కింజరాపు కుటుంబానికే ఆయన గులాం! | Sakshi
Sakshi News home page

కింజరాపు కుటుంబానికే ఆయన గులాం!

Published Tue, Mar 25 2014 2:14 AM

కింజరాపు కుటుంబానికే ఆయన గులాం! - Sakshi

శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సొంత ఆలోచనలు లేవు.. నిర్ణయాలు అసలే తీసుకోలేరు.. అటువంటి వ్యక్తి మా పార్టీకి జిల్లా అధ్యక్షుడు..! పోనీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ మొత్తానికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే.. అదీ లేదు.. పార్టీ అంటే కింజరాపు కుటుంబమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు... వారి అడుగులకు మడుగులొత్తుతూ.. వారు చెప్పినట్లే చేస్తూ.. ఆ కుటుంబ గుమాస్తాగా మారిపోయారు.
 చివరికి పార్టీ అధినేత నిర్ణయాలనే బుట్టదాఖలు చేస్తున్నారు..

ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎవరో టీడీపీకి వ్యతిరేకులు చేసినవి కావు.. సాక్షాత్తు ఆ పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి కొవగాపు సుధాకర్ నోటి నుంచి వెలువడిన ఆరోపణల తూటాలు. పార్టీలో ఉంటూనే పార్టీ జిల్లా అధ్యక్షుడిని.. కింజరాపు కుటుంబాన్ని తుర్పారబట్టారంటే.. వారి వైఖరితో ఆయన ఎంత విసిగిపోయారో.. ఇంకెంత క్షోభకు గురయ్యారో అర్థమవుతుంది.
 
శ్రీకాకుళంలో సోమవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ పార్టీ జిల్లా నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం..
 
సొంత ఆలోచనలు లేని.. నిర్ణయాలు తీసుకోలేని జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ.. కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడులకు వ్యక్తిగత గుమాస్తాగానే వ్యవహరిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నాకే స్థానిక ఎన్నికలకు సంబంధించి బీ ఫారాలు ఇవ్వాలని స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినా చౌదరి బాబ్జీ పట్టించుకోలేదు.
 
నన్ను కాదని.. నేరుగా అచ్చెన్నాయుడికి ఇచ్చారు. జిల్లా పార్టీకి బాధ్యుడిగా ఉండాల్సిన ఆయన కింజరాపు నేతల చేతిలో రబ్బర్ స్టాంప్‌లా మారిపోయారు. అలాగే బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన తనకు కాకుండా, కాంగ్రెస్‌లో అసమర్థ మంత్రిగా పేరు పొందిన శత్రుచర్ల విజయరామరాజుకు పాతపట్నం టిక్కెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
 
దీనిపై పార్టీ ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు నారాయణను కలిసి, నియోజకవర్గం పరిస్థితులను వివరించాను. ఆయన స్పందించి వెంటనే పార్టీ అధినేత చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. బాబుకు కూడా పరిస్థితి వివరించాను. పాతపట్నం టిక్కెట్ విషయమై శత్రుచర్లకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, నాకే ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
 
స్థానిక ఎన్నికలకు సంబంధించిన బీ ఫారాలు కూడా నాకే ఇస్తామని హామీ ఇవ్వడంతోపాటు, ఇదే విషయాన్ని బాబ్జీకి కూడా సమాచారం పంపారు. అయితే పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను సైతం బాబ్జీ లెక్కచేయకుండా, కింజరాపు నేతలనే అధిష్టానంగా భావించి పాతపట్నం నియోజకవర్గ బీ ఫారాలు తీసుకెళ్లి అచ్చెన్నాయుడి చేతిలో పెట్టారు. ఈ విషయంలో నాకు తీవ్ర అవమానం జరిగినట్లు భావిస్తున్నానని.. అసలు అచ్చెన్న, రామ్మోహన్‌లకు ఎన్టీఆర్, చంద్రబాబులపై కూడా గౌరవం లేదని.. అంతా ఎర్రన్నాయుడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
ఇదే రీతిలో కింజరాపు నేతలు పనిచేస్తే రానున్న ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శ్రీకాకుళం ఎంపీగా రెడ్డి శాంతి, పాతపట్నం ఎమ్మెల్యేగా కలమట రమణ గెలిచే పరిస్థితులు కన్పిస్తున్నాయని.. ఇదే జరిగితే దీనికి పూర్తి బాధ్యత కింజరాపు నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షుడిదే.

Advertisement
Advertisement