కౌంటింగ్.. కసరత్తు | Sakshi
Sakshi News home page

కౌంటింగ్.. కసరత్తు

Published Mon, May 12 2014 2:51 AM

IN districts municipals results tough comipition

సాక్షి, కడప: జిల్లాలో మున్సిపోల్స్ ఫలితాలకు తెరపడనుంది. కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలకు సంబంధించి సోమవారం కౌంటింగ్ జరగనుంది. వీటన్నింటికీ మార్చి 30వ తేదిన పోలింగ్ జరిగింది.  ఫలితాలకోసం అభ్యర్థులు, ఓటర్లు 42 రోజులపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఫలితాలపై కాకిలెక్కలు, అంచనాలతో కాలం గడిపారు.
 
 ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలకు నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని రూములలో వేర్వేరుగా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా కడపలో 13 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 245 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 19 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఈ ఫలితం మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతంలో వెల్లడి కానుంది. మొట్టమొదటి ఫలితం ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి సంబంధించి ఉదయం గంటలోపే వెల్లడి కానుంది. దీని లెక్కింపు నాలుగు రౌండ్లలోనే ముగియనుంది. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల అధికారి టేబుల్‌పైనే లెక్కించనున్నారు.
 
 ఐదు నిమిషాల్లోపే ఒక రౌండ్ లెక్కింపు
 ఒక్కో రౌండ్ లెక్కింపు ఐదు నిమిషాలలోపే పూర్తి కానుంది. ఈవీఎంలు తీసుకుని రావడం, వాటి సీలు తొలగించడం, అభ్యర్థుల సంతకాల కోసమే కొద్దిమేర సమయం పట్టే అవకాశం ఉంది. ఒక రౌండ్ ఫలితానికి సంబంధించి రిజల్ట్ బటన్ నొక్కగానే ఒక్క నిమిషంలోపే ఫలితం రానుంది. బద్వేలు ఆరు రౌండ్లలో, మైదుకూరు ఐదు రౌండ్లు, జమ్మలమడుగు ఐదు రౌండ్లు, ప్రొద్దుటూరు పది రౌండ్లు, రాయచోటి ఎనిమిది రౌండ్లు, పులివెందులకు సంబంధించి రెండు హాళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కడప కార్పొరేషన్‌లో లెక్కింపు డివిజన్‌కు ఒకటి చొప్పున 13 టేబుళ్ల ద్వారా 245 పోలింగ్ స్టేషన్ల కౌంటింగ్ 19 రౌండ్లలో పూర్తి కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
 ఉదయం ఆరు గంటల్లోపే కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలు తరలింపు
 కొత్త కలెక్టరేట్ స్ట్రాంగ్ రూము నుంచి తెల్లవారుజామున 3.00 గంటలకే అభ్యర్థుల సమక్షంలో సీలు తీసి ఈవీఎంలను బాక్సుల్లో పెట్టి ఆర్టీసీ డీజీటీ ద్వారా కౌంటింగ్ కేంద్రంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూములకు ఆరు గంటల్లోపే తరలిస్తారు. ఒక్కో రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలించి వాటి లెక్కింపు పూర్తి కాగానే వాటిని మళ్లీ స్ట్రాంగ్ రూములోకి తీసుకుని వస్తారు. తర్వాత రెండవ రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంలను తరలిస్తారు.
 
 ఏర్పాట్లను పరిశీలించిన ఏజేసీ
 ఓట్ల లెక్కింపునకు సంబంధించి నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో  ఏర్పాట్లను ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఒక్కో రౌండుకు సంబంధించి బరిలో ఉన్న కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులకు మాత్రమే అనుమతిస్తారు.
 
 సెల్‌ఫోన్లను లోనికి తీసుకుని రాకూడదు. ఆదివారం సాయంత్రం నుంచే కళాశాల ప్రాంగణంలో పోలీసులు విసృ్తత బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. కౌంటింగ్ జరిగే సమయంలో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు మురళీధర్‌రెడ్డి, బాల దిగంబర్, జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డితోపాటు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు ఫలితాల లెక్కింపును పరిశీలించనున్నారు.
 
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల లెక్కింపునకు ఏర్పాట్లు
 ఈనెల 13వ తేదీన జరిగే ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జమ్మలమడుగు డివిజన్‌కు సంబంధించి కడపలోని మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో, రాజంపేట డివిజన్‌కు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్‌కళాశాలలో, కడప డివిజన్‌కు సంబంధించి కేశవరెడ్డి స్కూలులో కౌంటింగ్ జరగనుంది, కౌటింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణను ఇచ్చారు. ఒక్కో ఎంపీటీసీకి ఒక్కొక్క టేబుల్ చొప్పున ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఎంపీటీసీ ఫలితాలు దాదాపు మధ్యాహ్నం లోపే వెల్లడి కానున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఒక్కో టేబుల్‌కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఒక టేబుల్‌కు ఒక ఏజెంటును మాత్రమే అనుమతిస్తారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement