప్రాయం. ఇక మిగిలిన సామాన్య ఓటర్ల మద్దతు తనకేనన్నది అశుతోష్ గుప్తా అంచనా.

Advertisement

తప్పక చదవండి

Advertisement