ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఎర | Sakshi
Sakshi News home page

ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఎర

Published Sat, Mar 29 2014 1:35 AM

in muncipal elections ad arbitium candidates regulations

సాక్షి, నల్లగొండ,మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఓ వైపు పోలీసులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులు తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ప్రచార తీరును చూస్తే... అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉందా అన్న సందేహం కలగకమానదు. ప్రచారానికి శుక్రవారం చివరిరోజు కావడంతో ఆయా పార్టీల ప్రధాన నేతలు ఓటర్లను కలిసి అభ్యర్థించారు. ప్రతి వార్డులో పెద్ద ఎత్తున ర్యాలీలతో హోరెత్తించారు. పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహించారు. పల్లెల నుంచి కూలీలను తీసుకొని ప్రచారం లో నిమగ్నం చేశారు.

 స్థానిక ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు అభ్యర్థుల తరఫున ప్రచారం కొనసాగించారు. ఇంకోవైపు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు, మద్యం ముట్టజెప్పారు. పోటీ గట్టిగా ఉన్న చోట, చైర్మన్ పీఠం ఆశిస్తున్న నేతలు ఒక్క ఓటుకు రూ.4 వేలు ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు. మిగిలిన చోట్ల హీనపక్షం రూ. వెయ్యి ముట్టజెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్న మద్యాన్ని ఎన్నికలకు కొన్ని గంటల ముందు వరద పారించేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు.

 సర్దుబాటు...

 రెబల్ అభ్యర్థులున్న చోట బుజ్జగింపులు జరుగుతున్నాయి. వీలైతే ఆర్థికంగా సహాయపడతామని హామీ ఇస్తున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులు సద్దుమణిగినట్లు సమచారం. వీరికి పడాల్సిన ఓట్లన్నీ.. పార్టీ అభ్యర్థులకు వేసే బాధ్యతలను కూడా రెబల్ అభ్యర్థుల భుజానే వేసినట్లు వినికిడి.

 కోడ్ ఉల్లంఘన....

 అభ్యర్థులు అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. అక్రమాల పర్వానికి తెరతీశారు. ముఖ్యం గా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆయా పార్టీలు దాదాపు నాలుగైదు వందల మందితో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వాస్తవంగా ర్యాలీలు తీయడానికి పోలీసుల అనుమతి తీసుకున్నా.. కొద్దిపాటి  మందికే పరిమితం కావాలి.

 డబ్బు.. మద్యంతో గాలం..

   జిల్లాకేంద్రంలో మెజార్టీ వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. అధికార యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించినా అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని ముందుగానే నిల్వ చేసుకున్నారు. తమ నివాసాల్లో మద్యం ఉంటే పట్టుబడతాయన్న ముందుచూపుతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో భద్రపరుచుకున్నారు. సూర్యాపేటలో ఒక్కో ఓటుకు అత్యధికంగా రూ.5 వేలు ఇస్తామని అభ్యర్థులు ఆశచూపారు. చైర్ పర్సన్ పీఠం కోసం బరిలో ఉన్న నాయకులు ఎంతైనా ఇవ్వడానికి వెనకాడడం లేదు. ప్రధాన పార్టీలు పోటాపోటీగా డబ్బు పంచడంలో తలమునకలయ్యాయి. దీనికి తోడు వెండి బరిణెలు, బిర్యానీ, ఒక మద్యం ఫుల్ బాటిల్ ముట్టజెప్పారు.

 ఓ వార్డులో ఐదు ఓట్లకు కలిపి ఫ్రిజ్ అందజేశారని సమాచారం.

భువనగిరిలో ఓటుకు గరిష్టంగా రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఐదారు వార్డుల్లో హోరాహోరీగా పోటీ ఉండడంతో గెలుపు కోసం అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నారు.మిర్యాలగూడలో ఓ పార్టీ నాయకులు కర్ణాటక నుంచి మద్యం దిగుమతి చేసుకున్నారు. ఆ పార్టీ అనుయాయుల ఇళ్లలో నిల్వ చే శారు. వీరు ఓటర్లకు పంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు.కోదాడలో నాలుగు రోజుల నుంచే మద్యం అందజేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ. 2500 వరకు అప్పజెప్పుతున్నారు. కుంకుమ బరిణెలు, ముక్కు పుడకల పంపిణీ పరిపాటిగా మారింది.

హుజూర్‌నగర్‌లో ఎక్కడా చూసినా నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో కొత్త కళ సంతరించుకుంది. ఇక్కడ అధికార పార్టీకి, విపక్షాలకు చావోరేవో అన్నట్లుగా ఉంది. విపక్షాలు ఏకం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఓటుకు గరిష్టంగా రూ. 3 వేలు ఇచ్చేస్తున్నారు. దేవరకొండలోనూ అభ్యర్థులు పోటాపోటీగా తలపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.1500 వరకు చెల్లిస్తున్నారు.

Advertisement
Advertisement