ఉద్యమవీరునికే పట్టం | Sakshi
Sakshi News home page

ఉద్యమవీరునికే పట్టం

Published Fri, May 16 2014 11:19 PM

kcr got assembly from gajwel

గజ్వేల్, న్యూస్‌లైన్:  గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన టీఆర్‌ఎస్ తన సత్తా చాటింది.  క్షణం క్షణం టెన్షన్...టెన్షన్‌గా సాగిన గజ్వేల్ అసెంబ్లీ లెక్కింపులో చివరకు ఉద్యమవీరున్నే విజయం వరించింది. గజ్వేల్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో ప్రారంభం కాగా, తెలంగాణలోనే కాదు...దేశ, విదేశాల్లోని తెలంగాణవాదులంతా ఫలితం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూశారు.

 మధ్యాహ్నానికే లెక్కింపు పూర్తయి కేసీఆర్‌ను విజేతగా ప్రకటించడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. 21 రౌండ్లుగా చేపట్టిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఐదు మినహా మిగిలిన 16 రౌండ్లలోనూ తన ఆధిక్యాన్ని చాటారు. ఈ నియోజకర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోగల 262 బూత్‌లలో మొత్తం 1,99,062 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కేసీఆర్ 86,372 ఓట్లను దక్కించుకుని సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19,218 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే కేసీఆర్ విజయం నల్లేరుమీద నడకే అయినా, టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి కేసీఆర్‌కు గట్టిపోటీనే ఇచ్చారు. ఈ ఎన్నికలో ప్రతాప్‌రెడ్డికి మొత్తం 67,154 ఓట్లు దక్కాయి.

 ఇక కాంగ్రెస్ తరఫున ఇక్కడ బరిలో దిగినమాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి కేవలం 33,998 ఓట్లే సాధించారు. ప్రాదేశిక ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, టీడీపీలతో పోలిస్తే అత్యధిక ఓట్లను సాధించిన నర్సారెడ్డి, ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం చతికిలపడ్డారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో మొత్తం పదిమంది ‘బరి’లో నిలవగా, ఏడుగురి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement