కన్నబాబుకు కాంగ్రెస్ ఝలక్ | Sakshi
Sakshi News home page

కన్నబాబుకు కాంగ్రెస్ ఝలక్

Published Thu, Apr 17 2014 1:14 AM

కన్నబాబుకు కాంగ్రెస్ ఝలక్

కరప, న్యూస్‌లైన్ : కాకినాడ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధిగా కేంద్ర మాజీమంత్రి పీవీ రంగయ్యనాయుడు కుమారుడు సీతారామస్వామి నాయుడు పేరు పరిశీలిస్తున్నట్టు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. ఈ చర్య ద్వారా రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు కాంగ్రెస్ పార్టీ జెల్ల కొట్టిందని అంటున్నారు. కన్నబాబును మారిస్తే అదే సామాజిక వర్గంనుంచి మరొకరిని పోటీ చేయించే పట్టుదలతో ఉన్న కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు పీవీ  సీతారామస్వామినాయుడు పేరును తెరపైకి తెచ్చారు. మొదట్లో ఎమ్మెల్యే కురసాల కన్నబాబును ఏదోవిధంగా ఒప్పించి కాంగ్రెస్ తరఫున పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యే కన్నబాబు మరోపార్టీలో చేరి సీటు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీల్లో ఈ ప్రయత్నాలు గండికొట్టాయి. దీంతో ఆది, సోమవారాల్లో కన్నబాబు కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్ నుంచి పోటీచేయాలా, స్వతంత్రంగా పోటీచేయాలా అని తర్జనభర్జన పడ్డారు. చివరికి కాంగ్రెస్‌నుంచి పోటీకి నిర్ణయించుకుని అధిష్టానానికి తెలిపారు.
 
 అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇచ్చిన గడువు అప్పటికే ముగియడంతో టికెట్ నిరాకరించినట్టు సమాచారం. దీంతో మరో దారి లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కన్నబాబు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ఎంపిక కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో కేంద్రమంత్రి చిరంజీవి ఆఖరి క్షణం వరకూ కన్నబాబుకు టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర ప్యానల్ అభ్యర్థులను నిలబెట్టి పార్టీని నిర్వీర్యం చేసిన కన్నబాబుకు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని కేంద్రమంత్రి పళ్లంరాజు ప్రశ్నించడంతో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణలు కన్నబాబుకు టికెట్ నిరాకరించారని అంటున్నారు. దీంతో అదే సామాజికవర్గం నుంచి సీతారామరామస్వామినాయుడును పళ్లంరాజు తెరపైకి తెచ్చారు.
 

Advertisement
Advertisement