నెల పైగా నిరీక్షణక్షణం | Sakshi
Sakshi News home page

నెల పైగా నిరీక్షణక్షణం

Published Sat, Mar 29 2014 12:36 AM

నెల పైగా నిరీక్షణక్షణం - Sakshi

అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎవరైనా గుప్పెట మూసి.. ‘లోన ఏముందో చెప్పుకో చూద్దాం?’ అంటేనే ఒకింత ఉత్కంఠ మొదలవుతుంది. మూసిన ఆ గుప్పెట్లో ఉన్నది ఏమైనా.. దాని సైజు ‘గుప్పెడు మించదు’ అన్న ఆధారం మనకున్నా.. ‘ఫలానాదే ఉంది’ అని బల్లగుద్ది చెప్పలేం.

అలాంటిది.. ఎన్నికల బరిలో దిగి, గెలుపు కోసం ప్రచారాన్ని హోరెత్తించి, శక్తియుక్తులన్నింటినీ ధారబోసి, సామదానభేద దండోపాయాలను ప్రయోగించి, కరెన్సీ నోట్లను.. కరపత్రాలకన్నా ధారాళంగా పంచి, మద్యాన్ని మినరల్ వాటర్ కన్నా ఉదారంగా పోయించి, ఓటరు దేవుళ్లను పోలింగ్ బూత్‌ల వరకూ నడిపించిన అభ్యర్థులు.. వారిచ్చింది వరమో, శాపమో తెలుసుకునేందుకు నెలకు పైగా ఆగాల్సి వస్తే ఇంకెంత ఉత్కంఠ నెలకొంటుంది? ఈసారి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన 2,947 మంది అభ్యర్థులకు ఆ పరిస్థితి అనివార్యమైంది.
 
ప్రాదేశిక ఎన్నికలు ఏప్రిల్‌లోనే జరగబోతున్నా.. వాటి ఫలితాలను మే నెలలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. కోర్టు నెల పైగా నిరీక్షణక్షణం ఉత్తర్వులను ప్రధాన పార్టీలు స్వాగతిస్తున్నా.. ప్రాదేశిక అభ్యర్థులు మాత్రం ‘అమ్మో! గుండెలు ఉగ్గబట్టుకుని నెల పైగా ఎదురు చూడాలా? ఎలారా దేవుడా?’ అని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దేశమంతటా జరుగుతాయి కాబట్టి పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహిస్తారు. చివరి విడత పోలింగ్ పూర్తయ్యాకే మొత్తం ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
 
అప్పుడు కూడా అభ్యర్థులకు 15 రోజులకు మించి ఎదురు చూడాల్సిన అగత్యం ఉండదు. అయితే ఈసారి రాష్ర్టంలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థులు అంతకు రెట్టింపు కాలం నిరీక్షించక తప్పడం లేదు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయని, మెజారిటీ ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు తమ వారినే వరిస్తుందని, ఆనక మండల అధ్యక్ష పీఠాలపై కూర్చోవాలని ఆశలు పెంచుకున్న వారు న్యాయస్థానం ఆదేశంతో దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు.

అలాగే జెడ్పీటీసీ బరిలో ఉన్నవారికి, జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్నవారికి కూడా నరాలు తెగే ఉత్కంఠ తప్పదు. కాగా ఫలితాలు వాయిదా పడడంతో వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామంపై పడదని రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
 
వారి నిరీక్షణ మరింత సుదీర్ఘం..!
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల తర్వాతేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన క్రమంలో.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాతే వెలువరించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ఏప్రిల్ ఒకటిన విచారణకు రానుంది. నిర్ణయాన్ని అదే రోజు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేయటంతో ఆ ఎన్నికల బరిలో నిలిచినవారిలోనూ ఆందోళన మొదలైంది.
 
ఈ నెల 30న పోలింగ్, ఏప్రిల్ రెండున ఓట్ల లెక్కింపు జరిగాక.. రెండు, మూడు రోజుల్లో చైర్మన్ లేదా మేయర్ ఎన్నికలు జరిగి ఆ పీఠాలపై కొలువు దీరగలమని ఆశపడ్డ వారు కూడా ‘నలభై రోజుల వరకూ నిరీక్షించాలా?’ అని అసహనానికి గురవుతున్నారు. జిల్లాలో మున్సిపల్ బరిలో తలపడుతున్న 806 మంది అభ్యర్థులు హైకోర్టు ఏమి తీర్పు చెపుతుందోనని బితుకుబితుకుమంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement